Sunday, December 22, 2024

మానవ సంబంధాల్ని బలపరుస్తున్న టెక్నాలజీ

గతంలో మనవాళ్ళెవరైనా విదేశాల్లో ఉంటే ఇటూ,అటూ ఉత్తరాలు నడిచేవి. అవి నౌకల్లో వెళ్ళి ఏ రెండు, మూడు నెలలకో అందేవి. తర్వాత ఎయిరోగ్రామ్ లొచ్చాక ఉత్తరాలు విమానాల్లో వెళ్ళి వారం, పది రోజుల్లో అందేవి. మాట్లాడాలనుకుంటే విదేశీ ట్రంక్ కాల్ బుక్ చేసి, గంటలు గంటలు ఎదురు చూస్తే గాని లైన్ కలిసేది కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన, వస్తున్న విప్లవాత్మకమైన, అనూహ్యమైన పరిణామాల వల్ల ప్రపంచమంతా (Global village) ఒక చిన్న గ్రామమేమోననే భావన కలుగుతూ ఉంది. మనం మన నగరాల్లో తిరగడం కష్టమౌతూ ఉంది కానీ విదేశాలకు చేరడం సుళువవుతోంది.  హైదరాబాద్ లో ఎయిర్ పోర్టు నుంచి కార్లో ఇంటికి చేరేలోగా విమానమెక్కినవాడు దుబాయ్ చేరిపోతున్నాడు. చేరిపోయినానని ఫోన్ కూడా చేసి చెబుతున్నాడు. ఇది ఇప్పటి పరిస్థితి. సెల్ ఫోన్లు వచ్చాక జీవీతాల్లో సంభాషణలు పెరిగాయి. ఏండ్రాయిడ్ ఫోను, ఐ-పోన్లలో వచ్చిన వాట్సప్, స్కైప్ (skype) లాంటి ఆప్స్ (Apps) బాగా ప్రచారంలోకి వచ్చాయి. మనుషుల మధ్య దూరాలు తగ్గాయి. గతంలో ఎవరైనా ఊరి నుండి హైదరాబాద్ వెళ్ళివస్తున్నాడంటే చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు తిరిగి వస్తున్నారన్నా అందులో విశేషమేమీ ఉండడం లేదు. ఎందుకంటే ఆ విషయం మామూలు అయిపోయింది. నగరాల్లోనైతే ప్రతి ఇంటికీ దాదాపు ఎవరో ఒకరిద్దరు విదేశాల్లో ఉంటున్నారు. యువకులంతా విదేశాల్లో స్థిరపడుతూ ఉంటే, పెద్దవాళ్ళు ఇక్కడే ఇండియాలో ఉంటున్నారు. వారికి ఆనందాన్ని, మనో ధైర్యాన్ని ఇచ్చేది నేటి శాస్త్ర సాంకేతిక పరికరాలే. ఉన్నఫళంగా ఎప్పుడంటే అప్పడు విదేశాల్లో ఉన్నవారితో మాడ్లాడుకోవడం జరుగతూ ఉంది గనక, ఇక్కడ స్వదేశంలో ఉండిపోయినవాళ్ళకు బెంగగా ఉండడం లేదు.

Also read: ‘‘భరతమాత ముద్దుబిడ్డ నెహ్రూ:’’ అటల్ బిహారీ వాజపేయి

ఫోన్లో కనబడి మాట్లాడుకుంటున్నాం

ఒక నలభై యేళ్ళ క్రితం ఫోన్లలో మనుషులు కనబడి మాట్లాడుతారట-అని ఇక్కడ విచిత్రంగా చెప్పుకునేవాళ్ళం. అదే నిజమైంది. ఆ జ్ఞానం, ఆ పరికరాలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. మూడు నాలుగు రోజులకు ఒకసారో, వారం రోజులకొకసారో కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో స్కైప్ లో కాల్ చేసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల మనకు మన వాళ్ళున్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు, మన బాగోగులు చూసుకుంటున్నారు అనే ఆత్మస్థైర్యం లభిస్తుంది. అది చాలా విలువైనది. మానవ సంబంధాలు బలపడడానికి శాస్త్ర సాంకేతిక రంగాల ఫలితాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ ఏ దేవుడి కటాక్షం వల్లనో దొరకలేదు. బాబాలు, పండితులు, జ్యోతిష్కులు, ప్రవచనకారుల వల్ల …వాళ్ళ చుట్టూ దండాలు పెడుతూ తిరిగే రాజకీయ నాయకుల వల్ల ఈ వసతులు జనానికి లభించలేదు. కేవలం శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణుల వల్లే ఇవి సాధ్యమయ్యాయి. ఇంకా అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం!

