- యుయస్పీసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటానికి నిర్ణయం
- పోరుబాట నిర్ణయం
హైదరాబాద్ : జిఓ 317 ద్వారా ఉత్పన్నమైన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించటంలో అధికారులు, కొందరు సంఘాల నాయకులు వైఫల్యం చెందారని, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుయస్పీసీ) ప్రతినిధులకు ముఖ్యమంత్రి సమయం ఇస్తే సమస్యలను వివరించి వాటి పరిష్కారాలను కూడా సూచిస్తామనీ యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు స్పష్టం చేశారు.
యుయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ జూమ్ సమావేశం శనివారం మధ్యాహ్నం యు పోచయ్య అధ్యక్షతన జరిగింది. జిఓ 317 ను సవరించాలని, స్థానికతను కోల్పోయిన జూనియర్లకు న్యాయం చేయాలని, జిల్లాల కెటాయింపులో జరిగిన అవకతవకలు, సీనియారిటీలో దొర్లిన పొరపాట్లపై అప్పీల్స్, భార్యాభర్తలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరుల అప్పీల్స్ పరిష్కారం చేయాలని గత నెల రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నా సమస్యలు పరిష్కరించకుండా ఉదాసీనంగా వ్యవహరించటాన్ని యుయస్పీసీ తీవ్రంగా ఖండించింది.
ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా లాభం లేదు
యుయస్పీసీ పక్షాన మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా, అధికారులకు ప్రాతినిధ్యాలు చేసినా పట్టించుకోకుండా సిఎస్ ఇచ్చే మౌఖిక ఆదేశాలతో జిల్లా స్థాయి అధికారులు ఉపాధ్యాయులను వేధిస్తున్నారని, మానసిక క్షోభతో పలువురు అర్ధాంతరంగా అశువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పీల్స్ పై విద్యాశాఖ అధికారులు తమ ప్రమేయమే లేనట్లు ప్రేక్షక పాత్ర వహించటం విచారకరం. అధికారుల వైఖరితో విసిగిపోయిన ఉపాధ్యాయులు స్వతంత్రంగా డియస్ఈ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి వంటి పోరాటాలు నిర్వహించారు.
బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ యుయస్పీసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాట కార్యక్రమం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
పోరాట క్రమం ఇదీ…
యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు అపాయింట్మెంట్ కోరుతూ జనవరి 23న (ఆదివారం)ముఖ్యమంత్రికి లేఖ పంపుతారు. జనవరి24 న రాజకీయ పక్షాల రాష్ట్ర నాయకులను కలుసుకుంటారు. జనవరి 25,26,27 తేదీల్లో జిల్లాల్లో సన్నాహక సదస్సులు జరిపి 29న జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5న హైదరాబాద్ లో మహాధర్నాచేస్తారు.
ఈ అన్ని ఆందోళన, పోరాట కార్యక్రమాల్లో నష్టపోయిన ఉపాధ్యాయులు, వారికి మద్దతుగా ఇతర ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని యుయస్పీసీ నాయకులు పిలుపు నిచ్చారు. పోచయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె. జంగయ్య, కె. రమణ, ఎం. రఘుశంకర్ రెడ్డి, సయ్యద్ షౌకత్ అలీ, జాడి రాజన్న, ఎన్. యాదగిరి, బి. కొండయ్య, ఎ. గంగాధర్, కుర్సం రామారావు, మాళోత్ రామారావు, ఎస్. హరికృష్ణ, చావ రవి, మైస శ్రీనివాసులు, టి. లింగారెడ్డి, దేవరకొండ సైదులు, ఎస్. మహేష్, సిద్దబోయిన లక్ష్మి నారాయణ, మంగ, రోహిత్ నాయక్ పాల్గొన్నారని యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ తెలియజేసింది.