రామాయాణమ్ – 107
‘‘నాయనా అంగదా, సుగ్రీవునితో స్నేహములేని వారితో గాని ,
అతని శత్రువులతోగానీ కలిసి తిరుగకుము. ప్రభువైన సుగ్రీవుని కార్యము నిర్వర్తించుటయందే నీ శక్తియుక్తులు ప్రదర్శించుము. అన్య విషయములలో వలదు. అతనికి ఎల్లప్పుడు వశుడవై ఉండుము. నీవు ఎవరి విషయములలో ఎక్కువ ప్రేమ చూపవలదు. అటులనే ఎక్కువ ద్వేషమూ వలదు. రెండూ చెడ్డవే. అందుచేత నీవు మధ్యేమార్గ స్పష్టదృష్టి అలవరుచుకొనుము’’ ఈ మాటలు చెపుతూ చెపుతూ ఉన్నప్పుడు ఆయనకు బాణము గ్రుచ్చుకొనుటవలన కలిగిన వేదన అధికము కాజొచ్చెను.
Also read: తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన
మాటలాడుచుండగనే కండ్లు తేలవేసి కోరలు వెళ్ళబెట్టి ప్రాణములు వదిలి వేశాడు మహాబలి వాలి. ఒక్కసారిగా వానరలోకమంతా గొల్లుమన్నది. వాలి శరీరమును కౌగలించుకోనుటకు తారకు బాణము అడ్డము వచ్చుట గమనించిన సుగ్రీవుడు నీలుని ఆ బాణము పెరికి వేయమనగా, నీలుడు రామబాణమును వాలి శరీరమునుండి బలముగా లాగి అవతల పారవైచెను.
బాణము తో పాటుగా వాలి శరీరమునుండి రుధిరధారలు. అవి చూడగనే తార కంటి నుండి అశ్రుధారలు ఒకేసారి పెల్లుబికి ప్రవహించాయి. అన్న మరణానికి చింతిస్తూ సుగ్రీవుడు రామునితో, ‘‘రామా నా అన్న మరణించిన పిదప నాకు ఈ రాజ్యమెందులకు నేను కూడా అతనితోటే ఆ చితిలోనే ప్రవేశించెదను. ఓ రామా నాకు అనుమతి నీయవయ్యా. నేను లేక పోయిననూ నీ కార్యము మా వానర వీరులు నిర్వర్తించగలరు. రామా నాకు బ్రతుకు మీద ఆశ లేదు. నేను కూడా చనిపోవుటకు అనుమతించు రాఘవా’’ అని హృదయ విదారకముగా రోదిస్తున్న సుగ్రీవుని చూసి రాముని మనస్సులో క్షణకాలము విషాదము ఆవహించినది.
Also read: రాముడు తనను చంపడం అధర్మం కాదని అంగీకరించిన వాలి
అంతట వానరులందరూ కలిసి భర్త శరీరము పై పడి ఏడుస్తున్న తారను బలవంతముగా అక్కడినుండి తొలగించగా ఆవిడ కాళ్ళూ చేతులూ విలవిలా కొట్టుకుంటూ ఆయననుండి దూరము కాలేక అక్కడనే యుండుటకు ప్రయత్నించసాగినది. అప్పుడు అందరూ కలసి ఆవిడను అక్కడనుండి లేపినప్పుడు ఆవిడ ఒకసారి రాముని చూసినది. ఆ చూపులో ఎన్ని అర్ధాలో. పరుగు వంటి నడకతో రాముని సమీపించింది తార.
‘‘ఓ రామా ఊహించరాని రూపము నీది. ఎదిరింపరాని వీరము నీది
జితేన్ద్రియుడవీవు. పరమ ధార్మికుడవీవు. ఓర్పున పృథ్వీ సముడవు
నేర్పుగల వాడవు. సామర్ధ్యమున్నవాడవు. మహాబలశాలివై అందమైన రూపముతో గొప్ప ధనుస్సు ధరించి దివ్యదేహ వైశిష్ట్యముతో విరాజిల్లుతున్నవాడవు.
Also read: మోదుగువృక్షంలాగా నేలవాలిన వాలి
ఓ వీరుడా, ఏది నా మగని చంపిన ఆ బాణము? దానితోనే నన్ను కూడా చంపవయ్యా! నేను కూడా అతనున్న చోటికే వెళ్ళగలదానను. నేను లేక అతనక్కడ ఉండలేడయ్యా. స్వర్గములో ఇటుఅటు చూసి నేను కనబడక పోయినచో అప్సర స్త్రీలను కూడా దగ్గరకు రానీడయ్యా ఆయన.
సీత లేక నీవు ఎలా కృంగి కృశించి పోవుచున్నావో నేను కూడా వాలి లేక అంతే కృశించి పోయెదను. విరహమన్న ఏమో నీకు బాగుగా తెలియును కదా! ఇంత సుందర ధరిత్రిలో ఈ పర్వత ప్రాంతమందు కూడా సీత పక్కన లేక నీవు బాధ పడుటలేదా? నాకెందుకయ్యా ఈ వియోగ వ్యధ? నన్ను కూడాచంపివేయుమయ్యా. భార్యా భర్తలిరువురూ ఒకటే శరీరము. ఈ శరీరము కూడా వాలి శరీరములో భాగమేనయ్యా. అందుకే నన్ను కూడా కడతేర్చుము,రామా. నీకు స్త్రీ హత్యా దోషమంటదు రఘురామా.
రాముడు తార విలాపములన్నీ విన్నాడు.
‘‘ఓ తారా, నీవిటుల శోకించుట తగదు. ఇట్టి విపరీతపు ఆలోచనలు మానివేయుము. ఈ లోకమునకు సృష్టి కర్త బ్రహ్మ. సుఖదుఖములనూ ఆయనే ఏర్పరచినాడు. నీవు పూర్వపు ఆనందమునే మరల పొందగలవు. నీ కుమారుడు యౌవరాజ్య పట్టాభిషిక్తుడు కాగలడు. శూరుల భార్యలు ఇట్లు విలపించరు’’ అని అనేక విధములుగా ఓదార్చినాడు శ్రీరామచంద్రుడు.
Also read: సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు
వూటుకూరు జానకిరామారావు