- ఆంధ్రలో కంటే తెలంగాణలోనే జనం నిరాజనం పడుతున్నారు
- ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం, బండిని గాడిలో పెట్టే బాధ్యత నాదే
- రెండు రాష్ట్రాలనూ తిరిగి కలపాలనడం బుద్ధిలేని మాట
- ఖమ్మంలో తెదేపా బహిరంగసభ విజయం
(సకలం ప్రత్యేక ప్రతినిధి)
విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను కలపమని కోరడం బుద్ది లేని పని అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం సాయంత్రం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో మాట్లాడుతూ మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ లో బండిని గాడిలో పెట్టవలసి ఉన్నదనీ, ఆ పని ఎన్నికల తర్వాత తానే చేయాలని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించే అవసరం, అవకాశం ఉన్నదంటూ ఆయన ఉద్ఘాటించారు.
టీడీపీ ఋణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు మళ్ళీ సిద్ధం అవుతున్నారనీ, తాను కోరుకునేది అధికారం కాదనీ, ప్రజల అభిమానమనీ చెప్పారు. ‘‘ప్రజల ఆత్మ బంధువు గా ఉండేందుకే పని చేస్తున్న టీడీపీ కి 40 ఏళ్ళు వచ్చాయి. తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకులు ఎన్ టి రామారావు తెలుగువారి ఆత్మభిమానం కోసం పార్టీ పెట్టారు. ఎన్టీఆర్ జాతీయ రాజకీయ లలో చక్రం తిప్పారు. ఆహార భద్రత గురించి ఆలోచించింది ఎన్టీఆర్. పటేల్ పట్వారి వ్యవస్థ ను రద్దు చేశారు. ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ సాటి. పేదవాడు ఉండాల్సింది గుడిసెలో కాదు పక్కా భవనంలో అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. తెలుగువారికి ఆత్మ గౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కల్పించింది టీడీపీ మాత్రమే. నేను టీనేజర్ లాగా అలోచిస్తా. రాబోయే 30సంవత్సరాల గురించి ఆలోచిస్తా. ఆన్ స్థాపబుల్ లో మనస్సు విప్పి మాట్లాడా. 25ఇంజనీరింగ్ కాలేజీ లను 250 కాలేజి లు ఏర్పాటు చేశా. హై టెక్ సిటీ ఆలోచన, నిర్మాణం నా చలవే. ప్రపంచం అంత తిరిగా. ఐటీ ఉద్యోగాల కోసం బిలిగేట్స్ ను కలిశా. కాక్ టైల్ పార్టీ నీ నిరకరించా. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు ముగ్దుడయ్యాడు నాటి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. హైదరాబాద్ కు ప్రపంచ గుర్తింపు తేవాలన్నదే నా తపన. ఐఎస్ బీని చూసి గర్వ పడుతున్నా. 2000లో జినం వాలి పెట్టాం. సెల్ లేకపోతె భార్య ఉండలేదు భర్త ఉండలేదు. ప్రధాన మంత్రులను ఒప్పించ మెప్పించా. టెలికామ్ రంగాన్ని ప్రజల చెంత కు తెచ్చాను. ఐటీని తెలుగువారికీ బహుమానంగా ఇచ్ఛా’’ అంటూ తాను ముఖ్యమంత్రిగా చేసిన పనులను ఎకరువు పెట్టారు.
బీసీలకు పెద్దపీట వేసింది టీడీపీ మాత్రమేననీ, బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తేనే మంచి ఫలితాలు సాధించామనీ, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాననీ, దేశం లో తెలుగు రాష్ట్రాలు అగ్ర గామి గా ఉండాలన్నదే తన తపన అనీ చెప్పారు. ‘‘2029 వరకు విజన్ ఏర్పాటు చేసుకున్నాం. యంగ్ స్టర్స్ ఉండే దేశం భారత దేశం. ప్రధానికి చెప్పా. విజన్ 2047 ఉండాలని చెప్పా. తెలంగాణ కోసం పనిచేసింది టీడీపీ. ఇరిగేషన్ కుప్రాధాన్యం ఇచ్చాం. నల్గొండలో ఎస్ ఎల్ బీసీ ఏర్పాటు చేసింది టీడీపీ. ఖమ్మం జిల్లాలో రహదారులు నీటి ప్రాజెక్టు లు పూర్తి చేసింది టీడీపీ. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫాక్టరీ, గిరిజన యూనివరిసిటీ పాల్వంచ స్పాంజ ఐరన్ ను అభివృద్ధి చేయాలని పథకాలు రచించాం’’ అంటూ చెప్పారు.
ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు సమరోత్సాహంతో ప్రసంగించారు.
హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయానికి, జాతీయ రహదారులకు పునాది వేయడానికి ఆ నాటి కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి తెచ్చాననీ, రహదారుల వల్ల సంపద సృష్టించి అందరికీ అందించ వచ్చని గ్రహించి తెచ్చాననీ అన్నారు. ఎందరో నాయకులను తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేననీ, ప్రతిభా భారతి, బాలయోగి తదితరులను స్పీకర్ చేసిన ఘనత తెదేపాదేననీ చంద్రబాబునాయుడు చెప్పారు.
ఆస్తిలో సమాన హక్కు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ముందే గ్రహించి అమలు చేశారనీ,
మహిళల కోసం ఎన్నో పథకాలు, ఉపాధి అవకాశాలు ఇచ్చిన ఘనత తెదేపాదేననీ, ఇన్ని చేసిన తెలుగుదేశం అవశ్యకత ఇప్పటికీ ఉన్నదని చెబుతున్నాననీ చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్ లో అంతా విద్వంశమే జరుగుతోందనీ, అక్కడ పరిస్థితిని చక్కజేయాల్సిన అగత్యం ఉన్నదనీ చెప్పారు. ‘‘ఇక్కడికి నేను ఎందుకొచ్చా నో తెలుసా….ఇక్కడ కూడా తెలుగుదేశం ఉండాలని….రెండు రాష్ట్రాలు అయ్యాయని కొందరు బుద్ది మలిన వారు మళ్ళీ కలపాలని చూస్తున్నారు….రెండు తెలుగు రాష్ట్రాలు అసలే కలవవు… ఈ రోజు తెలంగాణ ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం…తెలంగాణలో కూడా తెలుగుదేశం ముందుకు తీసుకు పోవాలని భావిస్తున్న..విడిపోయినా కలిసి పని చేసుకుంటే రెండు రాష్ట్రాలు దేశంలోనే ముందుంటాయి’’ అంటూ స్పష్టం చేశారు.
‘‘జీ- 20 దేశాల సమావేశంలో ఓ విజన్ ప్రకారం వెళ్ళాలని ప్రధాని నరేంద్రమోదీకి తెలిపాను. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన ఉద్యోగులే ఉన్నారు …యూత్ ఉండే దేశం భారత్ అని ప్రధానికి వివరించాను…భవిష్యత్ లో ఆర్ధిక అసమానతలు మరో 20 ఏళ్లలో ఉండవని చెబుతున్నాను….తెలంగాణ అభవృద్ధికి పని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఇరిగేషన్, ప్రాజెక్టులు ,దేవాదుల,శ్రీరాంసాగర్, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టు లు తెలుగుదేశం పార్టీ తెచ్చింది’’ అని చంద్రబాబునాయుడు చెప్పారు.
ఈ సర్దార్ పటేల్ స్టేడియం నేనే కట్టానంటూ చెప్పారు.
ప్రతి కిలో మీటర్ కి ఓ విద్య సంస్థ లను తెచ్చాము….ఇన్ని చేసిన తెలుగుదేశం ఓటు అడిగే హక్కు కూడా మాకే ఉంది …ఖమ్మం సభ ద్వారా చెబుతున్నా ఇక తెలుగు తమ్ముళ్లు సిద్దం కండి…తెలుగుదేశం పార్టీలో గెలిచి ఖమ్మంలోని ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు….నా వల్ల, పార్టీ వల్ల అభివృద్ధి పొందిన వారు ఆలోచించాలి ..తెలుగుదేశం పార్టీ నీ పునః నిర్మాణం చేద్దాం…..రైతాంగాన్ని ఎట్టి పరస్థితుల్లో ను విష్మరించం …రైతులు అప్పులపాలు అవుతున్నారు…రైతులకు గిట్టబాటు ధర ఇవ్వాలి….రైతుల అభివృద్ధి కోసం పాలసీలు తీసుకురావాలి’’ అని ఉద్ఘాటించారు.
‘‘ఈ సభలో ప్రజలను చూసిన తర్వాత నాకు మళ్ళీ నమ్మకం పెరిగింది. ఆంధ్రలో కంటే ఇక్కడే నాకు నీరాజనాలు పలుకుతున్నారు..ఐటి గైస్ నన్ను గుర్తు పెట్టుకోవాలి…దానికి గూగుల్ అంకుల్ నీ అడగండి నా విలువ పార్టీ గురించి చెబుతుంది. ఒకప్పడు తెలంగాణలో ఎన్నో ఐటి కంపెనీలు రావడానికి తెలుగుదేశం అనే నేను చెబుతున్నా. ఈ సభ ద్వారా రాష్ట్రంలో తెదేపా ను ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా’’ అంటూ చంద్రబాబునాయుడు సభికులను ఉత్సాహ పరిచారు.
భారత రాష్ట్ర సమితిలో ఉన్న పాత తెలుగుదేశం నాయకులూ, కార్యకర్తలు జనాలను సభకు తీసుకువచ్చారనీ, సభకు వేలసంఖ్యలో ప్రజలు హాజరైనారనీ, ఇటీవలి కాలంలో ఖమ్మంలో ఇంత పెద్ద సభ జరగలేదనీ జర్నలిస్టులు అన్నారు.