Sunday, November 24, 2024

చంద్రబాబునాయుడు కంటతడి, వాకౌట్, అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు

  • మీడియా కాన్ఫరెన్స్ లో వైసీపీ నేతల వైఖరిపై దాడి
  • నా రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత అవమానానికి గురి కాలేదు
  • రెండున్నరేళ్ళ నుంచీ అవమానాలు ప్రజలకోసం భరిస్తూ వచ్చాను

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కన్నీరుమున్నీరైనారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా తన కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టకుండా రాజకీయాలలోకి లాగుతున్నారంటూ బావురుమన్నారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపైన దాడి చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే  అసెంబ్లీలో అడుగుపెడతానంటూ ప్రతిజ్ఞ చేశారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టి రామారావు కూడా 1989లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలలో వాడివేడి మాటలకు తట్టుకోలేక అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. తిరిగి ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ అడుగు పెడతానంటూ ప్రతిజ్ఞ చేశారు. నిజంగానే 1994 అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టారు. చంద్రబాబునాయుడు సంగతి ఏమి జరుగుతుందో 2024 కానీ తెేలదు.

అత్యవసరంగా టీడీఎల్ పీ సమావేశం నిర్వహించి తన కఠోర నిర్ణయాన్నిచంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టారు. రెండున్నరేళ్ళుగా అన్ని విధాలా అవమానిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ‘‘నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడినప్పుడూ కుంగి పోలేదు. గెలిచినప్పుడు రెచ్చిపోలేదు. అప్పుడు నా తల్లినీ, ఇప్పుడు నా భార్యను…’’ అంటూ విలపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక సందర్భంలో తన తల్లిని దూషించారనీ, తాను గట్టిగా ప్రశ్నించే వరకూ కడాకి క్షమాపణ కోరారనీ, తప్పు జరిగింది క్షమించమని అన్నారనీ చెప్పారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాలకోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. రెండున్నరేళ్ళుగా తనను అవమానిస్తున్నప్పటికీ ప్రజలకోసం భరిస్తూ వచ్చాననీ, దేశం కోసం తప్పితే స్వార్థంకోసం ఎన్నడూ ఆలోచించలేదనీ, తన భార్య  ఏ నాడూ రాజకీయాలలోకి రాలేదనీ, తనను ప్రోత్సహించడం ఒక్కటే ఆమె  చేసిన పని అనీ అన్నారు. ‘‘పెద్దపెద్ద మహానాయకులతో కలిసి పని చేశాను. జాతీయ స్థాయిలో కూడా అనేకమంది నాయకులతో కలసి పని చేశాను. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి అనుభవాలు ఎన్నడూ ఎదురు కాలేదు,’’ అంటూ బాధ వెలిబుచ్చారు.

‘‘ఏ నాడూ బయటికి రాని భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్నవారి ఇళ్ళలోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ అవమానిస్తోందనీ, టీడీపీ ఎంఎల్ఏలనూ, నేతలనూ అవమానించడం పరిపాటిగా మారిందనీ అన్నారు. భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారనీ, రాజకీయాలలో విలువలు ఇంత నీచంగా పడిపోతాయని అనుకోలేదనీ అన్నారు. మీడియా గోష్ఠిలో నాయుడు పక్కనే కూర్చున్న బుచ్చయ్య చౌదరి, పంచుమర్తి అనూరాధ కూడా కంటతడిపెట్టుకున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంస్కారం ఇదేనా అంటూ టీడీపీ నాయకురాలు పరిటాల సునీత ప్రశ్నించారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడినీ, ఆయన భార్యనీ విమర్శిస్తూ వారిపైన వ్యక్తిగత దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి వెకిలినవ్వులు నవ్వుతూ కూర్చున్నారంటూ విమర్శించారు.

తనకు పిల్లనిచ్చి, పార్టీలో నాయకత్వ హోదా ఇచ్చిన ఎన్ టి రామారావు చనిపోయినప్పుడు కానీ, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరణించినప్పుడు కానీ కంట తడిపెట్టని చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏడవడం విచిత్రంగా కనిపిస్తున్నదని వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్ టీ రామారావుకు అసెంబ్లీలో మాట్లాడటానికి మైకు కూడా ఇవ్వకుండా ఏడిపించిన చంద్రబాబు ఈ రోజు ఎవ్వరూ, ఏమీ అనకుండానే ఏదో అన్నారంటూ కంటతడిపెట్టడం వింతగా ఉన్నదని వైసీపీ నాయకులు విమర్శించారు. లక్ష్మీపార్వతి వ్యక్తిత్వ హననానికి తన చేతిలో ఉన్న మీడియాను ఉపయోగించుకున్నప్పుడూ, వైఎస్ ఆర్ సతీమణి విజయమ్మపైనా, కుమార్తె షర్మిలపైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన, చేయించిన చంద్రబాబు నాయుడు విలువల గురించి మాట్లాడటం వింతగా ఉన్నదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబునాయుడు కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు గురి అవుతున్నారనీ, ముఖ్యంగా కుప్పంలో కూడా మొన్నటి మునిసిపల్ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆయన గుండెచెదిరి వింతగా ప్రవర్తిస్తున్నారనీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles