- ఆదాయం పెంచుకునే దిశగా నగర, పురపాలక సంఘాలు
- 20-25 శాతం పెరగొచ్చని అంచనా
- గురువారం మంత్రివర్గ సమావేశంలో చర్చ
అమరావతి: ఆస్తి విలువ ఆధారంగా పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇక పన్ను విధించనున్నారు. సంస్కరణల్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై అధ్యయనం కోసం అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీలు ఇటీవలే ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. గురువారం నాటి మంత్రివర్గ సమావేశం చర్చనీయాంశాలలో ఇది ఒకటి.
రాష్ట్రంలోని 120 పురపాలక, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో ఇంటి అద్దె ప్రాతిపదికగా నిర్ణయించిన జోనల్ రేట్ల ప్రకారం ప్రస్తుతం ఆస్తి పన్ను విధిస్తున్నారు. ఇంటి పొడవు, వెడల్పు కొలతలు (మీటర్లలో) తీసుకొని మొత్తం విస్తీర్ణం ఎంతో మొదట లెక్కిస్తున్నారు. వీటికి అప్పటికే ఆ ప్రాంతంలో అద్దె ప్రాతిపదికగా ఖరారు చేసిన జోనల్ రేట్లు జోడించగా వచ్చిన మొత్తాన్ని 12 నెలలకు లెక్కిస్తారు. ఈ విధంగా వచ్చిన వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ)పై కొన్ని మినహాయింపులు పోగా మిగతా మొత్తంపై 15 నుంచి 20 శాతం వరకు ఆస్తి పన్నుగా నిర్ణయిస్తున్నారు. రాష్ట్రంలో 33 లక్షలకుపైగా ఉన్న వివిధ రకాలైన నిర్మాణాల నుంచి పురపాలక, నగరపాలక సంస్థలకు ఆస్తి పన్ను కింద ప్రస్తుతం ఏటా రూ.1,200 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కొత్తగా అమలులోకి వచ్చే పన్ను విధానంతో ఇప్పుడొస్తున్న ఆదాయం 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఆస్తి విలువ ఆధారంగా అంటే…?
వ్యక్తిగత ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్, వాణిజ్య భవన విలువను స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ (చదరపు గజానికి) రేట్ల ఆధారంగా మొదట నిర్ణయిస్తారు. ఉదాహరణకు వంద గజాల స్థలంలో ఇల్లు ఉందనుకుందాం. సమీప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి విలువ గజం రూ.25 వేలు ఉంటే మొత్తం ఆస్తి విలువ రూ.25 లక్షలు అవుతుంది. ఇందులో ఎంత శాతం పన్ను విధించాలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒక శాతం విధిస్తే ఏడాదికి రూ.25 వేలు పన్ను చెల్లించాలి.
తుది నిర్ణయం పాలకవర్గాలదే
ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధింపు అంశానికి సంబంధించి పురపాలక చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా అమలుపై తుది నిర్ణయం పురపాలక, నగరపాలక సంస్థ పాలకవర్గాలకే వదిలిపెట్టాలని సర్కారు యోచిస్తోంది. ప్రత్యేక అధికారుల పాలనలో ఇవన్నీ ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రేట్ల ప్రకారం నిర్ణయించిన ఆస్తి విలువపై పన్ను ఎంత శాతం ఉండాలో వారు నిర్ణయిస్తారు. కనిష్ఠంగా, గరిష్ఠంగా ఎంత శాతం విధించొచ్చో ప్రభుత్వమైతే సూచనలు చేస్తుందని తెలుస్తోంది.