జస్టిస్ హిమా కోహ్లీ
- ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై
- హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం (జనవరి 7) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె వ్యవహరించారు. దేశ వ్యాప్తంగా గల హైకోర్టుల్లో ప్రస్తుతం మహిళా ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ ఒక్కరే కావడం విశేషం.
తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితురాలైన జస్టిస్ హిమా కోహ్లీ 1959 లో జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీలో లా కోర్సు పూర్తి చేశారు. 1984లో హిమ కోహ్లీ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1999-2004 మధ్య న్యూఢిల్లీ మున్సిపల్ మున్పిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2006 మే 29 న ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టులో పర్మినెంట్ జడ్జిగా నియమితురాలయ్యారు. ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా ఉన్న ఆమెకు ప్రమోషన్ మీద తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం
దేశంలోని హైకోర్టుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 78 మంది మహిళలు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991లో దేశంలో తొలి ప్రధాన న్యాయమూర్తిగా లీలాసేథ్ నియమితులయ్యారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం జస్టిస్ సుజాతా మనోహర్, జస్టిస్ కెకె ఉష, జస్టిస్ మంజులా చెల్లూర్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహించారు. జస్టిస్ మంజుల చెల్లూర్ ప్రతిష్ఠాత్మకమైన బాంబే, కోల్ కతా హైకోర్టులలో కూడా బాధ్యతలు నిర్వహించారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జ్ఞాన సుధామిశ్రా పనిచేశారు. ఆమె పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతకుముందు ఆమె ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2018లో జస్టిస్ గీతామిట్టల్ జమ్ము కశ్మీర్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2020 డిసెంబరు 8న పదవీ విరమణ చేసిన గీతా మిట్టల్ జమ్ము కశ్మీర్ కు తొలి మహిళా సీజే కావడం విశేషం.
ఇది చదవండి: ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగిరం చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్