Thursday, November 21, 2024

అఫ్ఘాన్ ప్రధానిగా రాజీ అభ్యర్థి హసన్ అఖుండ్

  • అమెరికా పూర్తిగా నిష్క్రమించిన వారం రోజుల తర్వాత మంత్రిమండలి ఏర్పాటు
  • అమెరికా ఉగ్రవాదుల జాబితాలోని సిరాజుద్దీన్ హకానీకి దేశీయాంగ శాఖ
  • ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలోనే అఖుండ్ ప్రధాని

అఫ్ఘానిస్తాన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత మూడు వారాలకు తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అది కూడా తాత్కాలికమే. వివిధ వర్గాల మధ్యా, తెగల మధ్యా సమన్వయం సాధించేందుకు చర్చోపచర్చలు జరిపి తిరిగి అంతగా ప్రముఖుడు కాని వ్యక్తిని తాత్కాలిక ప్రధానిగా ప్రకటించారు. ఆగస్టు 31న చివరి అమెరికా సైనికుడు అఫ్ఘానిస్తాన్ వీడి వెళ్ళిన తర్వాత ఏడు రోజులకు మంత్రిమండలి కూర్పును తాలిబాన్ ప్రకటించారు.

తాలిబాన్ వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్ సహచరుడు ముల్లా హసన్ అఖుండ్ కొత్త ప్రభుత్వంలో తాత్కాలిక ప్రధానిగా ఫని చేస్తారు. అతని కంటే శక్తిమంతుడుగా పేరున్న ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఉపప్రధానిగా ఉంటారు. మరో ఉపప్రధాని అబ్దుల్ సలామ్ హనీఫ్. విదేశాంగమంత్రిగా ఆమిర్ ఖాన్ ముట్టకీ నియుక్తులైనారు. తాత్కాలిక ఆర్థికమంత్రిగా హెదయతుల్లా బాద్రీ పని చేస్తారు. ఆర్థికమంత్రిగా దీన్ మొహమ్మద్, కేంద్ర బ్యాంక్ గవర్నర్ గా మొహమ్మద్ ఎద్రిస్ నియుక్తులైనారు. అన్నిటి కంటే ప్రధానంగా హకానీ నెట్ వర్క్ వ్యవస్థాపకుడి కుమారుడు సిరాజుద్దీన్ హకానీ దేశీయాంగమంత్రిగా ఉంటారు. ఇతని నెత్తిమీద 50 లక్షల అమెరికా డాలర్ల రివార్డు ఉంది. హకానీ నెట్ నాటి అధ్యక్షుడు హమీద్  కార్జాయ్ పైన 2008లో హత్యాయత్నం చేసింది.  2001లో ఒసామా బిన్ లాదెన్ ను అమెరికాకు అప్పగించడానికి నిరాకరించిన సుప్రీం లీడర్ ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు మొహమ్మద్ యాకూబ్ రక్షణమంత్రి.  మొత్తంమీద పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధిపతి హమీద్ చెప్పినట్టే జరిగింది. అంతగా ప్రాముఖ్యం లేని అఖుండ్ ను ప్రధానిగా పెట్టుకోమని చెప్పింది హమీద్. హకానీకి దేశీయాంగ శాఖ అప్పగించాలని చెప్పింది కూడా పాకిస్తాన్ నిఘా సంస్థ అధిపతే కావడం విశేషం.

అందరినీ కలుపుకొని అందరికీ చెందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తాలిబాన్ ప్రతినిధులు చెప్పినప్పటికీ మంగళవారం సాయంత్రం ప్రకటించిన మంత్రిమండలిలో తాలిబాన్ కాని నాయకుడు ఒక్కడూ లేకపోవడం గమనార్హం. అన్ని నియామకాలు తాత్కాలికమేనని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలియజేశారు. ఎంతకాలం ఈ మంత్రిమండలి సభ్యులు కొనసాగుతారో, ఎప్పుడు ఎందుకు మార్పులు చేపడతారో ముజాహిద్ వెల్లడించలేదు. ఎన్నికల ప్రస్తావన లేనే లేదు. తాలిబాన్ కాబూల్ ప్రవేశించిన తర్వాత వారితో చర్చలు జరిపిన మాజీ అధ్యక్షుడు కార్జాయ్ కానీ మాజీ విదేశాంగమంత్రి అబ్దుల్లా అబ్దుల్లా కానీ నియుక్తులు కాలేదు. తాలిబాన్ ను వ్యతిరేకించిన నార్దర్న్ అలయెన్స్ ప్రతినిధులకు కానీ ఇతర ముఠాలకు చెందిన ప్రతినిధులకు కానీ మంత్రిమండలిలో స్థానం కల్పించలేదు.

తాలిబాన్ అధినేత ముల్లా హైబతుల్లా అఖుండ్ జాదా మున్ముందు ఎటువంటి పాత్ర పోషిస్తారో స్పష్టత లేదు. ఆయనను దేశానికి మతనాయకుడిగా ప్రకటిస్తారని ఊహాగానాలు సాగాయి. 2016లో తాలాబాన్ అధినేతగా పదవీ స్వీకారం చేసిన అఖుండ్ జాదా  కొన్ని సంవత్సరాలుగా  బయట ఎవ్వరికీ కనిపించలేదు. వినిపించలేదు. ఆయన కందహార్ లో నివసిస్తున్నారనీ, సముచితమైన సందర్భంలో ఆయన ప్రజలకు కనిపిస్తారనీ తాలిబాన్ ప్రతినిధి ఒకరు అన్నారు. తాలిబాన్ వ్యవస్థాపకులలో ఒకరైన బరాదర్ ప్రధాని పదవి చేపడతారని మొదట్లో ఊహాగానాలు సాగాయి. దోహా చర్చలలో అతడే ప్రధానంగా ఉండేవారు. ట్రంప్ ప్రభుత్వంతో 2020 ఒప్పందంపైన సంతకం చేసింది కూడా ఆయనే. తాలిబాన్ రాజకీయ కార్యాలయానికి అధిపతిగా కూడా ఆయన పనిచేశారు.

శుక్రవారంనాడు బరాదర్ వర్గానికీ, హకానీ వర్గానికీ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బరాదర్ గాయపడినట్టు కూడా వార్తలు వచ్చాయి. దాని పర్యవసానంగానే ఐఎస్ఐ అధినేత ఫాయిజ్ హమీద శనివారం ఉదయం హూటాహూటిగా పాకిస్తాన్ నుంచి కాబూల్ కి వచ్చారు. హమీద్ అందరితో చర్చలు జరిపి రాజీ సూత్రం తయారు చేసిన ఫలితంగా ప్రధానిగా బరాదర్ కాకుండా ముల్లా హసన్ అఖుండ్ ని నియమించాలని నిర్ణయించారు. సొంత బలం కానీ, సొంత గ్రూపు కానీ లేని అఖుండ్ ఏ వర్గానికీ వ్యతిరేకి కారు కనుక ఆయనను ప్రధానిగా నిలబెట్టారు.

అమెరికా పరిశోధక సంస్థ ఎఫ్ బీఐ తయారు చేసిన  ఉగ్రవాదుల జాబితాలో మొదటి వరుసలో సిరాజుద్దీన్ హకానీ ఉన్నారు. ఆయనను దేశీయాంగమంత్రిగా నియమించారు. ప్రధాని పదవిలో కూర్చోబోతున్న హసన్ అఖుండ్ కూడా ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడు 2001 మార్చిలో బామియాన్ లో బుద్ధవిగ్రహాలు ధ్వసం చేసినవారిలో ఒకడు.

అఫ్ఘానిస్తాన్ భవిష్యత్తులో భాగస్వామి కావాలని కలలు కనిన కతార్ కు ఆ అవకాశం చిక్కినట్టు కనిపించలేదు. కతార్ మాటను ఖాతరు చేసి ఉంటే బరాదర్ ప్రధాని అయ్యేవారు. పాకిస్తాన్ సలహాను ఆలకించారు కనుకనే హమీద్ మాట నెగ్గింది. ఇప్పుడు ప్రకటించిన మంత్రిమండలి సభ్యులలో ఎక్కువ మంది తాలిబాన్ సైనిక విభాగానికి చెందినవారు. సైనిక విభాగం పాకిస్తాన్ కి దగ్గర. రాజకీయ విభాగం కతార్ కు సన్నిహితం. ‘‘తాలిబాన్ కూ, మిగిలిన ప్రపంచానికీ కతార్ మంచి వంతెన. కానీ పాకిస్తాన్ కి తాలిబాన్ పైన ఉన్నంత పట్టు కతార్ కు లేదు,’’ అని మధ్య ప్రాచ్య వ్యవహారాల విశ్లేషకురాలు, యూరోపియన్ లీడర్ షిప్ నెట్ వర్క్ కు చెందిన జేన్ కినిన్ మాంట్ వ్యాఖ్యానించారు.    

ఉగ్రవాదిగా అమెరికా జాబితాలో ప్రముఖంగా ఉన్న సిరాజుద్దీన్ దేశీయాంగమంత్రిగానూ, ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్న హసన్ అఖుండ్ ప్రధానిగానూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని అమెరికా కానీ ఇతర పాశ్చాత్య దేశాలు కానీ గుర్తించడం కష్టం. ఉగ్రవాదులను దూరంగా పెట్టాలన్నది అమెరికా ప్రథమ షరతు. మహిళలకు హక్కులు ఉండాలన్నది రెండవ షరతు. ‘‘మేము గిరిజన దళం కాదు. యుద్ధం జరిగినప్పటికీ అమెరికాతో సహా మొత్తం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం,’అని ముజాహిద్ అన్నారు. తమ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలూ గుర్తిస్తాయని విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు.   

ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు మంత్రిమండలి ఏర్పాటు చేయగానే అన్నీ అయిపోలేదు. నిజానికి అఫ్ఘానిస్తాన్ పీకలవరకూ ఆర్థిక కష్టాలలో ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబూల్ బ్యాంకులలో నగదు లేదు. అఫ్ఘానిస్తాన్ కేంద్ర బ్యాంకు ద అఫ్ఘానిస్తన్ బ్యాంక్ లో అమెరికా తొమ్మిది వందల కోట్ల డాలర్ల నిధిని స్తంభింపజేసింది. అంతర్జాతీయ ద్రవ్యవ్యవస్థ రిజర్వు ఫండ్ ను వినియోగించేందుకు అనుమతి ఇవ్వలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles