అమరావతి : ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడితో సహా 13 మంది టీడీపీ ఎంఎల్ఏలను సభాపతి సోమవారంనాడు సస్పెండ్ చేశారు. అంతకు మందు తుపాను వల్ల నష్టబోయిన రైతుల తరఫున తనను మాట్లాడనీయడానికి సభాపతి తమ్మినేని సీతారాం అనుమతించడం లేదంటూ చంద్రబాబునాయుడు తోటి ప్రతిపక్ష ఎంఎల్ఏలతో కలసి స్పీకర్ పోడియం ఎదుట నేల మీద కూర్చొని బైఠాయింపు కార్యక్రమం చేశారు. సస్పెన్సన్ వేటు సోమవారం నాటికి మాత్రమే వర్తిస్తుందని స్పీకర్ చెప్పారు. సభాకార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్ ని కోరారు. టీడీపీ సభ్యుల పేర్లు చదివారు. వారందరినీ సస్పెండ్ చేసినట్టు సబాపతి ప్రకటించారు.
శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. తెలుగు దేశం పార్టీ తరఫున కమిటీ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశాలు పదిరోజుల పాటు సాగాలని కోరారు. కరోనా పెరుగుతోందనీ, సభ్యలలో 60 ఏళ్లు పైబడినవారు ఉన్నారనీ, అందువల్ల సమావేశాలు అయిదు రోజులకే పరిమితం చేద్దామని అనుకుంటున్నామనీ మంత్రులు చెప్పారు. అచ్చెన్నాయుడికీ, మంత్రులకీ మధ్య వాగ్వాదం జరిగింది. సభ అరగంట ఆలస్యంగా ప్రారంభించడంపైన అచ్చెన్నాయుడు అభ్యంతరం చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ధర్నాలు చేస్తున్నారు కదా అంటూ మంత్రులు అన్నారు. అచ్చెన్నాయుడిని చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ది గ్రేట్ అచ్చెన్నాయుడు’ అంటూ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన చంద్రబాబునాయుడు మధ్యలో వెంకటపాలెంలో ఎన్ టి రామారావు విగ్రహం దగ్గర నివాళులు అర్పించారు.
పంచాయతీ రాజ్ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించడం పట్ల నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యుల సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ, ప్రఖ్యాత గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కూ, ఇతర ప్రముఖులకూ అసెంబ్లీ నివాళులు అర్పించింది. గత సభలు జరిగిన తర్వాత మరణించిన మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్, మోచర్ల జోహార్, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది.