* పూణేలో రెండోవన్డేకి అంతా సిద్ధం
* సిరీస్ లో తొలిగెలుపుపై ఇంగ్లండ్ ఆశలు
ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో వరుసగా రెండో విజయానికి ఆతిథ్య భారత్ గురిపెట్టింది. మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరు రెండో సమరంలో సైతం నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో విరాట్ అండ్ కో ఉన్నారు.
మరోవైపు…ప్రారంభమ్యాచ్ లో 66 పరుగుల పరాజయం పొందిన టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ మాత్రం ఈ కీలక రెండోవన్డే నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది.
Also Read : 6 వేల పరుగుల రికార్డుకు చేరువగా ధావన్
సూర్యకుమార్ కు చాన్స్
తొలివన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో…అదికాస్త టీ-20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ పాలిట వరంగా మారింది. భారతతుదిజట్టులో సూర్యకుమార్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
రోహిత్- శిఖర్ ధావన్ జోడీ మరోసారి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వన్ డౌన్ విరాట్ కొహ్లీని గత 579 రోజులుగా మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది. ఆ లోటును ప్రస్తుత మ్యాచ్ ద్వారా పూడ్చుకొనే అవకాశం కనిపిస్తోంది. మిడిలార్డర్లో రాహుల్, రిషభ్ పంత్,పాండ్యా బ్రదర్స్ తో భారత్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
కుల్దీప్ స్థానంలో చహాల్
తొలివన్డేలో భారీగా పరుగులిచ్చిన లెఫ్టామ్ స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు భారత్ చోటు కల్పించనుంది. పేస్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ మరోసారి కీలకపాత్ర పోషించనున్నారు.
Also Read : భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ కు గాయాలదెబ్బ
మరోవైపు…కెప్టెన్ వోయిన్ మోర్గాన్ చేతికి గాయం కావడంతో…వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ సారథ్యబాధ్యతలు చేపట్టనున్నాడు. తుదిజట్టులోకి టీ-20 స్పెషలిస్ట్ డేవిడ్ మలాన్ చేరనున్నాడు.
సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ నెగ్గితీరాల్సి ఉంది. స్టోక్స్, బట్లర్, మోయిన్ అలీలతో కూడిన ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆశించినస్థాయిలో రాణించకపోడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీస్తోంది.
Also Read : భారత క్రికెటర్లకు సరికొత్త ముప్పు
మధ్యాహ్నం 1-30కి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ ను సైతం ఖాళీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ పై 3-1తో టెస్టు, 3-2తో టీ-20 సిరీస్ లు నెగ్గిన విరాట్ సేన…వన్డే సిరీస్ ను సైతం గెలుచుకోడం ద్వారా క్లీన్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్ ద్వారా ఓపెనర్ శిఖర్ ధావన్ 6వేల పరుగుల మైలురాయిని చేరుకోగలడా?..కెప్టెన్ విరాట్ కొహ్లీ 579 రోజుల విరామం తర్వాత శతకం నమోదుచేయగలడా? తెలుసుకోవాలంటే…కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.
Also Read : కొహ్లీకి ఇంకా కాని శతకోదయం