నిజమాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్, ఉమ్మడి నిజమాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
2014 నుంచి 2019 వరకు నిజమాబాద్ లోక్ సభ ఎంపీగా కవిత ప్రాతినిథ్యం వహించారు. 2019లో నిజమాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఎమ్మెల్సీగా పోటీచేసి ఘన విజయం సాధించారు.కొద్ది రోజుల క్రితమే కవిత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా …ఆమె వ్యక్తిగత డ్రైవర్ కు కరోనా నిర్థారణ కావడంతో ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కుమార్తె కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లు ఉండగా కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి వి. సుభాష్ రెడ్డి వరుసగా 56, 29 ఓట్లు మాత్రమే సంపాదించి ధరావత్తు కోల్పోయారు. కవితకు మొదటి రౌండ్ లోనే 531 ఓట్లు లభించాయి. మెజారిటీ మార్కు 413 కంటే 118 ఓట్లు అధికంగా వచ్చాయి. బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్ రెడ్డి కవితకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం కేసీఆర్ ని అభ్యర్థించారు. లోగడ టీఆర్ ఎస్ టిక్కెట్టు పైన ఎన్నికైన డాక్టర్ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేశారు. కవితకు ఎంఎల్ సీగా ఒకటిన్నర సంవత్సరం పదవీకాలం ఉంటుంది.