- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జూన్ 2 కు 8 ఏళ్ళు
- ఏమి సాధించారు, ఎందులో విఫలమైనారు?
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సాగు నీటికోసం, ఉద్యోగాల కోసం అవస్థలు పడ్డారు. నేరాలు-అవినీతి ఇక్కడ బాగా పెరుగుతూ ఉన్నాయి. మొదటి రెండూ ఆంధ్ర వలస పాలకులు, అధికారులు ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు దక్కవని భావించారు. మిగతా రెండు వలస పాలకులు, వలస పాలకుల అధికారులు లేదా వారి అనుచరులతో కలిసి వృద్ది చేస్తున్నారు అని బలమైన నమ్మకం. అన్ని ప్రభుత్వ సంస్థలలో, విభాగాలలో వలస పాలకుల అధికారులు, లేదా వారి అనుచరులతో నిండి ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ఇక్కడి వనరులను వారే అనుభవించాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గం అని ప్రజలలో వారి బ్రతుకుల పట్ల కసి పెంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు అన్ని వర్గాల ప్రజలు చేశారు. తెరాస ప్రముఖంగా సామాన్యప్రజలలో నమ్మకం పెంచింది. చిట్ట చివరకు 2 జూన్ 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలలో గెలిచి రాష్ట్రాన్ని పాలిస్తోంది. 2014 నుండి తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం ఉంది. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పటికినీ ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అని ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు, అధికారంలో ఉన్న పార్టీలోని అసంతృప్తి వాదులూ అంటూ ఉన్నారు. వీరి మాటల గోలకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకూ కూడా ఎప్పుడో ఒకసారి అనుమానం వచ్చి ఉండవచ్చు. ఆశ్చర్యం ఇందులో ఏం లేదు నాకు.
Also read: న్యాయమూర్తులను ప్రశ్నించడమే కోర్టు ధిక్కారమా?
భారత రాజ్యాంగంలోని 3 వ అధికరణం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటంతో సహా, రాష్ట్రాల సరిహద్దుల మార్పు , రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో సహా పార్లమెంట్ కు శాసనాలను కూడా రూపొందించే అధికారం ఇస్తుంది. ఈ ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రం 29 వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం 1,12,077 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. జనాభా 3,50,03,674 కలిగి ఉంది. 17-09-1948 నుండి 01-11-1956 వరకు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నది. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చేసారు. ఎన్నో ఉద్యమాల తరువాత తెలంగాణ రాష్ట్రంగా 02-06-2014 న వెలసింది.
అభివృద్ధి అంటే?
అభివృద్ధి అంటే ? అభివృద్ధి అనేది వృద్ధి, పురోగతి, భౌతిక, ఆర్థిక, పర్యావరణ, సామాజిక పరమైన వాటిల్లో సానుకూలమైన మార్పును దేశం లేక రాష్ట్రం సాధించుతే పురోగతిలోకి ఆ రాష్ట్రం పోతుంది, ఆ దేశం పోతుంది అని చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే నిరుద్యోగ సమస్య ఉండదని, సాగునీటికి కొదువవుండదని, ప్రభుత్వబడులకు వైభవం కలుగును అని, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం లభించును అని, రైతుల ఆత్మహత్యలకు తావు ఉండదని, మహిళలకు భద్రత పెరుగును అని, అధికధరలు కట్టడి చేయబడును అని, మూతబడిన పరిశ్రమలు మళ్ళీ తెరచుకుంటాయని, మంచినీరు అందరికీ అందునని, గ్రామాలలో పని దొరికే ఏర్పాటు జరుగును, పట్టణాలకు వలసలు తగ్గునని .. ఒక మెరుగైన జీవితం తెలంగాణ ప్రజలకు లభించును అని తెలంగాణ ప్రజలందరిలో ఒక కుతూహలం జనించింది.
ఎవరు సాధించారు తెలంగాణ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికిని (అందరిలో చేసుకున్నాము అనేభావన ఉంది. అందుకే నేనే చేశాను అని తెరాస అధినాయకులు ఒకవైపు, కాదు సోనియమ్మ చలువ అని మరికొందరు, కానే కాదు ఆనాడు పార్లమెంట్ లో చిన్నమ్మ లేకుండినుంటే తెలంగాణ వచ్చేదే కాదు అని ఇంకొందరు అంటున్నారు. ఇక్కడ నా విశ్లేషణ ఏమనగా: రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టవలసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేది కేంద్ర మంత్రివర్గం. అంటే అధికారంలోని పార్టీ. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏ అధికార పార్టీ కూడా లాభంలేకుండా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదు అని ఒక బలమైన అభిప్రాయం. ఇది తప్పుడు సంకేతంను అధికరణ 3 స్వీకరించాల్సి వస్తుంది. అధికరణ 3 చాలా స్పష్టంగా వివరిస్తుంది .. పాలనా సౌలభ్యం కోసమని, రాష్ట్రాలను అభివృద్ధి పరచాలంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యం అని. అయితే అధికారం కోసం చేసే రాజకీయాలు దీన్ని తొక్కి పెడుతున్నాయి) అభివృద్ధి లేదు అని ఒకబలమైన గొంతు, గొంతులు వినిపిస్తున్నాయి. ఈ గొంతులు లేకపోతే ప్రభుత్వాలు చేతనాన్ని కోలుపోతాయి. నిరంతరం అధికార యత్రంగాన్ని మేలుకొలుపుతూ ఉండవలసిందే. అయితే, ఆ విమర్శించే గొంతులలో సద్విమర్శ ఉందా? లేక కువిమర్శ ఉందా? సొల్లు ఉందా? అనేది అతి ముఖ్యమైనది.
Also read: ఆ ఆరుగురు …..
ప్రజాభిప్రాయానికి విలువ
తెరాస 2014 లో గద్దెను ఎక్కేప్పటికే రాష్ట్రంలో “రాష్ట్రం గురించి అర్ధం చేసుకొని, ప్రజల అభిప్రాయాలకు విలువ” ఇవ్వటం ఇక్కడ చాలా అవసరం అయిన విషయం. అది జరగలేదు. అధికార పార్టీ నాయకులు, ప్రతి పక్షాలు, ప్రజా పక్షాలూ చేసింది ప్రభుత్వంలో మాకు స్థానం కావాలి, మాకు స్థానం కావాలి .. అని ఒక అనాలోచిత విచిత్రమైన ఘటనలు వారందరిలో చోటుచేసుకున్నాయి. మరో వైపు ఆంధ్ర వలస పాలకుల జిత్తులు, మాకు, మా భూములకు రక్షణ లేదు అని ఒక గందరగోళం, ఇంకో వైపు న్యాయవ్యవస్థలో మెజారిటీ న్యాయమూర్తులు ఆంధ్ర వలసపాలకుల ప్రతినిధులు. తెలంగాణ ప్రజల అభిలాష ఏంటిది అని చెప్పే వారు , ప్రజల గురించి మాట్లాడే ప్రతినిధులు కరువయ్యారు. తెరాస లో ఉన్న మేధావి వర్గం రెండుగా చీలిపోయింది. ఒక వర్గం తెరాసతో ఉంటే, మరో వర్గం కోదండరాం తో ఉండిపోయారు. ఈ రెండు గ్రూపులు తెలంగాణను సాధించాము మా పని అయిపొయింది అని అనుకున్నారు. అడపా దడపా వ్యక్తిగత దూషణలకు మాత్రమే వీరు పరిమితం అయ్యారు.
ఇతర పార్టీల పరిమితులు
కాంగ్రెస్, బీజేపీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు, బహుజన పార్టీలు కుల – మత రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఐక్యత లేదు, ప్రజాఉద్యమాలను నిర్మించేది మరచిపోయారు. న్యాయస్థానంలో ‘ప్రజావాజ్యం’ పేరుతో ఒక పిటిషన్ వేసి, తెరాసను వ్యక్తిగత దూషణ చేసి మురిసి పోతున్నారు. బీజేపీ .. రాష్ట్రంలో – దేశంలో ప్రజా సమస్యలు ఏం లేనట్టు అటూ – ఇటూ తిరిగి హిందూ – ముస్లీమ్ తగాదాలను ఏ “రేంజి” లో పెట్టించగలమా? అనే ప్రణాళిక వరకు మాత్రమే పరిమితం అయ్యారు. పొద్దున్నే లేస్తే ఈ రెండు పార్టీలకు హైదరాబాద్ పాత బస్తీలోని ముస్లీమ్ సమాజాన్ని బలంగా రిప్రెజెంట్ చేసే ఎంఐఎం తోనే దోస్తీ . బహుజనుల రాజకీయ పార్టీల దగ్గెరకు పోతే .. ఇదో నన్ను తిట్టావు “గీ కేసు పెడతాను – గా కేసుపెడతాను” అనే దగ్గెరనే ఆగిపోయారు.
అందరి నోళ్ళూ మూయిస్తున్న తెరాస
తెరాస పరిస్థితి రాష్ట్ర సాధనలో మేమే ముందు నడిచాము, మేమె సాధించాము అని అందరి నోళ్లు చాలా గమ్మత్తైన పద్దతులలో మూపిస్తున్నారు, మూస్తున్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను ఒక సరిఅయిన ‘పద్దతి’ లో వాడబడక పోవటం జరిగింది. జరుగుతోంది. అయితే, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం అని చెపుతున్నారు. వారి లెక్కల ప్రకారం..2018-19 ఆర్థిక సంవత్సరంలో మునుపటి సంవత్సరం కన్నా రూ. 109,219 కోట్ల ($14 బిలియన్లు, 17.93% CAGR) మెరుగుపడింది అనియు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ (హైదరాబాద్) నుండి ఐటి ఎగుమతులు రూ. 128,807 కోట్లతో (US$15 బిలియన్లు) దేశంలో రెండవ స్థానంలో నిలిచింది అనియు చెపుతున్నారు. కానీ ఇన్ని లక్షల మందికి ఉద్యాగాలు కల్పించామని 2014 నుండి ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయలేదు.
