Tuesday, January 21, 2025

భారత్ మెడకు తాలిబాన్ ఉచ్చు

‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్న చందంగా, ఆఫ్ఘనిస్థాన్ లో పరిణామాలు భారత్ కు భారీ తలనొప్పులు తెచ్చేట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం మరింతగా పేట్రేగిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు చేసే వ్యాఖ్యలు భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ కు పెనుప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘాన్ లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు కూడా ఈ రోజుతో వెనుతిరిగి వెళ్లిపోయాయి. దీనితో అక్కడ ఉన్న విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. బలగాల ఉపసంహరణ చేయాలనే ఆలోచన అమెరికాకు ఎప్పటి నుంచో ఉంది. జో బైడెన్ అధ్యక్షుడుగా అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. కొన్నాళ్ల క్రితమే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి ఈ క్రతువు ముగిసింది.

Also read: కశ్మీర్ లో కింకర్తవ్యం?

తాలిబాన్ కు తిరిగి అధికారం

ఉగ్రసంస్థ అల్ ఖైదాను అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్ లో రెండు దశాబ్దాల పాటు భీకరంగా యుద్ధం చేశాయి. లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అన్ని వర్గాల నుంచి కొన్నివేలమంది ప్రాణాలు కోల్పోయారు. 2001 వరకూ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఏలుబడిలోనే ఉంది. అధికారాన్ని కోల్పోయినా, వారు పోరు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అధిక భూభాగం వారిచేతిలోనే ఉంది. రేపోమాపో ఆ దేశం మళ్ళీ వాళ్ళ చేతిల్లోకే వెళ్లిపోతుంది. అప్పటి నుంచి భారత్ వంటి కొన్ని దేశాలకు ఉగ్రవాదుల దాడుల ముప్పు పెరుగుతుందనే పరిశీలకుల అభిప్రాయాలను కొట్టివేయలేం. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 29 వ తేదీన అమెరికా – తాలిబాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు ఆఫ్ఘాన్ నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపాసంహరించుకోవాలి. అనుకున్న గడువుకు రెండు నెలల ఆలస్యమైనా  ఆ తంతు ముగిసింది. ఇక మన వంతు ఆరంభమైంది. ఎప్పుడైతే  బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందో  అప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో విధ్వంసం ఆకాశాన్ని తాకింది. ఆ దేశ సైనికుల బలహీనతలను అడ్డుపెట్టుకొని తాలిబాన్ విజృంభించడం మొదలుపెట్టారు. గతంలో తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమకిందకు తెచ్చుకోవడం ఆరంభించారు. ఇప్పటికే అందులో చాలావరకూ విజయం సాధించారు. ఆఫ్ఘాన్ నుంచి ఆమెరికా, నాటో బలగాలు వెనక్కి వెళ్లిపోవడం వల్ల భారత్ లో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకుంటాయని అమెరికాకు కూడా తెలుసు. భారత్ కు ముప్పు తప్పదని ఆమెరికాకు చెందిన లిసా కర్టెన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకు ఈమె సహాయకరాలుగా పనిచేశారు. ప్రపంచంలోని ఉగ్రవాదులెందరికో ఆశ్రయం కల్పించి, శిక్షణ ఇచ్చింది ఎవరో కాదు, తాలిబాన్ అన్న విషయం చరిత్రలో లోకవిదితమే. ఉగ్రవాదులకు సకల సౌకార్యాలు ఇవ్వడమే కాక, నిధులను సమకూర్చింది తాలిబాన్ అని అమెరికా నేతలు సైతం అనేకసార్లు వ్యాఖ్యానించారు.

Also read: కశ్మీర్ మంచు కరిగేనా?

అమెరికాకు స్వార్థమే పరమార్థం

ఇవ్వన్నీ తెలిసి కూడా బలగాలను ఉపాసంహరించుకోవడంలో అమెరికాకు స్వార్ధమే పరమావధి. మొదటి నుంచీ అదే విధానం అమలుచేస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘాన్ లో రష్యా ఆధిపత్యాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ ద్వారా కావాల్సినవారికి కావాల్సినంత సాయం అందించింది అమెరికా. తాలిబాన్ బలపడంలో పాకిస్తాన్ పాత్ర ఎంత ఉందో, అమెరికా పాత్ర కూడా అంతే ఉంది. తర్వాత మారిన పరిణామాల్లో అల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ ను ఖతం చేయడం లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్ లో సైనిక బలగాలను దించింది. రకరకాల మార్గాల్లో ఛేదించింది. తుదకు 2 మే 2011 వ తేదీన పాకిస్తాన్ లో సంహరించింది. దానితోనే అమెరికా ప్రధానమైన లక్ష్యం నెరవేరింది. బిన్ లాడెన్ ను మట్టుపెట్టడంలోనూ పాకిస్తాన్ వారి హస్తాలను అమెరికా బాగా వాడుకుందనే వినికిడి. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి 25 మిలియన్ల డాలర్లు తీసుకొని, బిన్ లాడెన్ కదలికలపై అమెరికాకు ఉప్పందించారని ఆ మధ్య వార్తల్లో వినిపించింది. అమెరికాపై అల్ ఖైదా 2001 సెప్టెంబర్ లో చేసిన భీకరదాడి 9/11 గా ప్రసిద్ధి. ఈ దాడిలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఆ విధ్వంసం చరిత్ర విదితం. ఈ ఘోరకలికి సర్వం తానేయై వ్యవహరించిన ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేయడానికి, అల్ ఖైదాను అణచివేయడానికి అమెరికా సంకల్పం చేసుకుంది. ఈ క్రమంలో బిన్ లాడెన్ అంతం మినహా, అల్ ఖైదా సమూహంగా అంతమవ్వలేదనే పరిశీలకులు చెబుతున్నారు. వీరి వల్ల అమెరికాకు ఏదో రోజు మళ్ళీ ముప్పు తప్పదనే వారి అభిప్రాయం.

Also read: ఆచరణలో చూపించాలి ఆదర్శాలు

భారత్ కు ముప్పు

అత్యంత శక్తివంతమైన అమెరికా విషయం అట్లుంచుదాం.  ఆమెరికా బలగాల ఉపసంహరణ నేటి పరిణామంలో  అత్యంత అప్రమత్తంగా, చురుకుగా ఉండాల్సిందే మనమే. జమ్మూలో ఇటీవల జరిగిన డ్రోన్ల దాడుల సందర్భంలోనూ తాలిబాన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. భారత్ పై శత్రుత్వం విషయంలో ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఏకమయ్యాయి.ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ కూడా జత కలుస్తారు. భారత్ కు మద్దతు ఇస్తున్నట్లుగా అమెరికా కనిపించినప్పటికీ  పాకిస్తాన్ తోనూ ఆ దేశానికి అవసరాలు ఉన్నాయి. చైనాతో ఉన్న శత్రుత్వం ఇక్కడ సంబంధం లేదు. అందుకే, కశ్మీర్ అంశంలో అమెరికా భారత్ పై ఒత్తిడి తెస్తోంది. రష్యాను కూడా చైనా బాగా దగ్గరకు తెచ్చుకుంటోంది. ఈ పరిణామాలన్నీ భారత్ కు మంచిచేయవు. ఈ మొత్తం అధ్యాయంలో  ఇస్లామిక్ ఉగ్రవాదం బాగా పెరిగితే నష్టపోయేది భారత్ ఒక్కటే కాదు. అమెరికా, ఐరోపా దేశాలన్నింటికీ నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా  రాజీపడితే చాలా దేశాలు  భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ ద్వారా తాలిబిన్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చనే వ్యూహాలు అమెరికాకు ఉన్నప్పటికీ, ఉగ్రవాదం ఊపందుకుంటే, అవేమీ అక్కరకు రావనే సూక్ష్మాన్ని అమెరికా గ్రహించాలి. భావసారూప్యత కలిగిన దేశాలన్నీ కలసివచ్చి, ఉగ్రవాద అంతానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టాలి. ఆఫ్ఘాన్ పై భారత్ వేయికళ్ళు వేసి ఉంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత కీలకం.

Also read: చైనా వక్రదృష్టి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles