అమరావతి: నివర్ తుపాను బాధితులను ఆదుకోవాలనీ, ప్రతి పేద కుటుంబానికి రూ. 10 వేలు అందించాలనీ కోరుతూ టీడీపీ ఎంఎల్ఏలు ప్లకార్డులతో సోమవారంనాడు ప్రదర్శన జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతుల ప్రీమియం చెల్లించలేదనీ, రైతులను నమ్మించి మోసం చేశారనీ టీడీపీ ఎంఎల్ఏ లు అన్నారు. మైక్రో ఇరిగేషన్ డబ్సిడీ చెల్లించలేదనీ, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎగకొట్టారనీ, ఇన్ పుట్ సబ్సిడీ, విపత్తు పరిహారం చెల్లించలేదనీ టీడీపీ ఎంఎల్ఏలు ఆరోపించారు. కేంద్రం ఇచ్చే ప్రీమియం వాటా కూడా రాలేదని అన్నారు. ‘రైతు ద్రోహి, జగన్ మోహన్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు ఇచ్చారు. మోటార్లకు మీటర్ పెడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రైతులే వైసీపీ ని తరిపికొడతారని అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని రద్దు చేశారనీ,రైతులకు రూ. 20 వేల భరోసా ఇవ్వలేదనీ, రుణమాఫీ చేయకుండా ఎనిమిది వేల కోట్ల మేరకు మోసం చేశారనీ తెలుగుదేశం శాసనసభ్యులు ఆరోపించారు.