- ఈ వ్యాధి వస్తే మరణం తథ్యం అంటున్నారు
- కేరళలో ప్రవేశించిన ఈ వ్యాధి ఎటు వెడుతుందో మరి!
మనల్ని నడిపించేది మెదడే. ఆ మెదడుకు ఏదైనా అయితే? ఇక అంతే సంగతులు. మతిమరుపు నుంచి మరణం దాకా అనేకం చూడాల్సి వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్స్, హెమరేజెస్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత కొందరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో మెదడుకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. ఇది ఇలా ఉండగా, కేరళలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి దేశ ప్రజలను భయపెడుతోంది. ఇప్పటికే కొందరు మృత్యువాత పడ్డారు. ఇటీవలే 15ఏళ్ళ బాలుడు ఈ వ్యాధితో మరణించిన సంఘటన కలవరం రేపుతోంది. ఈ వ్యాధితో సంభవించిన మరణం ఇదే మొట్టమొదటిది కాదు. 2016నుంచి ఈ తరహా మరణాలు కేరళలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ మరణించినవారిలో వివిధ వయసులవారు ఉన్నారు. కలుషితమైన నీటి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కలుషిత నీటిలో సంచరించే అమీబా కారణంగా వ్యాధి సోకుతోందని వైద్యులు గుర్తించారు. ఈ అమీబా ముక్కు ద్వారా మనిషి లోనికి ప్రవేశించి మెదడుకు చేరుకుంటుంది. మెదడును ఆహారంగా భావించి అక్కడి కీలక ప్రాంతాలపై దాడి చేస్తుంది. దానితో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. తీవ్రమైన నొప్పి రావడం, మానసికమైన సమతుల్యతను కోల్పోవడం, భ్రమ, వత్తిడి మొదలైనవాటికి గురికావడం జరుగుతాయి. మెల్లగా మరణం కూడా సంభవిస్తుంది. ఈ వ్యాధిని అరికట్టే మందులు ఇంతవరకూ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఈ వ్యాధి మనదేశంలోని కేరళలో మాత్రమే వెలుగుచూసింది.
Also read: మనది సంపన్నుల దేశం!
జబ్బు ఎందుకు వస్తుందో తెలియదు
గతంలో దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ బయటపడినట్లు తెలుస్తోంది. కలుషితమైన నీటిలో స్నానం చేయకుండా ఉండడమే ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ వ్యాధి సోకితే ప్రాణాలు కోల్పోయి తీరుతారని, మరణాల రేటు 100శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఇది అంటువ్యాధి కాదు. అదొక్కటే ఊరట కలిగించే అంశం. 2016లో కేరళలో ప్రవేశించిన ఈ అరుదైన వ్యాధి మనదేశంలోని మిగిలిన ప్రాంతాలలో వెలుగుచూసినట్లు ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు. ఏ కొత్త జబ్బు, ఏ వింత వ్యాధి ఎప్పుడు ప్రవేశిస్తాయో ఏ మాత్రం చెప్పలేని పరిస్థితిలోనే ఇంకా మన విజ్ఞానశాస్త్రం ఉంది. ఈ విషయంలో కరోనాకు మించిన ఉదాహరణ లేదు. ఈ భూమిలోని ఆణువణువునూ కాలుష్యమయం చేశాం. ఇది నూటికి నూరు శాతం మానవ తప్పిదం. నీటి కాలుష్యంతో ఎన్ని జబ్బులు ప్రబలుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇదిగో! ఇప్పుడు మరో కొత్త వ్యాధి పుట్టుకువచ్చింది. ఇటువంటి వ్యాధులకు తోడు మెదడు రకరకాల సమస్యలతో సతమతమవుతోంది. అందులో మతిమరుపు ఒకటి ప్రబలంగా రాజ్యమేలుతోంది.
Also read: భారతీయ ‘జనతా’ గ్యారేజ్
వయస్సుతో నిమిత్తం లేదు
ఒకప్పుడు వృద్ధాప్యంలోనే వచ్చే ఈ జబ్బు ఇప్పుడు మధ్యవయసులోనే వస్తోంది. 45 నుంచి 65ఏళ్ళ లోపు వారికి కూడా ఇది అనుభవంలోకి వస్తోంది. దీనివల్ల ఆలోచనా తీరు మారిపోతుంది. వివేకం కోల్పోతాం. ప్రవర్తన, మాట, కదలికలన్నింటిపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. మన పనులన్నింటినీ దిశానిర్దేశం చేసేది మెదడే. నడక, మాటలు, కళలు, స్పందన, ప్రతిస్పందనలు, భాష, అభివ్యక్తి, నైపుణ్యం అన్నింటికీ మెదడే మూలం. ఈ వ్యాధి కొందరికి వంశపారంపర్యంగా వస్తుంది. మరికొందరికి వత్తిడితో వస్తుంది. ఇంకొందరికి పలు కారణాలతో వస్తుంది. కారణాలు ఏంటన్నది కచ్చితంగా చెప్పలేం. మతిమరుపు ప్రభావంతో మెదడులో కణాలు దెబ్బతింటాయి. చివరకు కణాలు మరణిస్తాయి కూడా. శారీరకంగా చురుకుగా ఉంటే మానసికంగానూ చురుకుగా ఉంటాం. మతిమరుపు వంటి వాటికి దూరమవుతామని నిపుణులు చెబుతున్నారు. మనిషిని, మనసును నడిపించే మెదడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also read: మహారాష్ట్రలో మరోసారి ఫిరాయింపుల రాజకీయం