మనసులోని ఆలోచనను ఎక్కడ బహిర్గత పరుస్తుందోనని, నాలుకకు కూడా తెలియ నీయకుండా, ఎట్టి స్థితిలోనూ ఎవరికీ అంతు చిక్కనీకుండా, ఆరు నూరైనా సరే అనుకున్నది అమలు చేయ బూనడం తెరాస అధినేతకే సొంతం. ఉద్యమ పార్టీగా తెరాస స్థాపన, ఉద్యమ పార్టీ ద్వారా రాజకీయ చదరంగంలో పావులు కదపడం, తెరాసను పక్కా రాజకీయ పార్టీగా మార్చడం,, ఆమరణ దీక్షకు దిగడం చివరకు తెలంగాణ సాధించడంలో విజయ సోపానాన్ని అధిష్ఠించడం, తొలి ముఖ్యమంత్రి కావడం మినహా, తొలి శాసనసభ రద్దు వరకూ మంత్రి వర్గ మార్పులు చేపట్టక పోవడం, గడువున్నా శాసన సభను రద్దు చేయడం, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందస్తుగా వెళ్ళి ఎన్నికల కదన రంగానికి కాలు దువ్వడం…ఇలా ఎన్నో అంశాలలో గులాబీ బాస్ మనస్తత్వం, వ్యవహార శైలి తలపండిన రాజకీయ మేధావులకు సైతం అంతుచిక్కనివ్వని వైనం.
హఠాత్తుగా హస్తినకు వెళ్ళి (నూతన జోనల్ వ్యవస్థ ఆమోదముద్ర కోసం అన్నట్టుగా), ప్రధాని, కేంద్ర మంత్రులతో కలిసిన అనంతరం లక్షలాది మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించడం, వెనువెంటనే శాసనసభ రద్దు, తక్షణమే ఆపద్ధర్మ ప్రభుత్వాధినేతగా, గవర్నర్ ద్వారా కొన సాగింప బడడం, కేంద్ర ఎన్నికల సంఘ బాధ్యులు రాష్ట్రంలో ఎన్నికల అనుకూల పరిస్థితుల బేరీజుకై, హుటాహుటిన రాష్ట్ర రాజధానికి వచ్చి, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమాలోచనలు చేయడం, తదితర క్రమానుగత కార్యక్రమాలు రాజకీయ విశ్లేషకులకూ ఏమాత్రం ఊహకు అందకుండా అనూహ్యంగా జరపడంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసిఆర్ తమదైన వ్యూహ రచనా విధానంలో ఆందె వేసిన చేయని పలు మార్లు ప్రదర్శించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కేసిఆర్ వ్యూహ రచనా దురంధరత్వం విపక్షీయులకు ఏమాత్రం మింగుడు పడక ప్రాణ సంకటంగా మారిన సంఘటనలుగా మారాయనడంలో ఎలాంటి అతిశయోక్తికి తావు లేదు.
Also Read : జీహెచ్ఎంసీ ఫలితాలు – పరిణామాలు
ముందస్తు ఎన్నికలకు చంద్రశేఖర్ రావు సిద్ధమవు తున్నారని, ఎపుడైనా శాసనసభను రద్దు పరచ వచ్చునని, ప్రసార, ప్రచార, సామాజిక మాధ్య మాలు కథనాలు ఎన్ని ముందుకు తెచ్చినా, కల్వ కుంట్ల వారి మనోగతం ఎవరికీ ఊహకందదని తెలిసిన విపక్షీయులు, ముందస్తుకు వెళ్ళనుండడంపై విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమైనారు తప్ప, పరిస్థితులకు అనుగుణంగా, ప్రణాళికా బద్దంగా వ్యహరిస్తూ, నాలుగేళ్ళకు పైగా, ఎదురు చూస్తున్న అవకాశాన్నిసక్రమంగా వినియోగించుకునేందుకు అప్పటి వరకూ చేసిన కృషి శూన్యం. తీరా విపక్షీయులకు స్వప్న సాక్షాత్కారమైనా కాని విధంగా, శాసనసభ రద్దు చేసిన మరోక్షణం ఏకంగా తమ పార్టీ అభ్యర్థులుగా 105మందిని ఏకబిగిన ప్రకటించడం విపక్షాలకు కోలుకోలేని అంశం అయిందన్నది వాస్తవం. అలాంటి సంధి కాలంలోనే గతం కన్నా మిన్నగా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగిందనేది నూటికి నూరుపాళ్లు నిజం.
తమ వ్యూహరచనలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా, పార్టీలో అంతర్గత పోరు చోటుచేసుకుంటున్నా, అక్కడక్కడా అసంతృప్తి, అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నా, కేసిఆర్ సదా ఆత్మ స్థైర్యం కనబరుస్తూ, అసమ్మతి, అసంతృప్తి రాగాలను పెడచెవిని పెట్టి, పూర్తి బాధ్యతలను తానే స్వీకరించడం చర్విత చర్వణమే. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు గతంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నా, లక్ష ఓట్ల మెజారిటీతో సునాయాసంగా గెలిచి తీరుతా మనుకున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తెరాస అధ్యక్షునికి మింగుడు పడని అంశంగా మారింది. ప్రజల నాడిని పసిగట్టడంలో అందె వేసిన చేయిగా లబ్ధ ప్రతిష్టులైన కేసిఆర్, దుబ్బాక అలాగే గ్రేటర్ ఎన్నికలలో, సదరు అనుభవాన్ని వినియోగించు కోలేక పోయారా, తెలిసీ ముందుకు వెళ్ళారా అన్నది సమాధానం దొరకని ప్రశ్నగా మారింది.
Also Read : గ్రేటర్ లో ప్రముఖుల బంధువులకు తప్పని పరాజయం
గ్రేటర్ ఎన్నికలలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పురమాయించిన గులాబీ దళపతి, దుబ్బాకలో ఎందుకు వినియోగించ లేదని పార్టీ శ్రేణులలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలలో చేసిన హడావుడి దుబ్బాకలో చేస్తే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు భాజపాకు ఈ జోష్ ఉండేదే కాదని, గ్రేటర్ ఫలితాలు మరోలా ఉండేవని భావనలు పార్టీ శ్రేణులలో వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కెసీఆర్ వ్యూహ రచనా నైపుణ్యంతో తెలుగు దేశం ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకోగా, కాంగ్రెస్ ఉనికి కోసం ఆరాట పడే స్థితిలో కొట్టు మిట్టాడు తుండగా, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ద్వారా భాజాపా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రూపు దిద్దుకున్న వైనం స్పష్టంగా కనిపిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండడం, రానున్న కాలంలో జరగనున్న మార్పుల దృష్ట్యా తెరాస అధినేత ప్రస్తుత రాజకీయ యవనికపై చోటు చేసుకోనున్న అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
Also Read : జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు