Saturday, December 28, 2024

అఫ్ఘానిస్తాన్ లో సంస్కరణలను కాలదన్నే ముల్లాల రాజ్యం

అఫ్ఘానిస్తాన్ లో ముల్లాల రాజ్యం తిరిగి వచ్చింది. తమ గురించి ప్రపంచం ఏమని అనుకుంటున్నదనే విషయం అసలు పట్టించుకునే సమస్య లేదని తాలిబాన్ తమ నిర్ణయాల ద్వారా  స్పష్టం చేశారు. ఇండియా, అమెరికా, చైనా, ఇతర దేశాలు కోరినట్టు అందరినీ కలుపుకొని వెళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం తాలిబాన్ కు ఏ కోశానా లేదని తేలిపోయింది. వారు అనుకన్నదే చేస్తారు తప్ప తక్కినవారు చెప్పింది చెవికి ఎక్కించుకునే సంస్కారం వారికి లేదని రుజువయింది. అఫ్ఘానిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్స్ ను నెలకొల్పుతున్నట్టు, మంత్రి మండలిలో ఫలానావారు ఉండబోతున్నట్టూ తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సెప్టెంబర్ 7న ప్రకటించినప్పుడే ఆధునిక ప్రపంచం ఆశలు అడియాసలైనట్టు తేలిపోయింది.

Also read: అఫ్ఘాన్ ప్రధానిగా రాజీ అభ్యర్థి హసన్ అఖుండ్

పష్టూన్ల ఆధిక్యం

అఫ్గానిస్తాన్ లో నాలుగు కోట్ల జనాభా ఉంటే వారిలో నలభై శాతంమంది పష్టూన్లు. ముజాహిద్ ప్రకటించిన 33 మంది కేబినెట్ మంత్రులలో 30 మంది పష్టూన్లే. తజిక్స్ కీ, హజారాలకూ ప్రాతినిధ్యం లేదు. ఇతర తెగలను కలుపుకొని పోవాలన్న ధ్యాస ఏమాత్రం లేదు. ఇక మహిళలకూ, హజారాలకు వేధింపులు అనివార్యం. తాలిబాన్ 1996 నుంచి 2001 వరకూ రాజ్యం చేసినప్పుడు మహిళల పట్లా, హజారాల పట్లా ఎంత దారుణంగా, వివక్షాపూరితంగా, రాక్షసంగా వ్యవహరించారో గుర్తున్నవారికి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. షియా మతస్తులైన హజారాలనూ, అన్ని తెగలకు చెందిన మహిళలనూ మంత్రిమండలిలో చేర్చుకోకుండా పూర్తిగా బహిష్కరించారు. బామియాన్ లో 2001 మార్చిలో బుద్ధవిగ్రహాలను ధ్వంసం చేయించిన ముల్లా హసన్ అఖుండ్ ప్రధానిగా ఉంటారు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా పరిగణించి బ్లాక్ లిస్టులో పెట్టిన 17 మంది కొత్త మంత్రివర్గంలో గౌరవ సభ్యులు. కనిపించని, వినిపించని తాలిబాన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్ జాదా సర్వోన్నత నేతగా ఉంటారు. ఇరాన్ లో అయితొల్లా స్థాయి అఫ్ఘానిస్తాన్ లో హైబతుల్లాకు ఉంటుందన్నమాట. అఫ్ఘానిస్తాన్ లో హైబతుల్లాను ‘‘అమీర్ ఉల్-మామినీమ్’’ అని భక్తిశ్రద్ధలతో పిలుచుకుంటారు. అంటే ‘విశ్వాసులకు ప్రధాన సేనానాయకుడు’ అని అర్థం.

