- తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఎత్తులు
- అళగిరిని అక్కున చేర్చుకోనున్న బీజేపీ
- రజనీ మద్దతు కోరనున్న అమిత్ షా
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సుధీర్ఘకాలం పాటు తమిళ రాజకీయాలను శాసించిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలిత లేకుండా తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది. దక్షిణాదిలో బలపడేందుకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బీజేపీకి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత వరంలా మారింది. ఇప్పటికే అధికార అన్నా డీఎంకే ను తన గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ 2021లో అధికారమే లక్ష్యంగా మోదీ, అమిత్ షాలు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని విస్తరించే క్రమంలో కాంగ్రెస్, డీఎంకేల నుంచి ప్రజాదరణ గల నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత, సినీనటి ఖుష్బూను బీజేపీలో చేర్చుకున్నారు.
స్టాలిన్ కు చెక్
తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకే ను దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు ఆయన సోదరుడు అళగిరి కి మధ్య ఎప్పటినుండో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇపుడు వీటిని సాకుగా చూపి అళగిరిని బీజేపీ తనవైపుకు తిప్పకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు అళగిరితో పలు మార్లు సమావేశమైనట్లు తెలుస్తోంది.
కరుణానిథి మరణానంతరం డీఎంకే పగ్గాలు చేపట్టాలనుకున్న అళగిరికి స్టాలిన్ చెక్ పెట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే అన్నను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అళగిరి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనను పార్టీ నుంచి బహిష్కరించి అవమానించిన స్టాలిన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చూపాలని అళగిరి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి దగ్గరయ్యేందుకు అళగిరి ప్రయత్నాలు చేస్తున్నారు.
తిరుగులేని నేతగా ఎదిగిన అళగిరి
అళగిరికి పార్టీలో పట్టున్నా తండ్రి కోరిక మేరకు పార్టీ అంతర్గత కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదు. తండ్రి మరణానంతరం పార్టీలో కీలకంగా మారేందుకు చేసిన ప్రయత్నాలను స్టాలిన్ అడ్డుకున్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడి గా పేరుంది. అళగిరి సొంత బలంతో పార్టీకి సీట్లు సాధించిపెట్టారు. దక్షిణ తమిళనాడులో డీఎంకే ని దెబ్బకొడితే అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న స్టాలిన్ ఆశలు అడియాసలయ్యే అవకాశం ఉంది.
అళగిరి కొత్త పార్టీ కలైంజర్ డీఎంకే
1960 లో కరుణానిధి ప్రదర్శించిన కలైంజర్ నాటకం ఆయనకు తిరుగులేని రచయితగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అప్పటి నుండి కరుణానిధిని కలైంజర్ అని పిలుస్తుంటారు. అళగిరి తన కొత్త పార్టీకి కలైంజర్ డీఎంకే గా నామకరణం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటికి అళగిరి కొత్త పార్టీ స్థాపించి ఎన్డీఏ కూటమికి మద్దతునిస్తారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీతో కలిసి సాగేందుకు అళగిరి మద్దతు దారులు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అన్న కదలికలను నిశితంగా గమనిస్తున్న స్టాలిన్ ఆయన మద్దతుదారులను తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అమిత్ షాతో భేటీ కానున్న అళగిరి
తమిళనాడులో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అళగిరి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం అళగిరి కొత్త పార్టీ పెడతారా, లేదా బీజేపీలో చేరి పార్టీ విజయానికి కృషి చేస్తారా అన్న అంశం పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయావకాశాలు దారుణంగా దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
రజనీకాంత్ మద్దతు కోరనున్న అమిత్ షా
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 21న రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నైలో రజనీకాంత్ ను కలుసుకోనున్నట్లు సమాచారం. తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ పార్టీని ఇప్పట్లో ప్రారంబించే ఉద్దేశం లేదంటూ ఇటీవల రజనీ కాంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.