Sunday, December 22, 2024

అమరావతిపై రెఫరెండానికి రెడీనా?

  • జగన్ కు చంద్రబాబు సవాల్
  • ఓడిపోతే రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు, 19 నెలల్లో ఏం ‘పీకారు?’

అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా. ఉంచితే అమరావతిని రాష్ట్ర ఒకేఒక రాజధానిగా ఉంచాలి. లేకపోతే మూడు రాజధానుల ప్రతిపాదనపైన రిఫరెండం పెట్టండి. అందులో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకుంటా’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సవాలు విసిరారు. ‘ఇంతమంది ఆడబిడ్డల ఉసురు కట్టుకున్న వైఎస్ఆర్ సీపీ నామరూపాలు లేకుండా పోతుంది’ అంటూ శాపం పెట్టారు.

కనకదుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి

‘కనకదుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి. ఆమె మూడో కన్ను తెరుస్తుంది. ఈ రాక్షసులను అంతం చేస్తుంది. అమరావతికి విజయం దక్కుతుంది,’ అంటూ అమరావతి పరిరక్షణ సమితి సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ) గురువారంనాడు ‘అమరావతి జనరణభేరి’ పేరుతో  ఇక్కడ నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబునాయుడు అన్నారు. ‘‘కనకదుర్గమ్మను దర్శించుకొని వస్తూ ఉద్దండరాయపాలెంటో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం దగ్గరికి వెళ్ళా. అక్కడి పరిస్థితి, పాతరోజులు గుర్తుకు వచ్చికడుపు తరుక్కుపోయింది,’’ అంటూ ఆవేశంగా ప్రసంగించారు. అమరావతి గురించి శాసనసభలో ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి ఏమి చెప్పారో ప్రజలకు ఆయన గుర్తు చేశారు.

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు

‘ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నావు. మరి 19 నెలల్లో ఏం పీకావు? కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేదు,’ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు మంచిది కాదనీ, అమరావతిలో రాజధానిని మనస్పూర్తిగా ఆమోదిస్తున్నాననీ, రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలన్నా కావాలనీ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ  సాక్షిగా చెప్పారనీ, నిజమైన ముఖ్యమంత్రి అయితే ఈ మాటలకు కట్టుబడి ఉండేవారనీ, ‘ఫేక్ ముఖ్యమంత్రి’ కనుక తనకు గుర్తు లేవంటూ దబాయిస్తున్నారనీ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Also Read : జనసంద్రంగా ‘అమరావతి జనభేరి’

పూనకం వచ్చినట్ట ఓట్లేశారు

‘నేను ఆ రోజు అన్నీ చేశాను. మీరు కూడా అన్నీ చేశారనే అన్నారు. ఒక సారి అవకాశం అంటే ఫర్వాలేదు ఒక్కసారే కదా. ఈయన (చంద్రబాబునాయుడు) ముఖ్యమంత్రిగా చేశాడు కదా. ఈ సారి కొత్తబిచ్చగాడు వచ్చాడని పూనకం వచ్చినట్టు ఓట్లేశారు. ఇక్కడ కూడా ఓడిపోయాం. ఆ తర్వాత మోసపోయారు. ప్రధాని మోదీ 2022లో జమిలి ఎన్నికలంటున్నారు. 19 నెలల్లో ఏమీ చేయలేని జగన్ వచ్చే రెండేళ్ళలో ఏమి చేస్తారు?‘ అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ఆ పదవి నాకేం కొత్త కాదు

‘నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోలేదు. ఆ పదవి నాకేం కొత్త కాదు. ప్రజలు, రైతుల పౌరహక్కుల సాధన కోసం వెంకటేశ్వరస్వామికి మొక్కాను… ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి మాత్రం మూడుముక్కలాట ఆడుతున్నాడు. ఎన్నికల ముందు అమరావతే అని నమ్మించాడు. ఆఖరికి అమరావతిలో ఉన్న అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నాడు. అందుకే ఇప్పుడు రెఫరెండం పెట్టాలి. ప్రజలు మూడురాజధానులకు ఓటు వేస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటా,’ అంటూ మాజీ ముఖ్యమంత్రి శపథం చేశారు.

అందరిదీ రైతు కులమే

‘‘జగన్ రెడ్డీ… మాట్లాడితే కులం అంటున్నావు. ఇక్కడ వేదికపైన ఉన్నవారంతా రైతులు, దళితులు. ఇక్కడ ఏ కులం ఉందో కళ్ళుంటే వచ్చి చూడాలి. అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డిది ఏ కులం? రైతు కులం. శ్రీనివాస్ ది ఏ  కులం? రైతు కులం. ధైర్యముంటే, కళ్ళుంటే వచ్చి చూడండి. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పండి. విశాఖకు ఐటీ కంపెనీలు, అభివృద్ధి, పులివెందులకు నీళ్లూ, రాష్ట్రమంతా అభివృద్ధి చేసింది కులం కోసం కాదు. చాలా తెలివైనవాడినని అనుకుంటున్నావు. నా దగ్గర నీ తెలివితేటలు పనిచేయవు,’’ అంటూ చంద్రబాబునాయుడు ఆగ్రహం వెలిబుచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles