హైదరాబాద్: ప్రదాని ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) లో ప్రసంగించిన బోయినపల్లి మార్కెట్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మంగళవారంనాడు సందర్శించారు. అక్కడ చెత్త, కుళ్ళిపోయిన కూరగాయలు పోగు చేసి వాటి నుంచి విద్యుచ్ఛక్తినీ, ఎరువునూ తయారు చేయడాన్ని స్వయంగా చూసి అభినందించారు. దీనిని సిసలైన ఆత్మనిర్భర స్పూర్తిగా అభివర్ణించారు. ఇటువంటి సృజనాత్మకమైన ఆలోచన చేసినందుకు సిఎస్ ఐ ఆర్, ఐఐసీటీ శాస్త్రజ్ఞులను గవర్నర్ ప్రశంసించారు. శాస్త్రజ్ఞుల ఆలోచనను ఆచరణలో అమలు చేసి సత్ఫలితాలు సాధించిన అగ్రికల్చరల్ మార్కెటింగ్ అధికారులను ఆమె అభినందించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోనూ, దేశవ్యాప్తంగానూ బోయినపల్లి నమూనాను అమలు చేయాలని ఆమ పిలుపునిచ్చారు. వ్యర్థం నుంచి అర్థం (డబ్బు)సృష్టించడమంటే ఇదేననీ, ఇది గొప్ప ప్రయోగమనీ గవర్నర్ అన్నారు. రెన్యూయబుల్ ఎనర్జీ పర్యావరణానికి మంచిదనీ, ఈ ఆలోచనను విస్తృతంగా ప్రోత్సహించాలనీ తమిళిసై చెప్పారు.
వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్దనరెడ్డినీ, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయినీ, ఇతర అధికారులనూ గవర్నర్ సత్కరించారు. అంతకు ముందు గవర్నర్ మార్కెట్ యార్డ్ అంతటా కలియతిరుగుతూ కూరగాయలు అమ్మేవారితోనూ, రైతులనూ మాట్లాడారు. వారంతా సంతోషం వెలిబుచ్చారు.