- ప్రతిఘటన శక్తులు యుద్ధానికి సిద్ధం
- తండ్రిబాటలో నడుస్తాననీ అహ్మద్ మసూద్ ప్రకటన
- మోహరించిన అమ్రుల్లా సాలే, బిస్మిల్లా మొహమ్మదీ
తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి-5
మొన్నటి వరకూ అఫ్ఘాన్ ఉపాధ్యక్షుడిగా ఉండిన అమ్రుల్లా సాలే తాలిబాన్ ఆధిపత్యం నెలకొనడానికి కొన్ని గంటల ముందే (ఆగస్టు 14న) కాబూల్ వదిలి పాంజ్ షీర్ (అయిదు సింహాల నేల) వెళ్ళారు. అక్కడ తన పాత బాస్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసూద్ తో కలిసి చర్చలు జరిపారు. తాను అఫ్ఘానిస్తాన్ కు తాత్కాలిక అధ్యక్షుడినంటూ అమ్రుల్లా సాలే ప్రకటించుకున్నారు. మూడు జిల్లాలు అహ్మద్ మసూద్ నాయకత్వంలో నార్త్ అలయెన్స్ యోధులు ఆక్రమించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాలిబాన్ నాయకత్వం కొంతమంది పోరాటయోధులను పాంజ్ షీర్ పైకి దాడికి పంపించిందని వార్తలు వస్తున్నాయి. వారు పాంజ్ షీర్ సరిహద్దులలోకి వచ్చారని సాలే ఒక ట్వీట్ లో సోమవారం ఉదయం ప్రకటించారు.
Also read: తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?
అహ్మద్, సాలే ప్రతిజ్ఞ
‘‘ప్రతిఘటన శక్తులు (అహ్మద్ నాయకత్వంలోని యోధులు) సలాంగ్ రహదారిని మూసివేశారు. మీరు అడుగుపెట్టగూడని ప్రాంతాలు ఉన్నాయి. చూడండి,’’ అంటూ అదే ట్వీట్ లో తాలిబాన్ ను హెచ్చరించారు. ఉత్తర అఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ ను ప్రతిఘటిస్తున్న యోధులు పాంజ్ షీర్ కు సమీపంలో ఉన్న మూడు జిల్లాలను ఆక్రమించుకున్నారు. పాంజ్ షీర్ లో ప్రతిఘటన దళాలకు మద్దతుగా తాలిబాన్ ను ఎదిరించి పోరాడిన మాజీ ప్రభుత్వానికి చెందిన సైనికులు తమ ఆయుధాలతో సహా వచ్చి చేరారు. పాంజ్ షీర్ లో తాలిబాన్ ను ప్రతిఘటించి తీరుతామని అహ్మద్ మసూద్, అమ్రుల్లా సాలేలు ప్రతిజ్ఞచేశారు. అహ్మద్ తండ్రి అహ్మద్ షా మసూద్ అమెరికా సేనలతో కలిసి 2001లో తాలిబాన్ కు వ్యతిరేకంగా నాలుగు నెలలపాటు పోరాడి వారిని అఫ్ఘానిస్తాన్ నుంచి తరిమివేశారు. తాలిబాన్ పాకిస్తాన్ లో తలదాచుకున్నారు. అక్కడి నుంచి గెరిల్లా యుద్ధం చేసి అమెరికా సైనికులను వేధించి అలసిపోయేట్టు, విసిగిపోయేటట్టు చేశారు. మొన్న తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ను తిరిగి ఆక్రమించుకున్నప్పుడు అహ్మద్ మసూద్ పాకిస్తాన్ వెళ్ళి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నీ, పాకిస్తాన్ సైనికులనూ కలుసుకొని వచ్చారు. కాబూల్ నుంచి అమ్రుల్లా సాలే పాంజ్ షీర్ వెళ్ళారు. 1980లలోనూ, 1990లలోనూ సోవియెట్ సేనలు పాంజ్ షీర్ ను వశపరచుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వారి వశంకాలేదు. సోవియెట్ సేనలు అఫ్ఘానిస్తాన్ విడిచి వెళ్ళడానికి కారకులైనవారిలో అహ్మద్ షా మసౌదీ ముఖ్యుడు. పంజ్ షీర్ లోయలో మాజీ సైనికులూ, ప్రైవేటు యోధులూ కలసి మొత్తం ఆరు వేలమంది దాకా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని ప్రతిఘటన శక్తుల వర్గాలు తెలియజేశాయి. కొన్ని హెలికాప్టర్లూ, కొన్ని సైనిక వాహనాలూ, సోవియెట్ యూనియన్ సైనికులు వదిలివెళ్ళిన వాహనాలూ వాళ్ళ దగ్గర ఉన్నాయి.
