* సిరీస్ విజయానికి ఇంగ్లండ్ గురి
* మోడీ స్టేడియంలో నేడే నాలుగో టీ-20
భారత్- ఇంగ్లండ్ జట్ల నాలుగుమ్యాచ్ ల టీ-20 సిరీస్ పతాకస్థాయికి చేరింది. సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లు ముగిసేసమయానికి ఆతిథ్య జట్టు 1-2 తో వెనుకబడటంతో ఇంగ్లండ్ కు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. సిరీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ నాలుగో మ్యాచ్ లో భారత్ ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.
రాహుల్ కు రెస్ట్ తప్పదా?
సిరీస్ మొదటి మూడుమ్యాచ్ ల్లో ఒకే ఒక్క పరుగు సాధించిన ఓపెనర్ రాహుల్ ను పక్కన పెట్టి ముంబై ఆటగాడు సూర్యకుమార్ కు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి యువఆటగాడు ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
Also Read : డకౌట్ల హీరో రాహుల్ కు టీమ్ మేనేజ్ మెంట్ దన్ను
నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ జోడీ ఇచ్చే ఆరంభంపైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. మరో వైపు గత రెండు ఇన్నింగ్స్ల్ లోనూ సూపర్ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫామ్ ను అందిపుచ్చుకోడంతో భారత బ్యాటింగ్ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. రోహిత్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే భారత్ గట్టెక్కగలుగుతుంది.
నిలకడలేమితో బౌలింగ్ ఎటాక్
విజయానికి అత్యంత కీలకమైన బౌలింగ్ విభాగంలో భారత్ ను నిలకడలేమి వెంటాడుతోంది. రెండో టీ-20లో అదరగొట్టిన భారత బౌలర్లు..మిగిలిన రెండుమ్యాచ్ ల్లో తేలిపోడం టీమ్ మేనేజ్ మెంట్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రధానంగా లెగ్ స్పిన్నర్ చహాల్ వికెట్లు పడగొడుతున్నా చేతికి ఎముకలేదన్నట్లుగా పరుగులివ్వడం జట్టును దెబ్బతీస్తోంది. ఫీల్డింగ్ లో సైతం మునుపటి వాడివేడీ కనిపించకపోడం కూడా భారత ఓటమికి కారణంగా కనిపిస్తోంది.
Also Read : కెప్టెన్ గా విరాట్ 11వ టీ-20 హాఫ్ సెంచరీ
టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ ను కంగుతినిపించాలంటే విరాట్ అండ్ కో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యుత్తమంగా రాణించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
టాస్ ప్రమేయం లేకుండానే
ప్రస్తుతసిరీస్ లో ఇప్పటి వరకూ జరిగిన మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ టాస్ నెగ్గి చేజింగ్ కు దిగిన జట్లే విజయాలు సాధించడంతో…విజేతను నిర్ణయించడంలో బొమ్మా!బొరుసా ! కీలకమని తేలిపోయింది.
అయితే…సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన నాలుగో టీ-20లో మాత్రం తాము టాస్ పమేయం లేకుండా రాణించితీరక తప్పదని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ గట్టిగా చెబుతున్నాడు. ఒకవేళ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చినా 180 నుంచి 200 పరుగుల స్కోరు సాధించగలిగితేనే భారత్ కు విజయావకాశాలు ఉంటాయి.
Also Read : మూడో టీ-20లో ఇంగ్లండ్ జోరు
సిరీస్ కు ఇంగ్లండ్ గురి
మరోవైపు… ప్రపంచ నంబర్ వన్ జట్టు ఇంగ్లండ్ మాత్రం…నాలుగోవన్డే సైతం నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఆఖరి మ్యాచ్ వరకూ పోటీని పోనివ్వరాదన్న పట్టుదల ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ లో కనిపిస్తోంది.
బ్యాటింగ్ తో పోల్చుకొంటే ఇంగ్లండ్ బౌలింగే అత్యంత పటిష్టంగా, పదునుగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్ల జోడీ మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో…నిప్పులు చెరుగుతూ భారత టాపార్డర్ ను కకావికలు చేస్తూ వస్తున్నారు. ఆల్ రౌండర్లు సామ్ కరెన్, బెన్ స్టోక్స్, లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ సైతం తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
Also Read : అహ్మదాబాద్ చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్
బ్యాటింగ్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఓపెనర్ జేసన్ రాయ్ ల నుంచి ఇంగ్లండ్ భారీస్కోర్లను ఆశిస్తోంది. మొత్తం మీద…టాప్ ర్యాంక్ ఇంగ్లండ్, రెండో ర్యాంక్ భారత్ విజయమే లక్ష్యంగా సమరానికి సిద్దమయ్యాయి. ఖాళీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందా? లేక ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ రసపట్టుగా, సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతుందా? తెలుసుకోవాలంటే కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.