Thursday, November 21, 2024

జీవో 317పై గందరగోళం, ఖండనమండనలు అవసరమా?

తెలంగాణలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీలపైన రభస జరుగుతోంది. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ అంశంపైన జాగరణ చేయడానికి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయస్థానం 14రోజుల రిమాండు విధించింది.

స్థానికత అనేది తెలంగాణ ఉద్యమానికి మూలమైనది. స్థానికత బదిలీలలో కూడా పాటించాలని ఉపాధ్యాయులూ, ఉద్యోగులూ కోరుతున్నారు. ఎవరి స్వగ్రామాలకు దగ్గరగా వారు ఉంటూ ఉద్యోగాలు చేసుకోవాలని అభిలాష. అయితే, సీనియరిటీ ముఖ్యం కానీ స్థానికత బదిలీల విషయంలో పరిగణనలోకి రానేరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత స్థానికత గురించి పట్టించుకునే 371డి అధికరణ అవసరం లేదని కొందరు వాదిస్తే, తెలంగాణ రాష్ట్రంలో కూడా అసమానతలు చాలా ఉన్నాయనీ,  ఈ అధికరణ కొనసాగాలని చాలామంది వాదించారు. ఈ అభిప్రాయానికి అనుకూలంగానే రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 124 తెచ్చింది. 2016లొ ఏర్పడిన 31 జిల్లాలకూ మరి రెండు జిల్లాలకు దీన్ని వర్తించారు. దీని నాలుగవ, అయిదవ పేరాలలో స్థానికత పరిగణనలోకి తీసుకునేది లేదనీ, సీనియారిటీ ఒక్కటే లెక్కలోకి తీసుకుంటామనీ స్పష్టంగా ఉంది. ఉద్యోగాలలో నియామకాలు జరిగే సమయంలోనే స్థానికతకు ప్రాధాన్యం ఇస్తామే కానీ బదిలీల సందర్భంలో కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 31 జిల్లాలను 33కు పెంచిన తర్వాత ఇచ్చిన 128వ జీవో అదే మాదిరిగా ఉంది. తర్వాత 2021 డిసెంబర్లో వచ్చిన జీవో 317 లో కూడా సీనియారిటీ ప్రస్తావనే ఉన్నదే కానీ స్థానికత ఊసు లేదు. దీనికి తెలంగాణ టీచర్స్ యూనియన్ వంటి సంస్థలు అభ్యంతరం లేవదేశాయి. టి.జీవన్ రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు గొంతు కలిపారు. బండి సంజయ్ ముందుకు ఉరికారు. 317వ జీవోను రద్దు చేయాలని రాష్ట్ర గవర్నర్ ని కోరుతూ తమిళిసైకి జీవన్ రెడ్డి లేఖ రాశారు. బదిలీలకు స్థానికత వర్తించదని టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతలు స్పష్టం చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో సహకరించాలని టీజీవో అధ్యక్షురాలు వి మమత, టీఎన్ జీవో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ అన్నారు.

వాస్తవాలు తెలిసి కూడా ఉద్యోగులలోనూ, ఉపాధ్యాయులలోనూ చీలిక తేవాలనీ, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆందోళన చేస్తున్నారంటూ టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ ఆరోపించారు.

317 నంబరు జీవోను 6 డిసెంబర్ 2021న తీసుకొని వచ్చే ముందు తమను సంప్రతించలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొన్ని అభ్యంతరం చెబుతున్నాయి. డిసెంబర్ 28న ఉపాధ్యాయులు తమ విధులకు హాజరు కాకుండా హైదరాబాద్ వచ్చి సచివాలయం దగ్గర ధర్నా చేశారు.  ఈ జీవో ప్రకారం ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీలూ, కేటాయింపులూ జోనల్ విధానం మేరకు జరుగుతాయనీ, జిల్లా స్థాయి (కేడర్) ఉద్యోగుల కేటాయింపులూ, బదిలీలను జిల్లా కలెక్టర్, జిల్లాలో డిపార్టుమెంటు హెడ్ కలసి నిర్ణయిస్తారనీ, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, సీనియర్ కన్సల్టెంట్లు కలిసి నిర్ణయిస్తారనీ అంటున్నారు.

స్థానికత కాకుండా కేవలం సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడంతో కొంతమంది వంద కిలోమీటర్ల దూరానికి బదిలీ అవుతున్నారనీ, ఇది అన్యాయమనీ జీవన్ రడ్డె గవర్నర్ కు రాసిన లేఖలో అన్నారు. మంచిర్యాలలో పని చేస్తున్న ఉద్యోగిని 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ కు బదిలీ చేస్తున్నారనీ, ఇది అసమంజసమనీ జీవన్ రెడ్డి వాదించారు.

ఇదే అంశంపైన బీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ ప్రారంభించారు. పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయస్థానం సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. తెలంగాణ ప్రభుత్వానికి మతి పోయిందనీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదనీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీ చార్జి చేశారనీ, ఇది పరమ దుర్మార్గమనీ, తెలంగాణ ప్రభుత్వంపైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తాయనీ ఆయన ఉద్ఘాటించారు.

రాష్ట్రపతి ఉత్తర్వులోనూ, వాటిని అనుసరించి ఇచ్చిన 214 జీవోలోనూ, 317 జీవోలోనూ స్థానికత ప్రసక్తి లేనప్పుడు, సీనియారిటీకే ప్రాధాన్యం అన్నప్పుడు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు ఉద్యమాలు చేయడం ఉద్యోగులనూ, ఉపాధ్యాయులనూ గందరగోళానికి గురి చేయాలనే దురుద్దేశంతోనే అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. జీవో 317కు అభ్యంతరం చెబుతున్న ఉపాధ్యాయ సంఘాలనూ, ఉద్యోగ సంఘాలనూ చర్చలకు పిలిచి వారి భయసందేహాలను నివృత్తి చేయడం ప్రభుత్వం బాధ్యత. వారిని సంప్రతించకుండా జీవో తెచ్చిన ప్రభుత్వం వారు అభ్యంతరం చెబుతూ సచివాలయాన్ని ముట్టడించిన తర్వాత కూడా మొండి వైఖరి విడనాడి చర్చలు నిర్వహించాలి. సమాలోచన, సంప్రదింపులూ, చర్చలూ, అవగాహన ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రభుత్వాలు పంతాలూ, పట్టింపులకూ పోకూడదు. ప్రభుత్వ అనుకూల నాయకులతో ప్రకటనలు ఇప్పించడం, మీడియాలో ప్రచురించడం, ప్రసారం చేయడం సరిపోదు. ఎవరికి అభ్యంతరాలు ఉన్నాయో వారిని పిలిచి బాధ్యులు మాట్లాడాలి. ఈ పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles