• రజనీకాంత్ నిర్ణయంతో ఊపిరిపీల్చుకున్న ప్రధాన పార్టీలు
• తాజా వ్యూహాలను రచించే పనిలో నేతలు
• వ్యూహాలకు పదును పెట్టనున్న అమిత్ షా
దాదాపు 30 సంవత్సరాలుగా తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రజనీకాంత్ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ఆయన మద్దతు పొందేందుకు కాకలు తీరిన పార్టీలు పడిగాపులు పడేవి. అలాంటిది ఇటీవల ఆయనే పార్టీ పెడతారని చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అయితే అంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం సహకరించడంలేదని రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సంచలనాలకు మారుపేరైన రజనీకాంత్ 1996 ఎన్నికల సమయంలో వేసిన డైలాగులు ఓ సారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జయలలితపై రజనీ కాంత్ నిప్పులు చెరిగారు. జయలలిత అధికారంలోకి వస్తే భగవంతుడు కూడా తమిళనాడు ను రక్షించలేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ డైలాగ్ మారుమూల గ్రామంలో ఉండే ఓటరును కూడా తాకడంతో ఆ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే భారీగా లాభపడింది. ఈ ఎన్నికల్లో డీఎంకే తమిళ మానిల కాంగ్రెస్ కూటమి 221 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది.
ఇది చదవండి: రజినీ సినిమా రద్దు
మెరుగుపడ్డ డీఎంకే విజయవాకాశాలు:
సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు రావడం రజనీ రాజకీయాలనుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో తమిళనాడులోని ప్రధాన పార్టీలు సంతోష పడుతున్నాయి. డీఎంకే శ్రేణులు అయితే ఆనంద పారవశ్యంలో తేలియాడుతున్నాయి. రజనీ కాంత్ రాజకీయల్లో మాయాజాలం చేస్తారని ఆమాయాజాలం నుంచి భారీగా లబ్దిపొందాలని పలు పార్టీలు భారీగా ప్రణాళికలు రచించుకున్నాయి. అయితే రజనీకాంత్ అకస్మాత్తుగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. ఇపుడు ఎన్నికల బరిలో రజనీకాంత్ లేకపోవడంతో డీఎంకేకు విజయావకాశాలు భారీగా మెరుగుపడ్డాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రజనీకాంత్ చీల్చితే డీఎంకే విజయవాకాశాలకు దెబ్బతినేవి. రజనీ నిర్ణయంతో డీఎంకే ఊపిరి పీల్చుకుంది. రజనీకాంత్ నిర్ణయం ప్రతిపక్ష డీఎంకేతో సహా, మిత్రపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలలో జవసత్వాలు నింపింది. అన్నాడీఎంకే పై ఉన్న ప్రజావ్యతిరేకత ఇక తమకే లాభిస్తుందని డీఎంకే అంచనా వేస్తోంది.
ఇది చదవండి: తమిళ రాజకీయాలను రసమయం చేస్తున్న సినీప్రముఖులు
విఫలమైన అమిత్ షా వ్యూహాలు:
రజనీకాంత్ సహాయంతో అన్నాడీఎంకేను శాసిద్దామనుకున్న బీజేపీ ఆశలు ఆవిరైపోయాయి. తమిళనాడులో ప్రస్తుతానికి ఎన్డీఏకు అన్నాడీఎంకే ముఖచిత్రంగా కనిపిస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అయన్ని బూచిగా చూపి సీట్ల పంపకాల్లో బీజేపీ బెట్టుచేసే అవకాశం ఉండేది. చిన్నా చితకా పార్టీలు, రజనీకాంత్ ను కలుపుకుని మూడో ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు కూడా బీజేపీ చేస్తునట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ సాయంతో అన్నాడీఎంకేను దారికి తెద్దామనుకున్న అమిత్ షా ప్రణాళికలు బెడిసికొట్టాయి. దీంతో పొత్తుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీపై అన్నాడీఎంకే పైచేయి సాధించినట్లయింది. బీజేపీతో బేరాసారాల విషయంతో అన్నాడీఎంకే పట్టు బిగించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇది చదవండి: రాజకీయాల్లోకి రావట్లేదు-రజనీకాంత్ ప్రకటన
రజనీ రాజకీయాలపై తలోమాట:
రాజకీయాల్లోకి వస్తానంటూ డిసెంబరు 3 న రజనీకాంత్ ప్రకటన చేయడంతో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను మార్చుకున్నాయి. దీనిపై డీఎంకే ఆచితూచి వ్యవహరించింది. రజనీ రాజకీయాల్లోకి రానీయండి అంటూ వేచి చూసే ధోరణి అవలంబించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా రజనీ అధ్యాత్మిక రాజకీయాలను కొట్టిపారేశారు. అటువంటి రాజకీయాలకు తమిళనాడు లో చోటులేదని అన్నారు. రజనీ తీసుకున్న నిర్ణయంతో మరోసారి అన్నాడీఎంకే డీఎంకేల మధ్యే ప్రధానంగా ఎన్నికల పోటీ జరగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు
రజనీ నిర్ణయంతో బిత్తరపోయిన బీజేపీ:
రాజకీయాలపై రజనీకాంత్ తీసుకున్ననిర్ణయాన్ని అంచనావేయలేని బీజేపీ ఊహించని పరిణామాలతో విస్తుపోయింది. రజనీకాంత్ ప్రజాకర్షణ శక్తిని సొమ్ము చేసుకుని రాబోయే ఎన్నికల్లో ఎలాగొలా అధికారం చేజిక్కించుకుందామని భావించిన బీజేపీకి ఆట మొదలవకుండానే భారీ ఎదురుదెబ్బ తగిలిందనే అంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తుందో వేచి చూడాలి. మరోవైపు రజనీ నిర్ణయంతో స్టాలిన్ సోదరుడు అళగిరి కూడా ఖంగుతిన్నారు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవితవ్యం పై ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
ఇది చదవండి: రజినీకాంత్ రాజకీయ వైరాగ్యం మతలబు ఏమిటి?