- ఇంగ్లండ్ తో 3 ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు, రెండు డకౌట్లు
- రాహుల్ కు కెప్టెన్ కొహ్లీ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ అండ
ఇంగ్లండ్ తో జరుగుతున్న పాంచ్ పటాకా టీ-20 సిరీస్ మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ ఒకే ఒక్క పరుగు, రెండుడకౌట్లతో జట్టుకే భారంగా మారిన యువఓపెనర్ కెఎల్ రాహుల్ ను కెప్టెన్ విరాట్ కొహ్లీ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ గట్టిగా సమర్థించారు. రోహిత్ శర్మతో కలసి రాహుల్ భారత ప్రధాన ఓపెనింగ్ జోడీగా ఉంటాడని స్పష్టం చేశాడు.
అహ్మదాబాద్ వేదికగా ముగిసిన తొలి టీ-20 లో ఒక్క పరుగు, రెండు, మూడుమ్యాచ్ ల్లో డకౌట్లుగా రాహుల్ అవుట్ కావడంతో తుదిజట్టు నుంచి తొలగించాలంటూ ఓవైపు అభిమానులు, విమర్శకుల నుంచి ఒత్తిడి పెరుగుతుంటే మరోవైపు టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం గట్టిగా వెనకేసుకొస్తోంది.తమజట్టులోని అత్యుత్తమ టీ-20 ఓపెనర్ రాహుల్ మాత్రమేనని, అతని స్ట్రయిక్ రేట్ సైతం 143.14 అన్నవాస్తవాన్నిఅందరూ గుర్తుంచుకోవాలని కెప్టెన్ విరాట్ కొహ్లీ కోరాడు. గత రెండుసంవత్సరాలుగా రాహుల్ నిలకడగా, అత్యుత్తమంగా రాణిస్తూ వచ్చాడని, రోహిత్ శర్మతో కలసి అతనే తమ ప్రధాన ఓపెనర్ల జోడీగా కొనసాగుతాడని తేల్చి చెప్పాడు. మూడు వైఫల్యాలను పట్టుకొని రాహుల్ ను జట్టుకు దూరంగా ఉంచలేమని, ఏ ఆటగాడికైనా కెరియర్ లో వైఫల్యాలు ఓ భాగమని, సహజమని కొహ్లీ చెప్పుకొచ్చాడు.
Also Read: అహ్మదాబాద్ చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్
టీ-20ల్లో అత్యుత్తమ ఆటగాడు- విక్రమ్:
టీ-20 ఫార్మాట్లో కెఎల్ రాహుల్ భారత అత్యుత్తమ ఆటగాడని, ప్రస్తుత సిరీస్ లోని మూడు వైఫల్యాలను సాకుగా చూపి జట్టుకు దూరం చేయబోమని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పష్టం చేశారు. రాహుల్ లో అసాధారణ ప్రతిభ ఉందని, అతని గత ఇన్నింగ్సే దానికి తార్కాణమని, భారతజట్టు కు కేవలం తన బ్యాటింగ్ తోనే ఎన్నో విజయాలు అందించిన వాస్తవాన్నిగుర్తుంచుకోవాలని సూచించాడు.రాహుల్ తిరిగి ఫామ్ లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలునని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ చెప్పాడు.
28 సంవత్సరాల రాహుల్ కు ప్రస్తుత సిరీస్ లోని మూడో టీ-20 వరకూ మొత్తం 47 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. 44 ఇన్నింగ్స్ లో 2 శతకాలు, 12 అర్థశతకాలతో సహా 1543 పరుగులు, 40.61 సగటు, 143.14 స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన ఘనత సైతం రాహుల్ కు ఉంది.
Also Read: కెప్టెన్ గా విరాట్ 11వ టీ-20 హాఫ్ సెంచరీ