• నితీష్ ను ప్రధానిని చేస్తామని హామీ
• ఆర్జేడీలోకి జేడీయు ఎమ్మెల్యేలు?
బీహార్ లోని జేడీయూ చీలిక దిశగా పయనిస్తోందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు అయినప్పటినుండి ఎన్డీఏ కూటమి ఆందోళనలో ఉందని ఆర్జేడీ వాదిస్తోంది. అధికార జేడీయుకి చెందిన దాదాపు 17 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆర్జేడీ నేత ఉదయ్ నారాయణ్ చౌదురి తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆర్జేడీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీహార్ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నాయి. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తాము ఉల్లాఘించబోమని మొత్తం ఎమ్మెల్యేలు బృందంగా వస్తేనే స్వాగతిస్తామని ఆర్జేడీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం నితీష్ కుమార్ ఇవన్నీ కల్పితాలని, నిరాధారఆరోపణలని కొట్టిపారేశారు. అయితే ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో అవసరం లేకున్నా ఆరుగురు జేడీయు ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవడంపై నితీష్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నితీష్ ను ప్రధానిని చేస్తాం:
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ఘటనపై జేడీయుకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన ఘటనను ఉదహరిస్తూ బీహార్ జేడీయూ ఎమ్మెల్యేలపై నేతలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మిత్ర పక్షంగా ఉంటూ బీజేపీ వెన్నుపోటు పొడుస్తోందని అలాంటి పార్టీని వీడి మహాకూటమి లో చేరాలని ఆర్జేడీ నేత తేజస్వి ఆఫర్ చేశారు. నితీష్ ను ప్రధానిని చేసేందుకు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడతామని అన్నారు. గతంలో ఆర్జీడీతో చేతులు కలిపిన సమయంలో ఆయన్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టామని గుర్తుచేశారు. బీజేపీతో కలిసుంటే బీహార్ లో కూడా జేడీయును చీల్చుతారని అపుడు ఆ పార్టీ ఉనికికే ప్రమాదమని అన్నారు.
ఇది చదవండి: నాలుగోసారి నితీశ్ కుమార్ స్వారీ