సిద్దిపేట: సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దుద్దెడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మేనల్లుడు హరీష్ రావును ప్రశంసలతో ముంచెత్తారు. సిద్దిపేటకు ఆణిముత్యం లాంటి నాయకుడు హరీష్ రావును మీకు అప్పగించానన్నారు. నా పేరును కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడని అన్నారు. హరీష్ రావును పొగుడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఈటల రాజేందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జె. సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రూ. 45 కోట్ల వ్యయంతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఎకరాల స్థలంలో దుద్దెడ వద్ద నిర్మించబోయే ఐటి టవర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అమెరికాలోని నాలుగు ఐటి కంపెనీలు సిద్దిపేట ఐటి టవర్ నుండి కార్యకలాపాలు నిర్వహించడానికి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
సిద్దిపేట సమీపంలోని మిట్టపల్లిలో రూ. 22 లక్షల వ్యయంతో 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.715 కోట్ల వ్యయంతో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు.
సిద్దిపేట పట్టణంలో 45 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 145 కోట్ల వ్యయంతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. అన్ని మతాలకు చెందినవారికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సర్వమత పెద్దలు సర్వమత ప్రార్థనలు జరిపారు. కెసిఆర్ నగర్ గా నామకరణం చేసిన ఈ గృహ సమముదాయం మొట్టమొదటిది.