Also read: అఫ్ఘానిస్తాన్ పట్ల ఆసక్తి కోల్పోయిన అమెరికా
అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్న ఇస్లామిక్ శక్తులతో శాంతియుత చర్చలు జరుపుదామని తలబోశాననీ, అందుకే పాకిస్తాన్ కు వెళ్ళాననీ, వారు చర్చలకు సిద్ధంగా లేని పక్షంలో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని అహ్మద్ మసూద్ ఆదివారం నాడు అన్నారు.
కాబూల్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాంజ్ షీర్ లో ఇప్పుడు పాత ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కొందరు ఉన్నారు. వారిలో మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మదీ ముఖ్యులు. ‘‘నేను ఎట్టి పరిస్థితులలోనూ తాలిబాన్ కి తలవొగ్గను. నా హీరో అహ్మద్ షా మసూద్ ఆత్మకి, వారసత్వానికీ ద్రోహం చేయను’’ అని అమ్రుల్లా సాలే గత వారం నిర్ద్వంద్వంగా ట్వీటర్ సందేశంలో ప్రకటించారు.
అప్ఘాన్ పోరాట చరిత్రలో పాంజ్ షీర్ ప్రత్యేక స్థానం
అఫ్ఘానిస్తాన్ సైనిక, పోరాట చరిత్రలో పాంజ్ షీర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇది దూరంగా, అందుబాటులో లేకుండా, చొరబాటుకు వీలు లేకుండా ఉంటుంది. పాంజ్ షీర్ నది ద్వారా మాత్రమే ఆ లోయలో ప్రవేశించగలరు. ఆ మార్గాన్ని కాపాడటం, రక్షించుకోవడం అక్కడ అధికారంలో ఉన్నవారికి సాధ్యం. హిందూకుష్ పర్వత శ్రేణుల సానువుల్లో ఉన్న ఈ లోయ తాలిబాన్ కు ఎన్నడూ వశం కాలేదు. 1996లో అధికారంలోకి వచ్చి 2001లో అమెరికా సేనల బాంబులవర్షానికి తట్టుకోలేక పారిపోయేవరకూ వారికి ఈ లోయ స్వాధీనం కాలేదు. అంతకు మునుపు సోవియెట్ యూనియన్ కూడా పాంజ్ షీర్ ను గెలుచుకోలేకపోయింది. ఈ లోయలో 1,50,000 మంది ప్రజలు ఉంటారు. వారిలో తజిక్ తెగవారు ఎక్కువ. తాలిబాన్ పష్టూన్లు. వారికీ, వీరికీ పొసగదు. ఈ లోయలో వజ్రాలు ఉన్నాయి. వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో సోవియెట్ యూనియన్ పైన పోరాటానికి ఆయుధాలు సమకూర్చుకున్నారు.
Also read: మహాసామ్రాజ్యాలను నేలకరిపించిన అఫ్ఘానిస్తాన్
అమెరికాలోని న్యూయర్క్ లో ట్రేడ్ సెంటర్ లోనిరెండు టవర్లపైన 9 సెప్టెంబర్ 2001న విమానాలతో దాడి చేసిన అల్ ఖాయిదా సుమారు మూడు వేలమంది హతులు కావడానికి కారణమైంది. అల్ ఖాయిదా నాయకులు ఒసామా బిన్ లాదెన్ అఫ్ఘానిస్తాన్ లో ఉన్నాడనుకొని అతడిని పట్టి అప్పగించవలసిందిగా తాలిబాన్ ప్రభుత్వాన్ని జూనియర్ బుష్ ప్రభుత్వం కోరింది. తాలిబాన్ అంగీకరించకపోవడంతో అమెరికా, నాటో సైనికుల అఫ్ఘానిస్తాన్ పైన 2001 డిసెంబర్ లో యుద్దం ప్రకటించారు. తాలిబాన్ పైన పోరాటానికి అమెరికా పాంజ్ షీర్ సింహంగా పేరు సంపాదించిన అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని నార్త్ అలయెన్స్ యోధులు తోడ్పడ్డారు. వీరు ఛాందస ఇస్లామిక్ మతతత్వ యోధులు. తాలిబాన్ ను ఓడించి, దేశం నుంచి పంపించివేసిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అహ్మద్ షా మసూద్ మనుషులు భాగస్వాములు. ఆ విధంగా ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా ప్రభుత్వంలో పని చేయడం ఆరంభించిన అమ్రుల్లా సాలే ఉపాధ్యక్ష పదవికి ఎదిగారు. అహ్మద్ షా మసూద్ ని అల్ ఖాయిదా మిలిటెంట్లు 2001లో హత్య చేశారు. ఆ తర్వాత అతడి కుమారుడు అహ్మద్ నార్త్ అలయెన్స్ నాయకత్వం స్వీకరించాడు. ఇప్పుడు అతడి నాయకత్వంలోనే ప్రతిఘటన సాగుతోంది.
అహ్మద్ షా మసౌద్ అసాధ్యుడు
పాంజ్ షీర్ లోయలోనే 1953లొ అహ్మద్ షా జన్మించారు. మసూద్ అనే బిరుదాన్ని 1979లో తగిలించుకున్నాడు. మసూద్ అంటే అదృష్టవంతుడు, లబ్ధిదారుడు అని అర్థం. కాబూల్ లోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్నీ, సోవియెట్ యూనియన్ నూ ఎదిరించి పోరాడారు. అఫ్ఘానిస్తాన్ ముజాహిదీన్ నాయకులలో అగ్రగణ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
సోవియెట్ యూనియన్ 1989లో అఫ్ఘానిస్తాన్ నుంచి ఉపసంహరించుకున్న మీదట అక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది. తాలిబాన్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ పాంజ్ షీర్ లోయనూ, ఉత్తర అఫ్ఘానిస్తాన్ లోని పెక్కు ప్రాంతాలనూ, చైనా, తజికిస్తాన్ సరిహద్దుల వరకూ గల ప్రాంతాన్నీ అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని ముజాహిదీన్ లేదా నార్దర్న్ అలయెన్స్ యోధులు ఆక్రమించుకున్నారు.
తాలిబాన్ కూ, మసౌద్ కీ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమంటే మహిళలకు పురుషులతో పాటు సమానావకాశాలు ఉండాలని అహ్మద్ షా మసూద్ విశ్వాసం. మహిళలు పర్దాలోనే ఉండాలని తాలిబాన్ నమ్మకం. ఇస్లామిక్ మతఛాందసుడైనప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మించడానకి అమ్మద్ షా ప్రయత్నించారు. కానీ కాబూల్ కోసం జరిగిన అంతర్యుద్ధంలో మానవహక్కులను అహ్మద్ షా ఉల్లంఘించారంటూ మానవహక్కుల సంస్థలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి.
అహ్మద్ షా మసూద్ హత్య జరిగిన తర్వాత ఈ గ్రూపు అతడి కుమారుడు అహ్మద్ మసూద్ నాయకత్వంలో పని చేస్తోంది. తాలిబాన్ ను ప్రతిఘటించేందుకు ఆయుధాలు సరఫరా చేయవలసిందిగా అమెరికాను అహ్మద్ కోరాడు. బుధవారంనాడు ‘వాషింగ్లన్ పోస్ట్’ ఓపెడ్ పేజీలో అహ్మద్ మసూద్ పేరు మీద ఒక వ్యాసం ప్రచురించింది. ‘‘ప్రతిఘటన శక్తులను ప్రోత్సహించడం ద్వారా అమెరికా ఇప్పటికీ ప్రజాస్వామ్య ఆయుధాగారం కాగలదు’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు పాంచ్ షీర్ లోయ నుంచి ఈ వ్యాసం రాస్తున్నాను. నేను నా తండ్రి బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. తాలిబాన్ తో మరోసారి తలబడటానికి ముజాహిదీన్ సిద్ధంగా ఉన్నారు,’’ అని అహ్మద్ రాశారు. తాలిబాన్ కు తమ కామ్రేడ్స్ లొంగిపోయిన పద్ధతికి సిగ్గుపడుతూ అఫ్ఘానిస్తాన్ ప్రత్యేక దళాలకు చెందిన యోధులూ, ఇతర యోధులూ తమ వద్దకు వచ్చారనీ, వారు తాలిబాన్ తో పోరాటానికి సిద్ధంగా ఉన్నారనీ తెలిపారు. అఫ్ఘానిస్తాన్ మొత్తం తాలిబాన్ చేతులలో లేదని రష్యా విదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు.
తాలిబాన్ కీ, ప్రతిఘటన శక్తులకీ మధ్య యుద్ధం జరుగుతుందా? ఒక మూలగా ఉండే పాజ్ షీర్ కోసం తాలిబాన్ ఇప్పుడే పట్టుపట్టకపోవచ్చు. చూసీచూడనట్టు ఉపేక్షించవచ్చు. తమ అధీనంలో లేని ప్రాంతాల కోసం వారు బలప్రదర్శన చేయకపోవచ్చు. ఇది ఒక అంచనా. ఒక వేళ ఈ ప్రతిఘటన సంగతి తేల్చివేయాలని తాలిబాన్ సంకల్పిస్తే మాత్రం అహ్మద్ నేతృత్వంలోని సాయుధులను ఓడించడం కష్టం కాదు. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇది మరో అంచనా. ఏది ఏమైనా అఫ్ఘానిస్తాన్ లో పోరాటం ముగియలేదు.
Also read: అఫ్ఘానిస్తాన్ పాతికేళ్ళ కిందట తాలిబాన్ వశం అయింది ఈ విధంగా…..
Good
Informative article