- వైసీపీలో చేరిన గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్
- త్వరలో గంటా శ్రీనివాసరావు చేరతారన్న విజయసాయిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల సమయంలో విశాఖ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరే అవకాశాలున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరేందుకు గంటా కొన్ని ప్రతిపాదనలు పంపారని వాటికి సీఎం ఆమోదం తెలిపాక గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీలో చేరిన గంటా అనుచరుడు :
Also Read: చంద్రబాబు చిత్తూరు పర్యటన ఉద్రిక్తం
ఈ పరిణామాల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారని అన్నారు. సంవత్సరం క్రితమే కాశీ వైసీపీలో చేరాల్సిందని అనివార్య కారణాలవల్ల చేరలేకపోయారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు కాశీ విశ్వనాథ్ తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ విజయం కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తానని ఆయన అన్నారు.
గంటా చేరికను వ్యతిరేకిస్తున్న అవంతి శ్రీనివాస్:
వైసీపీలో గంటా చేరికను మొదటి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. బుధవారం విశాఖలో గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరిక కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ హాజరు కాలేదు. దీంతో విశాఖ వైసీపీలో వర్గ పోరు మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు
గంటా చేరికపై ఊహాగానాలు:
గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల అనంతరం వైసీసీకి మద్దతు తెలిపారు. అప్పటి నుండి గంటా కూడా వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గంటా శ్రీనివాసరావు చేరికను మొదటి నుంచి అవంతి శ్రీనివాసరావు సుముఖంగా లేరు. గంటా చేరికపై బహిరంగంగానే విమర్శలు కురిపించారు. అవంతి వైఖరి వల్లే గంటా చేరిక ఆలస్యమయినట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవాలని వైసీపీ భావిస్తుండటంతో మళ్లీ గంటా చేరిక అంశంపై చర్చ సాగుతోంది.
టీడీపీకి దూరంగా గంటా:
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి గంటా శ్రీనివాసరావు టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. ప్రస్తుతం ఆయన రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. గత కొంత కాలంగా టీడీపీ పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇటీవల చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినపుడు ఆయన వెంట ఉన్నారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దీక్షకు దిగినపుడు శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో చంద్రబాబుతో పాటు ఆసుపత్రికి వెళ్లి పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. అయితే ఇప్పటివరకు పార్టీ మారుతున్నట్లు గంటా శ్రీనివాసరావు మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.