Also read: ప్రకృతి శరణం గచ్ఛామి

ఉదాహరణకు మీరు ఆస్ట్రేలియాలో ఉన్న మీ పిల్లలతో మాట్లాడుతున్నారనుకుందాం. ఈ దేశం వేరు ఆ దేశం వేరు. ఇక్కడ ఎండలు మండుతూ ఉంటే అక్కడ చలివేస్తుంది. ఇక్కడి కాలమానం వేరు. అక్కడి కాలమానం వేరు. మీరు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారంటే ఏమిటీ? స్థలాన్ని, కాలాన్ని అధిగమించి సంభాషించుకుంటున్నారన్నమాట. ఈ విశ్వాంతరాళంలో భూమి ఏమైనా నిలకడగా ఉందా?  అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది. అందువల్ల వేరువేరు దేశాల్లో కాలమానం వేరువేరుగా ఉంటుంది. దేశాలు వేరైనా, అక్కడి జీవన విధానాలు, శైలులు వేరైనా, మానవ సంబంధాలన్నీ ఒక్కటే! అవి కలుపుకుంటూనే ఉండాలి. నిలుపుకుంటూనే ఉండాలి. ప్రస్తుతం అదే జరుగుతోంది. నగరాల్లో ఉంటూ, ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నవారికి ఇవి మామూలు విషయాలు. ఇంతకూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం ఎలా జరుగుతోందీ అంటే – మన ఆండ్రాయిడ్ ఫోన్ లకూ, డెస్కెటాప్ లకూ లేదా ఎల్ ఇ డి టీవీలకూ కెమెరాలు అమర్చి ఉంటాయి కాబట్టి! వాటిద్వారా ఇక్కడి వారు ఆ దేశంలో ఉన్నవారికి, ఆ దేశంలో ఉన్నవారు ఇక్కడ ఈ దేశంలో ఉన్నవారికి తెరమీద కనిపిస్తూ ఉంటారన్నమాట! అలా ఎవరి పనులు వారు చేసుకుంటూనే, ఒకరినొకరు చూసుకుంటూనే మాట్లాడుకోగలుగుతున్నారు.

Also read: కరోనా నేర్పిన కొత్త పాఠాలు

స్థల, కాల పరిమితులను అధిగమిస్తున్నాం

అలాఎదురెదురుగా వీడియో  కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఇష్టమైన చిన్నపిల్లలెవరైనా స్క్రీన్ మీద కనిపిస్తే, గబుక్కున లాక్కొని ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది. అలాగే వాళ్ళక్కూడా ఎదురుగా కనిపించే పెద్దవాళ్ళమీద అమాంతం దూకాలనిపిస్తుంది  కానీ అది వీలుకాదు.  వేల మైళ్ళు విమానంలో ప్రయాణిస్తే తప్ప ఆ చిన్నకోరిక తీరదు.  ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ పద్ధతి మరో ముందడుగు వేసింది. దాన్ని హాలోపోర్టేషన్ (HALOPORTATION) అని అంటున్నాం. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి పరిశోధనల వల్ల ఇది వాడుకలోకి రాబోతోంది. దీనివల్ల ఒక స్థలం నుండి మరో స్థలంలోకి, ఒక కాలం నుంచి మరో కాలంలోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ లో జరగుతున్నదేమిటీ అంటే – ఎవరి స్థలాల్లో వారుండడం, ఎవరి కాలాల్లో వారుండడం – కలసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే హలోపోర్టేషన్ వల్ల – మీరు కాల్ చేసి పిలిస్తే, ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలు ఇక్కడ మీ డ్రాయింగ్ రూంలోకి వచ్చి తిరగగలుగుతారు.  అలాగే వారు మిమ్మల్ని కాల్ చేస్తే, మీరు వెళ్ళి అక్కడి ఇంట్లో తిరుగుతారు. ఇందులో ఏ  దేవుడూ లేడు. ఏ మాయలూ లేవు. అంతా మనిషిసాధిస్తున్న ప్రగతి మాత్రమే ఉంది. మనిషి మేధోశక్తి,  నిపుణత మాత్రమే ఉన్నాయి. ఇందులో సాంకేతిక పనితనం తప్ప- రహస్యాలేమీ లేవు.

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

ఉదాహరణకు ఒక మహిళకు భర్త వేధింపులున్నాయి. లేక కోడలి ఆగడాలు తట్టుకోలేకపోతోంది. వెళ్ళి తన మిత్రుల దగ్గర గోడు వెళ్ళబోసుకుని, కొంత సాంత్వన పొందాలనుకుంటుంది. కాని, ఆ మిత్రురాలు ఆ ఊళ్ళో కాదు కదా ఆ రాష్ట్రంలోనే లేదు. ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉంటోంది. అప్పుడేం చేయాలి? ఈ హాలోపోర్టేషన్ టెక్నిక్ ద్వారా ఆ మిత్రురాలిని పిలుచుకుని, ఒకరి ముందు ఒకరు కూర్చొని మాట్లాడుకోవచ్చు – లేదా ఒక యువపరిశోధకుడున్నాడు. అతినికి పరిశోధనలో కొన్ని క్లిష్టసమస్యలు ఎదురయ్యాయి. తన ప్రొఫెసర్ తో మాట్లాడితే ఏమైనా ఫలితం ఉంటుందేమోననుకుంటాడు. ఆ ప్రొఫెసర్ గారు ఆయన పిల్లలతో కెనడాలో ఉంటున్నాడు. ఆయన సలహా ఎలా లభించాలి? హాలోపోర్టేషన్ ద్వారా ఆయనను తన లాబొరేటరీకి పిలిచి, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. లేదా ఈ యువపరిశోధకుడు కెనడాలో ఉన్న ప్రొఫెసర్ గారి గదిలో కూర్చుని మాట్లాడిరావచ్చు. ఇదంతా ఎలా సాధ్యం అంటే త్రిడి (3D) కెమెరాల పనితనం. దీన్ని ‘కాప్చర్ ’ టెక్నాలజీ (CAPTURE TECHNOLOGY) అని అంటారు. మన స్టుడియోలో, డ్రాయింగ్ రూంలో, లివింగ్ రూంలో, లాబొరేటరీలో ఎక్కడైనా సరే నాలు వైపులా త్రిడి కెమెరాలు అమర్చుకోవాలి. హలోనస్ డివైస్ (HOLONUS DIVICE) లు ఉపయోగించాలి. దీని వల్ల హాలెండ్ ట్రాకింగ్ సిస్టమ్ పనిచేసి మీరు కాల్ చేసినవారికి కాల్ అందజేస్తుంది. వారు సహకరించదలిస్తే, వారు కూడా వారు అమర్చుకున్న త్రిడి కెమరాల మధ్య నిలబడి సంభాషిస్తారు. దీనివల్ల జరిగేదేమంటే-వాళ్ళు మీ దగ్గరికి, మీరు వారి దగ్గరికీ వెళ్ళరు. మీ ప్రతిబింబాలు (IMAGES) వెళతాయి. మీ ప్రతిబింబం వారికి,  వారి ప్రతిబింబం మీకూ కనిపిస్తాయి. దాంతో ఒకరికి ఎదురుగా ఒకరున్న అనుభూతి కలుగుతుంది. కూర్చుంటే కూర్చున్నఅనుభూతి కలుగుతుంది. తిరుగుతూ ఉంటే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

దృశ్యమానమే కానీ స్పర్శ మాత్రం ఉండదు

 ఆ విధంగా కాల్ లో ఉన్నప్పుడు మీమీ ఒత్తిళ్ళు, భావోద్వేగాలు, విషాదాలు, ఆనందోత్సాహాలు, విశేషాలు అన్నీ పంచుకోవచ్చు. మీరు దగ్గరికి వెళ్ళి ఎదుటివారి భుజం కూడా తట్టొచ్చు. ఆ విషయం ఎదుటివారు చూస్తారు. గ్రహిస్తారు. అయితే స్పర్శమాత్రం ఉండదు. కారణం  మీరు నిజంగా కలుసుకోలేదు. కెమెరా దృశ్యాలు/ప్రతిబింబాలు మిమ్మల్ని కలిపాయి. అంతే – ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న వీడియో కాల్ లో మీరు తెరమీద ఉన్నవారికి ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వలేరు. చూపిస్తూ మీ చేయి తెరదగ్గరికి తీసుకెళ్ళవచ్చు. మీరిస్తున్నట్టు అవతలివాళ్ళు గ్రహిస్తారు. అలాగే హాలోపోర్టేషన్ లో కూడా జరిగేది అంతే! తేడా ఏమిటంటే ఎవరి స్థలంలో వారు, ఎవరి కాలంలో వారు ఉండి మాట్లాడకుండా హాలోపోర్టేషన్ ద్వారా ఒకే స్థలంలో, ఒకే కాలంలో ఎదురెదురుగా కలుసుకున్న అనుభూతి లభిస్తుంది. అంటే ఇప్పటి వీడియో కాల్ కన్నా ఇది మరో ముందడుగు! దూరాల్ని తగ్గించుకునేందుకు, ఆలోచనల్ని, ఆవేదనల్ని పంచుకుని సంతృప్తి పొందడానికి ఇది ఒక మార్గమే కదా? దూరాలు తగ్గి దగ్గర కావడమన్నది మనుషులకు ఎంతో ఓదార్పునిచ్చే అంశం!

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

ఇక పోతే హాలోపోర్టేషన్ పద్దతి వల్ల మరో ప్రయోజనం ఉంది. సంభాషణలను కెమెరాలు రికార్డు చేసి ఉంచుతాయి కాబట్టి, కావాలంటే ఆ డేటాను రివైండ్ చేసి మళ్ళీ చూసుకోవచ్చు. లైఫ్ సైజ్ లో రికార్డయిన ఆ మొత్తం ఎపిసోడ్ ని మళ్ళీ చూసుకోవాలనుకున్నప్పుడు…లైఫ్ సైజ్ లో చూసుకోవచ్చు లేదా తగ్గించి మీ టీపాయ్ మీదికి కుదించుకోవచ్చు. అప్పుడు మీరు, మీరు కూర్చున్న సోఫాలు, మీ గది అన్నీ చిన్నవైపోతాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్ ని పెద్దగానో చిన్నగానో చేసుకుంటున్నట్టు – ఆ హాలెండ్ ట్రాకింగ్ సిస్టమ్ లోని డేటాని పెద్దగానో, చిన్నగానో చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం  ఇందులో ఉంది. దగ్గరి వాళ్ళెవరైనా బాగా గుర్తుకొచ్చినపుడు లోగడ పాత ఆల్బమ్ లు తిరగేసేవాళ్ళం. ఇప్పుడు కంప్యూటర్ ఫైల్ తెరిచి ఫోటోలు చూసుకుంటున్నాం. వీడియోలు కూడా! ఇదీ దాదాపు అలాంటిదే. అయితే, తెరమీద కాకుండా తెరకు ఈవల మన ఎదురుగా, మన గదుల్లోనే చూసుకోవచ్చు.

Also read: ‘రామ్ చరిత్ మానస్’ లో తులసీదాసు ఏమి రాశారు?

అపార్ట్ మెంట్ కల్చర్ లో, గేటెడ్ కమ్యూనిటీలలో – అపరిచితుల మధ్య బతికేవారికి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండే ఆత్మీయులతో కలవడానికి, సంభాషించుకోవడానికి శాస్త్రసాంకేతిక రంగం ఈ విధంగా ఉపయోగపడుతోంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ ఏ దేవుడూ అవతారాలెత్తి రాబోవడం లేదు. అవన్నీ ఒకప్పుడు మనిషి రాసుకున్న కట్టు కథలు. గతంలోనైనా, ఇప్పుడైనా మనిషే టాక్నాలజీని అభివృద్ధిపరచుకుంటూ ఇంతదాకా వచ్చాడు. అయితే, తన జాతి క్షేమంకోసం దాన్ని ఎప్పటికీ తన అధీనంలోనే ఉంచుకోవాలి. ఏదైనా, మితిమీరితే చెడు ఫలితాలు తప్పవు. ‘సాంకేతికత’ పెరిగిపోయి – మానవ సంబంధాల్ని శాసించే స్థితి రాకూడదు.

Also read: మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

  1. చక్కటి విశ్లేషణ తో క్లుప్తంగా వివరించారు. ధన్యవాదములు సర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles