- పలుచోట్ల ఉద్రిక్తంగా పోలింగ్
- టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ కు ఆదేశం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు 9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. నాలుగు రోజులు వరుస సెలవులు రావడంతో భారీ సంఖ్యలో సొంత ఊళ్లకు వెళ్లడంతో దీని ప్రభావం ఓటింగ్ పై పడినట్లు తెలుస్తోంది.
పలు చోట్ల ఉద్రిక్తత
ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ నెలకొంది. కేబీహెచ్ బీ కాలనీతో పోలింగ్ కేంద్రం 58 వద్ద, బంజారాహిల్స్ ఎన్ జీ నగర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ ఎన్ జీ నగర్ లో ఉద్రిక్తం
ఎన్జీ నగర్ లో బీజేపీ శ్రేణులు కాషాయ రంగు మాస్కులు ధరించారని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులకు గులాబీ రంగు కంకణాలు కట్టుకున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు.
కేబీహెచ్ బీలో ఘర్షణ
కేపీహెచ్ బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్
ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పేపరులో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తును ముద్రించారు. దీంతో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్ పేటలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ను రద్దు చేసినట్లు ఎస్ ఈ సీ ప్రకటించారు. ఓల్డ్ మలక్ పేట డివిజన్ పరిథిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో డిసెంబరు 3న రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది.
చాంద్రాయణ గుట్టలో ఓటర్ల ఆందోళన
ఓట్లు గల్లంతయ్యాయంటూ చాంద్రాయణ గుట్ట ఇంద్రా నగర్ లో పలువురు ఆందోళనకు దిగారు. మరికొందరు ఓట్లు వేరే డివిజన్ కు మార్చారని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా ఒకే డివిజన్ లో ఓటు వేస్తున్నా ఇపుడు మాత్రం ఓటరు జాబితాలో పేరులేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.