వోలేటి దివాకర్
దివంగత మాజీ మంత్రి , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో … ఆయనను హత్య చే సేందుకు కుట్ర పన్నిందెవరో తెలుగుదేశం పార్టీకి , ఆపార్టీ అనుబంధ మీడియాకు ముందే తెలిసిపోయింది. ఒకవైపు సిబిఐ దర్యాప్తు జరుగుతుండగానే టిడిపి అధినేత, ఆపార్టీ నేతలు, అనుబంధ మీడియా దోషుల పేర్లను ముందుగానే ప్రకటించడం ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. వివేకా హత్య కేసులో జగన్, ఆయన సతీమణి భారతి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దోషులని ఆపార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా విలేఖర్ల సమావేశాలు పెట్టి మరీ ప్రకటిస్తున్నారు. జగన్ సకుటుంబ సపరివారంగా కుట్రపన్ని వివేకాను హత్య చేయించారని టిడిపి నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ వెల్లడించారు. ఈకేసులో జగనన్ ను, సజ్జలను అరెస్టు చేయాలని, నాటి డిజిపి గౌతమ్సవాంగ్ ను కూడా విచారించాలని వారు సిబిఐకి సలహాలు ఇచ్చారు. అంటే ఒకవైపు దర్యాప్తు కొలిక్కి రాకుండానే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలుగుదేశం, ఆపార్టీ అనుబంధ మీడియా సొంతంగా దర్యాప్తు చేసి, దోషులకు శిక్షలు కూడా ఖరారు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
Also read: దక్షిణ కాశీలో పుణ్యాత్ములను మించిన పుణ్యాత్ములు!
సిబిఐపై టిడిపి వైఖరి మారిందా?
బిజెపితో బంధం కటీఫ్ అయిన తరువాత 2018 లో టిడిపిలోనే ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి వంటి నాయకులు ఇళ్లపై దాడులను నిరోధించేందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్రంలోకి సిబిఐ అడుగుపెట్టకుండా ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాడు సిబిఐని నిషేధించిన టిడిపి నాయకులే నేడు వివేకా హత్య కేసులో సిబిఐ విచారణలో భాగంగా వాంగ్మూలాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం టిడిపి ద్వంద్వ విధానాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. రాజకీయంగా తమ వ్యతిరేకులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం సిబిఐని పావుగా వాడుకుంటోందని నాడు చంద్రబాబునాయుడు నాడు ధ్వజమెత్తడం గమనార్హం. అప్పటికి, ఇప్పటికి సిబిఐ పనితీరులో ఏవైనా మార్పు వచ్చిందా అన్న దానిపై టిడిపి నాయకులే సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Also read: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ
అనుకూల మీడియాలో డైలీ సీరియల్
టిడిపి అనుబంధ మీడియాలో వండి వార్చిన వార్తలు ప్రచురితం అయిన మరుసటి రోజే టిడిపి నాయకులు వాటి పై స్పందించి ప్రభుత్వంపైనా … జగన్ పైనా దుమ్మెత్తిపోస్తారు. కొన్నిసార్లు టిడిపి నేతల ప్రకటనలకు అనుగుణంగానే స్టోరీలు అల్లేస్తారు. అదే తరహాలో ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా టిడిపి అనుబంధ మీడియా జగన్ కు వ్యతిరేకంగా రోజుకో కధనాన్ని వండి వార్చింది. జగన్ లక్ష కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా మీడియా, టీడీపీ దుష్ప్రచారంతో ఊదరగొట్టాయి. అయితే లక్ష కోట్లు అన్నది తమ సృష్టే అని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పడం గమనార్హం.
Also read: గోరంట్ల మళ్లీ రాజమహేంద్రవరం రాజకీయాల్లో చక్రం తిప్పుతారా?!
ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ అదే జరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆయన కుమార్తె, అల్లుడు, ఇతరులు ఇచ్చిన పాత వాంగ్మూలాలను టిడిపి అనుకూల మీడియా డైలీ సీరియల్ లాగా ప్రచురిస్తూ జగన్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్న చేస్తోంది. వాటి ఆధారంగానే టిడిపి దోషులను నిర్ధారించేస్తోంది. వాంగ్మూలాల ఆధారంగానే దోషులకు శిక్షలు విధిస్తే ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు ఈపాటికి జైల్లో ఉండేవారని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తుండం గమనార్హం.