• టీడీపీ నేతల గృహ నిర్బంధం
• రామాపురం పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన
• ఘటనపై డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
తంబళ్లపల్లెలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం టీడీపీ నేతలు బయలుదేరారు. మార్గ మధ్యంలో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఛలో తంబళ్లపల్లె కార్యక్రమానికి టీడీపీ పిలుపు నిచ్చింది.
టీడీపీ ఛలో తంబళ్లపల్లి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. కోరోనా నేపథ్యంలో ఛలో తంబళ్లపల్లె కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
టీడీపీ నేతల గృహ నిర్బంధం:
టీడీపీ నేత నరసింహ యాదవ్, పలమనేరులో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని కలికిరిలో టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లెలో శంకర్ యాదవ్, చిత్తూరులో టీడీపీ నేతలు నాని, దొరబాబు, శాంతిపురంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులను పోలీసులు గృహనిర్భంధం చేశారు. తంబళ్లపల్లెకు బయలుదేరిన టీడీపీ నేతలను శ్రీకాళహస్తిలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప టీడీపీ నేత శ్రీనివాస రెడ్డిని రామాపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన స్వగ్రామం లక్కిరెడ్డిపల్లెకు తరలించారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు రామాపురం పోలీసు స్టేషన్ లో తీవ్ర నిరసన తెలిపారు.
ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ:
తంబళ్లపల్లి దాడి ఘటనపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమను హౌస్ అరెస్టు చేయడం దారుణమన్నారు. తమ ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.