Sunday, January 26, 2025

ఆఫ్ఘానిస్థాన్ లో మళ్ళీ తాలిబాన్ పాలనకు రంగం సిద్ధం!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ విజృంభణ ఊహించిందే. ఎనభై శాతానికి పైగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తమ హస్తగతమైనదని తాలిబాన్ నాయకులు శుక్రవారంనాడు ప్రకటించారు. బగరామ్ వైమానిక స్థావరాన్ని ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించి అమెరికా సేనలు ఇంటిదారి పట్టింది గత శుక్రవారమే. వారం రోజుల్లో తాలిబాన్ విజయపరంపర సాగించింది.  అమెరికా, నాటో సైనికులు నిష్క్రమణ ఇంకా పూర్తి కాకమునుపే తాలిబాన్ యోధులు చొచ్చుకొచ్చారు. అర్ధశతాబ్దంగా విదేశీ సైనిక జోక్యంతో, ఉగ్రవాద మూకల ఆక్రమణతో, మితిమీరిన ఛాందసవాద పాలనతో, విపరీతమైన జననష్టంతో సతమతం అవుతున్న ఆఫ్ఘనిస్థాన్ మరోసారి చరిత్ర కూడలిలో ఒంటరిగా, భయంభయంగా నిలబడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు గత ఇరవై సంవత్సరాలుగా అనుభవించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలూ, ఆధునిక జీవన విధానాలకు స్వస్తి చెప్పవలసి వస్తుందనే భయంతో వణికిపోతున్నారు. తాలిబాన్ పరిపాలనలో తిరిగి ఛాందసవాద ఇస్లామిక్ పద్ధతులు అమలులోకి వస్తాయేమోనని భయపడుతున్నారు. మహిళలు తిరిగి బుర్ఖాలు ధరించి మగవారికి అణుకువగా నడుచుకోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నారు. ఆఫ్ఘాన్ ప్రజలే కాదు ఇరుగుపొరుగు దేశాలు కూడా భయంతో తల్లడిల్లిపోతున్నాయి. తాలిబాన్ ల ప్రతాపానికి బెదిరి దేశం వదిలి వచ్చే శరణార్థులను పోషించడం ఎట్లా అనే బెంగ పట్టుకుంది పాకిస్తాన్ వంటి పొరుగుదేశాన్నిపట్టిపీడిస్తున్నది. ఇప్పటికే వేలమంది ఆఫ్ఘాన్ సైనికులు దేశం విడిచి తజికిస్తాన్ లోకి పలాయనం చిత్తగించారు. రోజులు గడిచినకొద్దీ దేశం వదిలి పొరుగుదేశాలలో తలలు దాచుకునేవారి సంఖ్య పెరుగుతుంది.  

న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ లోని రెండు పెక్కంతస్తుల భవనాలపైన ఆల్ ఖాయిదా విమానాలతో 11 సెప్టెంబర్ 2001నాడు దాడి చేసి వేలమందిని చంపిన దరిమిలా నాటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ (జూ) ఆఫ్ఘానిస్తాన్ పైకి అమెరికా సేనలను పంపించారు. వాటితో పాటు నాటో సేనలు కూడా బయలుదేరాయి. అప్పుడు అమెరికా, నాటో సేనలు ఇరవై ఏళ్ళపాటు ఆఫ్ఘానిస్థాన్ లో ఇరక్కొని పోతాయని ఎవరూహించారు? ఏ తాలిబాన్ ప్రభుత్వాన్ని దించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో  అదే తాలిబాన్ తో చర్చలు జరిపి రాజీ చేసుకొని బతుకు జీవుడా అంటూ అమెరికాకూ, యూరప్ కూ అమెరికా, నాటో సేనలు తిరిగి వెళ్ళడం కూడా అనూహ్యమైన ఘటనే. అంతకు ముందు సోవియెట్ యూనియన్ ఆప్ఘానిస్థాన్ ను ఆక్రమించుకున్నప్పుడు పాకిస్తాన్ సహాయంతో ఈ తాలిబాన్ ను తయారు చేసి, సాధన సంపత్తినీ, ఆయుధాలనూ అందజేసి, సోవియెట్లను ఓడించి వెనక్కు పంపడంలో అమెరికా కీలకమైన పాత్ర పోషించింది. మూడు దశాబ్దాల కిందట సోవియెట్ యూనియన్ కు ఏ గతి పట్టిందో ఇప్పుడు అమెరికాకు కూడా అదే గతి పట్టింది.

ఖరీదైన గుణపాఠాలు

సోవియెట్ యూనియన్ కంటే అమెరికా నేర్చుకున్న గుణపాఠం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. 980 బిలియన్ డాలర్ల ఖర్చు, 2,400 మంది అమెరికా సైనికులూ, మరో 1,144 మంది మిత్రదేశాలకు చెందిన సైనికుల ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు 388 మంది ప్రైవేటు మిలిటరీ కంట్రాక్టర్లు కూడా అసువులు బాశారు. ఆఫ్ఘానిస్థాన్  పునర్నిర్మాణం కోసం 143 బిలియన్ డాలర్లూ, ఆఫ్ఘన్ సైన్యం ఆధునికీకరణకోసం 90 బిలియన్ డాలర్లూ, పరిపాలన కోసం, ఆర్థికాభివృద్ధికోసం 36 బిలియన్ డాలర్లూ అమెరికా ఖర్చు చేయవలసి వచ్చింది. ఆఫ్ఘాన్ ప్రజలు చెల్లించుకున్న మూల్యం అమెరికా, దాని మిత్ర దేశాలు చెల్లించిన మూల్యం కంటే చాలా ఎక్కువ. ఇరవై సంవత్సరాలలో 50 వేలమంది ఆఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కడచిన ఏడు సంవత్సరాలలోనే 70 వేలమంది ఆఫ్ఘాన్ భద్రతాదళాలకు చెందిన సైనికులు చనిపోయారు. వీరికి తోడు 60 వేలమంది ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రాణాలు కోల్పోయారు.

సైనికంగా, ఆర్థికంగా నష్టబోయినప్పటికీ సాంఘికంగా, ఆరోగ్యపరంగా, సాంస్కృతికంగా అమెరికా, దాని మిత్రదేశాల వల్ల ఆఫ్ఘానిస్థాన్ కు కలిగిన లాభాలు సైతం లేకపోలేదు. 2001లో, అంటే అమెరికా సేనలు వచ్చినప్పుడు, ఆఫ్ఘానిస్థాన్ లో తొమ్మిది లక్షలమంది మగపిల్లలు పాఠశాలకు వెళ్ళేవారు. ఈ రోజున ఎనభై లక్షల మంది విద్యార్థులు స్కూళ్ళకు వెడుతున్నారు. వీరిలో మూడింట ఒక వంతు మంది విద్యార్థినులు. అక్షరాస్యత 2002 లో 12 శాతం ఉంటే ఇప్పుడు 35 శాతం ఉంది. ఆయుర్దాయం 40 ఏళ్ళ నుంచి 63 ఏళ్ళకు పెరిగింది. శిశు మరణాల రేటు 20 శాతం నుంచి పది శాతానికి తగ్గిపోయింది. అమెరికా సైన్యం దిగిన తర్వాత పది వేల మైళ్ళ పొడవునా తారు రోడ్లు వేశారు. గత రెండు దశాబ్దాలలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి తాలిబాన్ అనే మూర్ఖమానవులు తిరిగి అధికారంలోకి వస్తే ఏమి అవుతుందోనని బెంగ. విద్యార్థినులను స్కూళ్ళలో కొనసాగనిస్తారా అన్నది అనుమానం. ఆఫ్ఘాన్ మహిళలు బాగా నష్టబోతారు.  

కార్జాయ్ సలహా

ఎప్పుడైతే అమెరికా సేనలూ, మిత్రదేశాల సేనలూ తాలిబాన్ పైన పోరాటాన్ని 2014లో నిలిపివేసి కేవలం చొచ్చుకొచ్చిన తిరుగుబాటుదారులపైనే పోరాడటం ప్రారంభించారో అప్పుడే నాటి దేశాధిపతి హమీద్ కార్జాయ్ కి అనుమానం వచ్చింది. వియత్నాం యుద్ధం నుంచి తప్పుకునే ముందు అమెరికా సేనలలో కనిపించిన నైరాస్యం, ఏకాగ్రతలేమి, విసుగుదల, అశాంతి ఆఫ్ఘానిస్థాన్ లోని అమెరికా, దాని మిత్రదేశాల సైనికులలో కొట్టొచ్చినట్టు కనిపించాయి. మొత్తం దేశాన్ని రక్షిస్తూ తాలిబాన్ పీడ విరగడ అయ్యేవరకూ పోరాడటమో లేక తాలిబాన్ తో రాజీ కుదుర్చుకోవడమో తేల్చుకోవడం ఉత్తమమని కార్జాయ్ అమెరికాకు స్పష్టం చేశారు. ప్రపంచ ఉగ్రవాదానికి రక్షణ కల్పించే కేంద్రంగా ఆఫ్ఘానిస్థాన్ కాకుండా కాపాడాలన్న బుష్ లక్ష్యాన్ని బరాక్ ఒబామా నీరు కార్చారు. ఇస్లామాబాద్ దగ్గర రహస్యజీవితం గడుపుతున్న ఒసామా బిన్ లాదెన్ ను 2011లో అమెరికా కమాండోలు ఒబామా, హిల్లరీలు చూస్తుండగా మట్టుపెట్టాయి. పాకిస్థాన్ జనరల్ ఒకరు లంచం తీసుకొని ఒసామా గుట్టు ను ఒబామాకు చెప్పాడు. లాదెన్ ను సంహరించడంతో ఒక లక్ష్యం నెరవేరిందనే భావన అమెరికా పాలకవర్గంలో కనిపించింది. ఇంకా ప్రాణనష్టం లేకుండా, తాలిబాన్ తో రాజీ కుదుర్చుకొని బయటపడటం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. తాలిబాన్ తో ఘర్షణకు స్వస్తి చెప్పారు. తాలిబాన్ 2013లోనే దోహాలో ఒక కార్యాలయాన్ని నెలకొల్పింది.

అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగా ఒబామా కంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన డొనాల్డ్ ట్రంప్ నేరుగా తాలిబాన్ తోనే చర్చలు ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరఫున ఆఫ్ఘానిస్థాన్ విషయంలో సమాధానపడటం (రీకన్సీలియేషన్) అనే ప్రక్రియలో ప్రతినిధిగా జల్మే ఖలీల్జాద్ నాలుగు సూత్రాలపైన దృష్టి సారించాడు. ఒకటి, తాలిబాన్ అల్ ఖాయిదాతో, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలి. రెండు, ఆఫ్ఘానిస్థాన్ లో శాంతి స్థాపన కోసం ఆఫ్ఘాన్ ప్రభుత్వంతో తాలిబాన్ చర్చలు జరపాలి. మూడు, విదేశీ సైనికులు అందరూ నిష్క్రమించాలి. నాలుగు, అన్ని షరతులూ అమలు జరిగే వరకూ ఒప్పందానికి విలువ లేనట్టేనని అంగీకరించాలి. అమలు చేస్తే అన్నీ అమలు చేయాలి లేకపోతే ఏదీ లేదు. చివరికి తాలిబాన్ పంతమే నెగ్గింది. ఏదో ఒక విధంగా ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆత్రుతతో ఉన్న అమెరికా సైనికులూ, మిత్రదేశాల సైనికులూ అన్ని షరతులూ, వారిపైన ఉన్న అధికారులూ సూత్రాలు అమలు జరిగే వరకూ వేచి ఉండే ఓపిక ప్రదర్శించలేదు. ఈ సంగతి తెలుసుకున్న తాలిబాన్ అమెరికా ఎట్లాగైనా లొగివస్తుందని ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే ఇతర షరతులు అమలు జరగకపోయినా సైన్యం నిష్క్రమించేందుకు తేదీలను ప్రకటించేశారు. ఆఫ్ఘానిస్థాన్ లో బందీలుగా  ఉన్న ఐదు వేలమంది తాలిబాన్ ను విడుదల చేయవలసిందిగా అమెరికా చేత ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి తాలిబాన్ నాయకులు చెప్పించారు.

మారిన అమెరికా ప్రజాభిప్రాయం

అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారింది. 2001 సెప్టెంబర్ లో అల్ ఖాయిదా మీద ఉన్న ఆగ్రహం ఇప్పుడు లేదు. సైనికుల మరణం అమెరికా సమాజాన్ని కలచివేసింది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సైతం ఆఫ్ఘానిస్థాన్ నుంచి నిష్క్రమిస్తామనే రిపబ్లికన్లూ,డెమాక్రాట్లూ వాగ్దానం చేశారు. అమెరికాలో ప్రజాభిప్రాయం మారిపోతోందనీ, సాధ్యమైనంత వేగంగా ఇంటికి సైనికులను పిలిపించుకోవాలనీ, ఇక ఏ మాత్రం ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలనీ అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు తాలిబాన్ గ్రహించారు. తాలిబ్ అంటే విద్యార్థి. తాలిబాన్ అంటే విద్యార్థులు. ఆఫ్ఘానిస్థాన్ విద్యార్థులకు పాకిస్తాన్ లో సైనిక శిక్షణ నెరపి, ఆయుధాలు ఇచ్చి, వారిని సోవియెట్ సైన్యంపైన ప్రయోగించడంలో మూడు దశాబ్దాల కిందట అమెరికా కీలకమైన భూమిక పోషించింది. అందుకు గత ఇరవై సంవత్సరాలుగా మూల్యం చెల్లించింది. ‘‘ఈ రోజున ఆఫ్ఘానిస్థాన్ భధ్రత, ఐకమత్యం, సమగ్రత అన్నీ ప్రశ్నార్థకంగా మారాయన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం’’ అంటూ జాతీయ సమాధాన మండలి అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా జూన్ 30న వ్యాఖ్యానించారు. అమెరికా సేనల ఉపసంహరణకు పూర్వం ఆఫ్ఘానిస్థాన్ భూభాగంలో అయిదింట ఒక వంతు మాత్రమే తాలిబాన్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు మూడింట రెండు వంతుల దాకా తాలిబాన్ హస్తగతమైనట్టు తాజా సమాచారం సూచిస్తోంది.

తాలిబాన్ వ్యూహం ప్రధానంగా జిల్లాలను వశపరచుకోవడం. గత వారానికి తాలిబాన్ చేతిలో 400లకు పైగా జిల్లాలు ఉన్నాయి. చైనా-ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని వఖాన్ కారిడార్, ఆఫ్ఘానిస్థాన్-తిజికిస్థాన్ సరిహద్దు తాలిబాన్ చేతుల్లో ఉన్నాయి. తూర్పు, ఈశాన్య జిల్లాలపైన తాలిబాన్ పెత్తనం దఖలు పడింది. కందహార్ రాష్ట్రంలో అత్యధిక భాగం తాలిబాన్ చేతుల్లోనే ఉంది. ఇరాన్ సరిహద్దు వరకూ తాలిబాన్ ఆధిపత్యం నెలకొన్నది.

ఇంత జరిగినా తాలిబాన్ భావజాలం పూర్వంలాగానే ఉన్నదా, మారిందా అన్నది స్పష్టంగా తెలియదు. అమెరికా, పాకిస్తాన్ లు తాలిబాన్ భావజాలం మార్చడానికి ప్రయత్నించినట్టు కనిపించాయి. పాకిస్తాన్ ఈ విషయంలో ఎంతవరకూ నిజాయితీగా ఉన్నదనేది ప్రశ్న. తాలిబాన్ ను మార్చుతున్నామని అమెరికాకు చెబుతూనే తాలిబాన్ ను పాత పద్దతిలోనే ఉంచి, ఇండియాపైన ప్రయోగించాలనే దుష్టబుద్ధి పాకిస్తాన్ కు ఉన్నా ఆశ్చర్యంలేదు. రెండో ముఖ్యమైన ప్రశ్న ఏమంటే ప్రస్తుతం కాబూల్ లో అధికారంలో ఉన్న నాయకుల మధ్య సయోధ్య కుదురుతుందా? వాళ్ళు ఇంతవరకూ పరస్పరం విమర్శించుకుంటూ, ద్వేషించుకుంటూనే ఉన్నారు. అమెరికా సేనలు ఉన్నప్పుడే వారు ఐకమత్యంగా లేకపోతే అమెరికా నిష్క్రమణ తర్వాత ఐక్యంగా ఎందుకుంటారు? అనైక్యత అన్నది ఆఫ్ఘానిస్థాన్ నాయకుల జన్మలక్షణం. ఇప్పుడున్న నాయకులలో ఎవరైనా తాలిబాన్ తో బేరం పెట్టుకొని షరీకై  ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిస్తే ప్రభుత్వ పతనం ఊహించినదానికంటే త్వరగానే సంభవిస్తుంది.

సీంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబాన్ అంగీకరిస్తారా?

తాలిబాన్ మిగిలిన రాజకీయ పార్టీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తుందా లేక తన ఆధిపత్యమే ఉండాలని కోరుకుంటుందా? ఆఫ్ఘానిస్థాన్ లో జితులూ, విజేతలే ఉంటారు కానీ మధ్యేమార్గం ఉండదు. రాజీ అనేది ఆఫ్ఘానిస్థాన్ రక్తానికి సరిపడని విషయం. అమెరికా రాజీ పడుతుంది. రష్యా రాజీపడుతుంది. పాకిస్తాన్ సైతం రాజీపడుతుంది. కానీ ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన తాలిబాన్ రాజీపడరన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఎంత ప్రాణనష్టమైనా భరిస్తారు. కానీ రాజీకి ససేమిరా అంటారు.  సైనికంగా అప్ఘాన్ భూభాగంలో అత్యధిక భాగం హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబాన్ వైఖరి మారిపోవడం ఖాయం. అదే జరిగితే అందరికంటే ముందు నష్టబోయేది ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు. తర్వాత నష్టబోయేది పాకిస్తాన్. తాలిబాన్ భావజాలం మారకుండా, సంకీర్ణం జాన్తా నై అని చెప్పి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారం చెలాయించడం ప్రారంభించినట్లయితే పాకిస్థాన్ కు ముప్పు తప్పదు. పాకిస్తాన్ యువకులలో అధిక సంఖ్యాకులు తాలిబాన్ మార్గం పట్టవచ్చు. సాయుధ పోరాటంలో పాకిస్తాన్ యువకులకు తాలిబాన్ శిక్షణ ఇవ్వవచ్చు.అదే జరిగితే బుష్ ఏమి జరగనీయకూడదని సంకల్పం చెప్పుకున్నాడో దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. తాలిబాన్ కు అధికారం అప్పజెప్పి ప్రమాదం కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. దూరంగా ఉన్న అమెరికాకు కానీ, ఐరోపా దేశాలకు కానీ నష్టం లేదు. పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉనికికి ప్రమాదం. దాని తర్వాత ఇండియాకూ తాలిబాన్ రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే భారత ప్రభత్వ ప్రతినిధులు కూడా తాలిబాన్ తో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను భారత విదేశాంగ వర్గాలు ఖండించినప్పటికీ తాలిబాన్ తో చర్చలు జరిగే ఉంటాయనీ, ఆ చర్చల వెనుక అమెరికా అధ్యక్షుడు బైడెన్ హస్తం ఉంటుందనీ అంటున్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles