- 237 కోట్ల డాలర్లకు విక్రయించాలని అమెరికా నిర్ణయం
- డీల్ తో చైనాతో పెరగనున్న ఉద్రిక్తతలు
తైవాన్ అంశంతో అమెరికా, చైనాల మధ్య వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇరు దేశాలు సవాళ్లు ప్రతిసవాళ్లకు దిగుతున్నాయి. తైవాన్ కు 237 కోట్ల డాలర్ల విలువైన అధునాతన హార్పూన్ క్షిపణి వ్యవస్థలను విక్రయించనున్నట్లు ట్రంప్ సర్కార్ తమ దేశ కాంగ్రెస్ కు నివేదించింది. తైవాన్ కు అయుధాలు సరఫరా చేసే బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్ వంటి సంస్థలపై ఆంక్షలు విధిస్తామని చైనా హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
హార్పూన్ క్షిపణుల ప్రత్యేకతలు
హార్పూన్ క్షిపణులలో జీపీఎస్ ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ ఉండటంతో అది లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేసే హార్పూన్ క్షిపణులు 500 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలవు. తీర ప్రాంతంలోని సైనిక స్థావరాలు, ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, విమానాలు, నౌకాశ్రయాలను ఈ క్షిపణులు ధ్వంసం చేయగలవు.
అమెరికా తీరుపై చైనా తీవ్ర ఆగ్రహం
బిలియన్ డాలర్ల విలువచేసే ఆయుధాలను తైవాన్ కు అమ్మేందుకు అమెరికా నిర్ణయించడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అమెరికా-చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. ఇదే జరిగితే అమెరికాపై ప్రతికార చర్య తప్పదని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికా, చైనాల మధ్య పెరుగుతోన్న వివాదాలను నివారించేందుకు శాంతి నెలకొల్పేందుకు అమెరికా, తైవాన్ ల మధ్య ఆయుధ అమ్మకాల ఒప్పందాలను రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది.
ఆయుధాల విక్రయంపై అమెరికా ఏమంటోంది?
తైవాన్ కు హార్పూన్ క్షిపణుల విక్రయం వల్ల ఆ ప్రాంతంలో సైనిక సమతౌల్యంలో మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు అమెరికా కృషి చేస్తోందనీ, ఆ ప్రాంతంలో భద్రత ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి దోహదపడుతుందనీ అమెరికా చెబుతోంది.