Also read: అమెరికా అఫ్ఘానిస్తాన్ లో ఖర్చు చేసిన డబ్బు అమెరికాలోనే ఉంది

సిరాజుద్దీన్ హకానీకి పెద్దపీట

అతి భయంకరుడిగా పేరుపొందిన సిరాజుద్దీన్ హకానీ దేశీయాంగమంత్రిగా ఉంటారు. ఆయనపైన అమెరికా పరిశోధన సంస్థ ఎఫ్ బీఐ ఉగ్రవాదిగా ముద్రవేసి ఆయనను పట్టుకునేందుకు దోహదం చేసే సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. మంత్రిమండలిలో పాకిస్తాన్ కు ఆప్తవర్గమైన హకానీ ముఠాకూ, కాందహార్ కు చెందిన తాలిబాన్ ముఠాకూ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తాలిబాన్ లో ఎంతోకొంత సామరస్యవాదులుగా పేరు తెచ్చుకున్న, భారత్ పట్ల కొంత సద్భావం కలిగిన కతార్ ముఠాకు అంతగా ప్రాధాన్యం లేదు. ప్రధాని కావలసిన కతార్ ముఠా నాయకుడు ముల్లా బరాదర్ ఉపప్రధానిగా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. ఇదంతా పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధినేత ఫాయిజ్ హమీద్ కాబూల్ సందర్శించినప్పుడే నిర్ణయమైంది.

Also read: పంజ్ షీర్ గెలుచుకున్నాం: తాలిబాన్ ప్రకటన, ప్రతిఘటన దళాల ఖండన

లోగడ 1996లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబాన్ కంటే ఇప్పుడు ఆగస్టు 15న అఫ్ఘానిస్తాన్ ను కైవసం చేసుకున్న తాలిబాన్ ఎక్కువ బలవంతమైనది. అప్పుడు పంజ్ షీర్ ను దాని మానాన దానిని వదిలివేశారు. ఈ సారి పట్టుబట్టి ముట్టడించి మరీ స్వాధీనం చేసుకున్నారు. అందుకోసం వేలమంది తాలిబాన్ ను బలిపెట్టడానికి కూడా సంకోచించలేదు.

Also read: పంజ్ షీర్ ను ఆదుకోండి, ఐక్యరాజ్య సమితికి సాలే విజ్ఞప్తి

‘మహిళలకు మంత్రిపదవులు అనవసరం’

మహిళలను మంత్రిమండలిలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే, ‘‘మహిళల పని పిల్లల్ని కనడమే. వారు మంత్రులుగా పనికి రారు,’’ అని తాలిబాన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ విధంగా 1996-2001 నాటి క్రూరమైన పాలనను గుర్తు చేశారు. ‘‘ఒక మహిళ మంత్రి కాజాలదు. మంత్రిని చేయడం అంటే ఆమె మోయలేని బరువును ఆమె నెత్తికెత్తినట్టే. కేబినెట్ లో మహిళలు ఉండవలసిన అవసరం లేదు. వారు పిల్లల్ని కనాలి. నిరసన ప్రదర్శనలు చేస్తున్న మహిళలు అఫ్ఘానిస్తాన్ లో మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదు, ’’ అని తాలిబాన్ ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హాషిమీ వ్యాఖ్యానించారు. మహిళలు సమాజంలో సగం మంది ఉన్నారు కదా అంటూ ‘టోలోన్యూస్’ సంస్థ ప్రతినిధి ప్రశ్నించారు. ‘‘వారిని సగంగా మేము పరిగణించం. సమాజంలో సగం అన్నదే తప్పుడు నిర్వచనం. సగం అంటే వారిని కేబినెట్ లో నియమించి మరేమీ చేయనక్కరలేదని అర్థం. అప్పుడు వారి హక్కులను ఉల్లంఘించినప్పటికీ సమస్య కాదు. అఫ్ఘానిస్తాన్ లో గత ఇరవై సంవత్సరాలలో మీడియా, అమెరికా, దాని చేతిలోని కీలుబొమ్మ ప్రభుత్వం ఏమి చెప్పినా అసంగతమే. అది కార్యాలయంలో వ్యభిచారం కాదా?’’ అని హషిమీ ఎదురు ప్రశ్నించారు.

Also read: పంజ్ షీర్ తాలిబాన్ స్వాధీనం?

‘మహిళలందరినీ వ్యభిచారిణులంటూ నిందించగలరా?’ అని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు హాషిమీని ప్రశ్నించాడు. ‘‘అందరు అఫ్ఘాన్ మహిళలు వ్యభిచారిణులు అని నేను అనను. వీధులలో నిరసన ప్రదర్శన చేసిన నలుగురు మహిళలు అఫ్ఘాన్ మహిళలకు ప్రాతినిధ్యం వహించరు. పిల్లలను కని,పెంచి, చదివించి, ఇస్లామిక్ మర్యాదలూ, సూత్రాలూ నేర్పే మహిళలే అఫ్ఘాన్ మహిళలు,’’ అని విస్పష్టంగా చెప్పారు.

Also read: అఫ్ఘానిస్తాన్ జోలికి ఎవరు వచ్చినా ఇదే గతి, అమెరికా నిష్క్రమణపై తాలిబాన్ వ్యాఖ్య

మహిళలు మంత్రులు కాజాలరని ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించగా, ‘‘మహిళలు ఏమి చేస్తారు? ఒక మంత్రి చేయవలసిన పనులు చేయలేరు. ఆమె మోయజాలని బరువును ఆమె నెత్తిన పెట్టడమే అవుతుంది,’’ అంటూ సమాధానం ఇచ్చాడు హాషిమీ. కొత్త నిబంధనల కింద ఇస్లాం మతసూత్రాలకు లోబడ మహిళలు పని చేయవచ్చునని, అదే విధంగా మహిళలూ, పురుషులూ వేరువేరుగా విభజన తెరకు రెండు పక్కలా కూర్చొని విశ్వవిద్యాలయాలలో చదువుకోవచ్చుననీ అన్నారు. అయితే వారు అబయా దుస్తులూ, నికాబ్ ధరించాలి.

Also read: అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్లను ఓడించేందుకు ముజాహిదీన్ ని తయారు చేశాం: జనరల్ ముషారఫ్

సమగ్రత సరే, సమైక్యత ఏదీ?

అఫ్ఘానిస్తాన్ 1973లో రిపబ్లిక్ అవతరించిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆ దేశ సమగ్రతను సాధించలేకపోయింది. సుస్థిరత ప్రసాదించలేకపోయింది. తాలిబాన్ సమగ్రతను సైనిక చర్యల ద్వారా సాధించారు. సమైక్యత, సుస్థిరత సాధించడం అసాధ్యంగా కనిపిస్తున్నది. అటుదిశగా ప్రయత్నం చేయడానికి కూడా తాలిబాన్ సిద్ధంగా లేరు. నిజమే. తాలిబాన్ 1996లో కంటే ఇప్పుడు బలంగా తయారైనారు. లోగడ పాకిస్తాన్, సౌదీ అరేబియా తప్ప పెద్దదేశాలు ఏవీ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యా అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, పష్టూన్ జాతీయవాదం ఆధిక్యం ప్రదర్శిస్తే అఫ్ఘానిస్తాన్ లో ఉన్న ఇతర జాతులు ఆగ్రహిస్తాయి. సంక్షోభానికి గురి అవుతాయి. తెగలకూ, ప్రాంతాలకూ, జాతులకూ మధ్య ఉన్న విభేదాలను అణచివేయడం తాలిబాన్ వల్ల కాకపోవచ్చు. తాలిబాన్ అమెరికా ధాటికి లొంగిపోయి పాకిస్తాన్ లోకి జారుకున్నట్టే పంజ్ షీర్ నుంచి తప్పుకున్న తజిక్ తెగవారు తజికిస్తాన్ లేదా టర్కీలో ఆశ్రయం పొంది అఫ్ఘానిస్తాన్ అంతటా తిరుగుబాట్లు నిర్వహించే అవకాశం లేకపోలేదు. 2005 నుంచి తాలిబాన్ అమెరికా సైన్యం మీదా, అఫ్ధాన్ పైనికులమీదా, పౌరుల మీదా గెరిల్లా దాడులు సాగించినట్టు తజిక్ తెగకు చెందిన యోధులు కూడా అదే పంథాను అనుసరించే అవకాశం లేకపోలేదు. అయితే, పాకిస్తాన్ తాలిబాన్ కు ఇచ్చినంత మద్దతూ,ప్రోత్సాహం అహ్మద్ మసూదీ నాయకత్వంలోని తజిక్ తెగవారికి తజికిస్తాన్ ఇస్తుందా లేదా అన్నది ప్రశ్న. పాకిస్తాన్ కు ఉన్న ఐఎస్ఐ వంటి సంస్థ తజకిస్తాన్ లో లేదు. మరో విషయం ఏమంటే, పష్టూన్లు అఫ్ఘాన్  జనాభాలో అధిక శాతం ఉన్నారు. తజిక్ ల శాతం తక్కువ. షియాలను పూర్తిగా పరిహరించడం, పష్టూన్లు మినహా తక్కిన తెగలనూ దూరంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదు. గత ఇరవై సంవత్సరాలలో హక్కులను అనుభవించడానికి అలవాటు పడి, హక్కులకోసం పోరాడటం నేర్చుకున్న ప్రజలు అణచివేతను మౌనంగా భరిస్తారని అనుకోవడం కూడా వివేకవంతమైన భావన కాదు. పష్టూన్ లలో మార్పు రాలేదనీ, వారి భావజాలంలో ఏ మాత్రం సారళ్యం ప్రవేశించలేదనీ, మహిళల పట్లా, ఇతర తెగల పట్ల చులకన భావం పోలేదని ఇంతవరకూ తాలిబాన్ తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది తాలిబాన్ కు కానీ, అఫ్ఘానిస్తాన్ కు కానీ క్షేమదాయకం కాదు. 1996-2001 కాలంలో చేసిన తప్పులను దిద్దుకుంటారని భావించిన సంస్కరణవాదులకు తాలిబాన్ నిరాశ కలిగించారు.

Also read: అఫ్ఘానిస్తాన్ ను పాక్, చైనాలకు వదిలేద్దామా?

పెరిగిన ఆత్మవిశ్వాసం, వివేకభ్రష్టత్వం

తాలిబాన్ సాధించిన విజయంతో పష్టూన్లలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉండవచ్చు. అలెగ్జాండర్ గ్రేట్, చంగిజ్ ఖాన్ నుంచి మొఘల్ చక్రవర్తులూ, బ్రిటిష్ సామ్రాజ్యపు యోధులూ, సోవియెట్ సేనలూ, అమెరికా సైనికులూ, కాసులూ తమను ఏమీ చేయలేకపోయారనే అహంకారం వారిని సామరస్యం వైపు అడుగు వేయనీయకపోవచ్చు. బయటి శక్తులపైన విజయం సాధించిన మాట వాస్తవమే. కానీ తమ ప్రజల మనసులను గెలుచుకోకుండా, కొత్త ప్రభుత్వంలో వారికి ప్రమేయం, ప్రాతినిధ్యం లేకుండా వారిని ఎప్పటికీ అణచి ఉంచాలని అనుకోవడం ముర్ఖత్వం. కాలం చెల్లిన షరియాను అమలు చేయాలని ప్రయత్నించడం ప్రగతి నిరోధక చర్యగా పరిణమించే ప్రమాదం ఉన్నది. కనీసం చైనా, పాకిస్తాన్ అయినా తాలిబాన్ కు నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించాలి. వ్యూహాత్మక మార్గనిర్దేశనంకోసం పాకిస్తాన్ పైనా, నిధులకోసం చైనాపైనా ఆధారపడే పష్టూన్లకు నచ్చజెప్పి, వారిని దారిలో పెట్టవలసిన బాధ్యత కూడా ఆ దేశాలదే. జనాభాలో సగం ఉన్న మహిళలనూ. పది శాతం దాకా ఉన్న హజారాలనూ ఇంకా వేధిస్తామంటే అక్కడ శాంతిసుస్థిరతలు ఎట్లా నెలకొంటాయి? అప్ఘాన్ ప్రజలు ఆకలి నుంచీ, దారిద్ర్యం నుంచీ ఎప్పుడు బయటపడతారు? నిరంతర సంఘర్షణకు వారు మూల్యం చెల్లిస్తూ ఉండవలసిందేనా?

Also read: చరిత్రలో అఫ్ఘాన్లను ఓడించి నిలిచిన ఏకైక వీరుడు మహారాజా రంజిత్ సింగ్!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles