పంజ్ షీర్ రాష్ట్రం పూర్తిగా తమ అదుపులోనికి వచ్చినట్టు తాలిబాన్ సోమవారం ఉదయం ప్రకటించింది. దేశం ఇప్పుడు యుద్ధవాతావరణం నుంచి బయటపడిందని తాలిబాన్ వ్యాఖ్యానించింది. పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపైన తాలిబాన్ పతాకం ఎగురవేసినట్టు అస్వకా వార్తా సంస్థ వెల్లడించింది. కానీ ప్రతిఘటన శక్తుల మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు.
‘‘కిరాయిసైనికుల చేతుల్లో ఉన్న చివరి రాష్ట్రం పంజ్ షీర్ ని పూర్తిగా జయించాం. అల్లాహ్ దయవల్ల, మా దేశప్రజల మద్దతు వల్లా రాష్ట్రాన్ని, దేశాన్ని సురక్షితం చేయడానికి మా తాజా చర్యలు ఫలించాయి,’’అంటూ తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ప్రతిఘటిస్తున్న సాయుధుల్ని ఓడించామనీ, మిగిలినవారు పారిపోయారనీ ఆయన వెల్లడించారు. అణచివేతకు గురైన, గౌరవనీయులైన పంజ్ షీర్ ప్రజలు తమను బంధించినవారి కబంధహస్తాలలో నుంచి విముక్తులైనారని చెప్పారు.
‘‘గౌరవనీయులైన పంజ్ షీర్ ప్రజలను కాపాడాం. వారిపట్ల ఎటువంటి వివక్షభావం ఉండదు. వారంతా మా సోదరులే. మేము ఉమ్మడి లక్ష్యం కోసం దేశానికి సేవచేస్తాం. ఈ విజయంతో మా దేశంలో యుద్ధం సమసిపోయింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సంపదతో కూడిన శాంతియుతవాతారవరణంలో మా ప్రజలు జీవిస్తారు,’’ అని ముజాహిద్ ప్రకటించారు.
తాలిబాన్ చెబుతున్నవన్నీ అబద్ధాలనీ, ప్రతిఘన దళాలు కొండలమీద ఉన్నాయనీ, లోయను పరిరక్షిస్తున్నాయనీ, తమపైన యుద్ధానికి తాలిబాన్ కు పాకిస్తాన్ యుద్ధవిమానాలు సహకరిస్తున్నాయనీ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే వర్గానికి చెందిన అధికారి ‘ఇండియా టుడే’కి ఫోన్ చేసి చెప్పారు. పరిస్థితులు ప్రతిఘటన శక్తులకు అనుకూలంగా ఉన్నాయని ప్రతిఘటన దళాల అధిపతి అహ్మద్ మసూద్ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.
చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ, యుద్ధం ఆగిపోవాలని కాంక్షిస్తూ అహ్మద్ మసూద్ ఒక ప్రకటన ఆదివారం సాయంత్రం వెలువరించిన తర్వాత మొత్తం పంజ్ షీర్ తమ స్వాధీనంలోకి వచ్చినట్టు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించారు. ఆదివారంనాడు ప్రతిఘటన దళాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అహ్మద్ మసూద్ మేనల్లుడు సాలే మొహమ్మద్ పోరాటంలో ప్రాణాలు విడిచారు.
పంజ్ షీర్ లో రహస్య స్థావరం నుంచి ప్రతిఘటన దళాలను అమ్రుల్లా సాలే నడిపిస్తున్నారు. చర్చలను ఆహ్వానిస్తూ అహ్మద్ మసూద్ చేసిన ప్రకటనను సాలే సమర్థించారు. పంజ్ షీర్ నుంచి ఉపసంహరించుకొని చర్చలు జరపాలన్న అహ్మద్ మసూద్ ప్రతిపాదనను తాలిబాన్ తిరస్కరించింది. మతపెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు అహ్మద్ మసూద్ శాంతి ప్రతిపాదన చేశారు.