వోలెటి దివాకర్
తమతో పొత్తు పెట్టుకోకుండా తెరవెనుక మంత్రాంగం చేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని బ్రష్టుపట్టిస్తోందని బిజెపి భావిస్తోంది. ఈవిషయమై మాజీ ఎమ్మెల్సీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ బహిరంగంగానే ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో బిజెపి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి ఎపి ఇన్చార్జి, కేంద్రమంత్రి వి మురళీధరన్, ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్, ఎపి వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దియోధర్, బిజెపి నేతలు దగ్గుబాటి
పురంధేశ్వరి, వై సత్యకుమార్, జివిఎల్ నరసింహారావు, సిఎం రమేష్, టిజి వెంకటేష్, సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా 2009లో ప్రజారాజ్యం తరుపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తులసీ సీడ్స్ అధినేత తులసి రామచంద్రప్రభు, ఆయన కుమారుడు తులసి యోగేష్ బిజెపిలో చేరారు.
జనసేనతోనే పొత్తు
బిజెపి, జనసేన కలిసి పనిచేస్తాయని అనంతరం విలేఖర్లతో మాధవ్ స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలైన టిడిపి, వైసిపిలతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే వ్యూహాత్మంగా టిడిపి జనసేనను బ్రష్టుపట్టిస్తోందని మాధవ్ ధ్వజమెత్తారు. జనసేనతో పొత్తు కుదరకపోతే బిజెపి సొంత బలాన్ని పెంచుకునే అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దీనిలో భాగంగా పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ పధకాలు, బిజెపి ప్రభుత్వ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రధాని మోడీ మానస పుత్రిక ‘మన్ కీ బాత్’ 100వ కార్యక్రమాన్ని ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.
వైసిపిపై చార్జిషీట్లు
వై ఎస్సార్ సిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోర్ కమిటీలో నిర్ణయించినట్లు మాధవ్ విలేఖర్లతో చెప్పారు. దీనిలో భాగంగా మే 5నుంచి 15వ తేదీ వరకు అసెంబ్లీ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్లు ప్రజల ముందుంచుతామని మాధవ్ చెప్పారు. వైసిపి పాలనలో ఇసుక, మద్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయని, ఎమ్మెల్యేలే భూకబ్జాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల పేరిట భూదందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటీని చార్జిషీట్ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళతామని వివరించారు. బీజేపీ వైస్సార్సీపీకి లోపాయకారి మద్దతు ఇస్తోందన్న అపప్రదను పోగొట్టుకుంటామని మాధవ్ స్పష్టం చేశారు.