- వెబ్ కాస్ట్ పరిజ్ఞానం ద్వారా సమాచార సేకరణ
- స్మార్ట్ ఫోన్లు, సీసీ కెమెరాల అనుసంధానం
- వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమన్వయానికి ఏర్పాట్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన పోలీసు యంత్రాంగం చీమ చిటుక్కుమన్నా స్పందించేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలీసు నగరంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. వీటిని నగరంలో రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు అనుసంధానిస్తున్నారు.
గస్తీ కోసం ప్రత్యేక బలగాలు
ప్రచార పర్వం నుంచి ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకూ పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నారు. పోలింగ్ ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. 2500 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ పరిజ్ఞానం ద్వారా సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్యయం కోసం వీడియో కాన్ఫరెన్స్ లను ఏర్పాటు చేయనున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమన్వయం
నగరంలో సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలలో రోజుకు రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, కానిస్టేబుళ్లు, డీసీపీలు, అవసరాన్ని బట్టి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని సమస్యల పరిష్కారానికి అప్పటి కప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ప్రస్తుత ఎన్నికల్లో పలు నియోజకవర్గాలలో పోటా పోటీ వాతావరణం నెలకొనడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలున్న నియోజకవర్గాలలో అభ్యర్థుల బంధువులు, అనుచరుల కదలికలపై నిఘా ఉంచనున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఇప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ నిస్తున్నారు. నగర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం 21 ప్రాంతాలలో తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
శాంతి భద్రతల పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్ లు
ఎన్నికల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ఎన్నికల పరిశీలనకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లను నియమిస్తూ హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.