Also read: నడుస్తున్న కథ
ఏది నిజం, ఏది అబద్ధం?
08 మార్చి 2022 నాడు వచ్చిన వార్తల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ పెట్టుబడుల వల్ల దాదాపు 29,000 ఉద్యోగాలు వస్తాయని బడ్జెట్‌లో పేర్కొంది. TS-iPASS కింద ప్రభుత్వం 1.07 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని, 8.17 లక్షల మందికి ఉపాధి కల్పించిందని కూడా బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 4, 900 కొత్త పరిశ్రమలను రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయని చెపుతున్నారు. ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్లు చెపుతున్నారు. నిరుద్యోగులు మాత్రం ఇది తప్పని రోడ్లపైకి వచ్చి హర్తాళ్లు చేసారు. ఏది నిజం ఏది అబద్ధం?
వ్యవసాయంలో వెనకబాటు ఎందుకు?
ఇంత అభివృద్హిని ఐటీ రంగం వైపు చూపితే, ప్రధానమైన వ్యవసాయ రంగంలో ఎందుకు వెనకబడి ఉన్నట్లు? రైతుల దగ్గెర వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనలేని పరిస్థితి ఏంటిది ? కేంద్ర ప్రభుత్వంపైననే ఎందుకు ఆధార పడుతున్నట్లు? శాస్త్రీయ సాంకేతిక పద్దతులతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు? సాంకేతిక రంగాన్ని వృద్ధి పరచే నిపుణులు వ్యవసాయ రంగాన్ని వృద్ధిచేసి నిపుణులు ప్రభుత్వం దగ్గెర లేరని అనుకోవచ్చా? సాంకేతిక రంగంకోసం నిపుణులను కిరాయికి తీసుకుంటున్నారు, అదే పద్దతిని ఈ రంగంలోనూ వాడవచ్చు కదా?
వర్షాధార వ్యవసాయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు చేసే వ్యవసాయం ఎక్కువగా వర్షాభావంపై ఆధారపడి ఉండేది. సకాలంలో వర్షాలు పడక పంట నష్టం జరిగేది. మారుతున్న వాతావరణ పరిస్థితులు తీవ్రమైన కరువును సృష్టించేవి. భూగర్భజలం లేక నీటి వనరుల కొరత బాగా ఉండేది. నీటి కోసం ప్రజలు బోరు బావులు తవ్వేవారు. అవి విఫలమైయ్యేవి. దీనిమూలంగా తీవ్రాతి తీవ్ర రుణభారంతో వ్యవసాయదారులు అనుభవించారు. బ్యాంకులు ఋణాలు ఇచ్చి వసూళ్లకోసం ఊర్లమీద పడేవారు. ఇంట్లో – దొడ్లో ఏమున్నా ఎత్తుకెళ్ళేవారు. బ్యాంకు సంస్థలు రైతులపట్ల వైఫల్యం చెందాయి. వీటిని ఎదుర్కొని నిలబడలేక రైతులు – రైతు కుటుంబాలు వణకిపోయేవారు, ఆత్మహత్యలకు పాల్పడేవారు. నీటిపారుదల అభివృద్ధి ఎక్కువగా గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులు మీదనే ఆధారపడి వుంది. తెలంగాణలో సుమారు 46,531 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం ట్యాంకులు & చెరువులను పునరుద్ధరించే పనిలో ఉన్నాను అని చెపుతున్నది. ఇప్పటివరకు 12 భారీ ప్రాజెక్టులను పూర్తిచేసినట్లు, 16 ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలో ఉన్నట్లు(25,000 ఎకరాలకు పైన నీరందించును), 33 మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు, 6 ఇంకా నిర్మాణంలో( 5000 నుండి 25,000 ఎకరాల వరకు నీరందించును) ఇంకా చిన్న తరహా ప్రాజెక్టులు 5000 ఎకరాల వరకు నీరందించును అని ప్రభుత్వ లెక్కలు చూపుతున్నాయి.
సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు: రైతులకోసం (1) రైతు బంధు (2). బాలింతలకు కెసిఆర్ కిట్ / ఆరోగ్య లక్షి (3). మిషన్ కాకతీయ – మిషన్ భగీరథ (4). హరిత హారం (5). కళ్యాణి లక్ష్మి – షాదీ ముబారక్ (6). ఆసరా పెన్షన్స్ (7). పేదలకు ఇళ్ళు,
అవినీతికి కంప్యూటర్ దాసోహం
వృద్ది రేటు తగ్గింది అని ప్రభుత్వం మాత్రం చెపుతుంది. జనాభా లెక్కల ప్రకారం చూస్తే నేరాలు తగ్గలేదు. ఎన్కౌంటర్ సంస్కృతి అలానే ఉంది. మానభంగాల సంస్కృతి అలానే ఉంది. మత- కుల గొడవలు పెరుగుతూ పోతున్నాయి. వృద్ధికి- అభివృద్ధికి చిన్న రేఖనే. అయితే వీటిని ఎందుకు అరికట్టలేకపోయారు? అవినీతి అలానే ఉంది. ఇంకా పెరిగింది అని NCRB లెక్కలు చెపుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ విభాగాలలో అవినీతికి కొత్త రెక్కలు వచ్చాయి. ధరణి పేరుతో అధికారులు విచ్చలవిడిగా తయారు అయ్యారు. సిట్లమీద కునుడే లేదు. RoR అధికారాలే లేవని కంప్యూటర్స్ వైపు చూపుతున్నారు. అవినీతికి కంప్యూటర్ కూడా లొంగిపోతుంది అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.
పెరుగుతున్న నేరాలు
నేరస్థులకు ఫ్రెండ్లీ పోలీస్. ఫిర్యాదు దారులకు సున్న. ఫిర్యాదు దారులను కూర్చోపెట్టి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. పనికి పోతురాజు, తిండికి పెద్దన్న పాత్ర పోలీసుల ది అయ్యింది అని సామాన్య ప్రజలకు పోలీసులు అభిప్రాయం కలిగిస్తున్నారు. పోలీస్ బాస్ బడా నేరస్థులకు వెంటనే రెస్పాండ్ అవుతున్నారని, బాధితులకు ‘నో ఆన్సర్‘ అని తెలంగాణ సమాజంలో ప్రబలంగా చర్చ ఉన్నది. వారు వాడే మొబైల్ ఫోన్ ప్రజలది, ప్రైవేట్ ఆస్తిగా భావిస్తున్నారు అని చురకలు పెడుతున్నారు. బాస్ కింద పనిచేస్తున్న కొందరు అధికారులు ‘బాస్‘ ను ఫాలో అవుతున్నారు అని సామాజిక కార్యకర్తల అనుభవం. తెలంగాణ రాష్ట్రంలో NCRB లెక్కల ప్రకారం 2017 లో 1,33,197 నేరాలు జరిగాయి. 2018 లో 1,26,858 నేరాలు జరిగాయి. 2019 లో 1,31,254 జరిగాయి. 2020 లో 1,47,504 నేరాలు జరిగాయి.
పై రెండు వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి? కారణం పాలకులు, ఆ వ్యవస్థల పోర్ట్ ఫోలియోలు కొందరికే అందుబాటులో ఉండటం. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు MLA లు, కొందరు మంత్రులు అవినీతిపరులుగాను, వివాహేతర సంబంధాలను కలిగివున్నారని చాలా బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. అందుకే ప్రభుత్వం ప్రజలకు చేసిన “వాగ్దానాలను” చెప్పిన సమయానికి పూర్తి చేయలేక పోతున్నదని, అన్ని రంగాలలో అందుకోవాల్సిన అభివృద్ధిని ప్రభుత్వం సాధించలేక పోతున్నదని ఒక విమర్శ ఉంది. దీన్ని ప్రభుత్వం ఎలా సరిచేస్తుందో వేచి చూడవలసిందే.
మళ్ళీ గెలవాలంటే చాలా మారాలి
2023 ఎన్నికలలో తెరాస తిరిగి గెలవాలి అంటే చాలా మార్చుకోవలసి ఉంది. అది ఈ రోజు నుండే మొదలు పెట్టవలసిందే. లేకపోతే చాలా పెద్ద మూల్యం మూటకట్టుకోవలసిందే. ఈటెల తెరాసను వీడటం, కొందరు అసంతృప్తవాదులు చేస్తున్న ప్రచారం, మల్లారెడ్డి లాంటి మంత్రులను తెరాస ప్రభుత్వంలో ఉండటం కాంగ్రస్ – బీజేపీ లకు లాభం ఇస్తుందా లేక తెలంగాణ రాష్ట్రం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటదా? లేక ఎవరో చేస్తున్న తప్పుడు పనులకు తెరాస జవాబుగా నిలబడుతదా? లేక సరిదిద్దే పని మొదలు పెడతదా కాలం జవాబు చెప్పాలి.
Also read: ఆనందం … ?
జయ వింధ్యాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం (PUCL-TS)
# 9440430263