Thursday, December 26, 2024

ఇటు తైవాన్, అటు చైనా, నడుమ అమెరికా

  • రెండు పిల్లుల మధ్య ఎలుక తైవాన్
  • స్వేచ్ఛాప్రపంచంలో కొనసాగాలని కోరుకుంటున్న తైవనీస్
  • తైవాన్ చైనా అంతర్భాగమని అంగీకరిస్తున్న ప్రపంచ దేశాలు
  • అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ సందర్భనతో భగ్గుమన్న చైనా

ద్వీపదేశమైన తైవాన్ –  చైనా మధ్య అంతర్యుద్ధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.  మధ్యలో అమెరికా దూరడంతో అగ్గికి ఆజ్యంపోసినట్లు అక్కడ పరిణామాలు క్షణం క్షణం వేడెక్కుతున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కీలక అధికారి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్- చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటన నేపథ్యంలో తైవాన్ పై చైనా ప్రతీకారాన్ని మరింత పెంచుకుంది. ఆ దేశం చుట్టూ భారీగా సైనిక విన్యాసాలను చైనా చేపట్టింది.

Also read: శ్రీలంక సంక్షోభం సమసిపోతుందా?

కీలక సైనికాధికారిని కోల్పోయిన తైవాన్

తాజాగా అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి తైవాన్ రక్షణ రంగానికి చెందిన కీలక అధికారని తెలుస్తోంది. క్షిపణి అభివృద్ధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి కీలక అధికారిని కోల్పోవడం తైవాన్ కు పెద్ద నష్టంగా మిగిలింది. ఆ దేశ భూభాగాలపై పెద్దఎత్తున దాడులు చేయాలని చైనా తీవ్రంగా యత్నాలు మొదలు పెట్టింది. నియంత్రణ రేఖను దాటి ఆ దేశ భూభాగంలోకి యుద్ధ విమానాలు జలమార్గంలో ప్రవేశించాయి. జలసంధిలో నౌకలు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నాయి. చైనా క్షిపణులు కొన్ని తైవాన్ మీదుగా ప్రయాణించినట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ  చర్యలన్నీ తైవాన్ సార్వభౌమత్వంపై చైనా చేసిన ఉల్లంఘనల పర్వంగానే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. తైవాన్ ను అష్టదిగ్బంధం చేసే క్రమంలో ఆర్ధిక పరమైన ఆంక్షలు కూడా  బలంగా విధించింది. తైవాన్ వేరు దేశం కాదని, తమ భూభాగమే అన్నది చైనా వాదన. ఈ ధోరణి మొదటి నుంచీ నడుస్తోంది. తైవాన్ కు ఇంతవరకూ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కూడా లేదు. చైనా నుంచి స్వతంత్రత ప్రకటించుకొని చాలాకాలమైనా  ఇంకా అనేక అంతర్జాతీయ సమాజాలు తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించడం లేదు. వీటి వలన, ఆ దేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. స్థానిక తైవానులు, చైనా నుంచి వలసవెళ్లినవారితో ఆ దేశం కొన్నేళ్ల నుంచి ప్రత్యేకంగా మనుగడ సాగిస్తోంది. ఇప్పటికీ అధికారికంగా ‘రిపబ్లిక్ అఫ్ చైనా’గానే ఉంది. చైనాలోని అంతర్భాగంగానే ఇప్పటికీ గుర్తించబడుతోంది. చాలా దేశాల వలె ఈ ద్వీప దేశాన్ని అనేక దేశాలవారు ఆక్రమించుకొని పరిపాలించారు. ఆ జాబితా చాలా పెద్దది. ఈ క్రమంలో మిశ్రమ ప్రగతిని సాధించింది. ఒక సమయంలో సింగపూర్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా దేశాలతో కలిసి ‘ఫోర్ ఆసియన్ టైగర్స్’లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. జపాన్ పాలించిన సమయంలో విభిన్న రంగాల్లో ప్రగతికి పునాదులు పడ్డాయి. తైవాన్ కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసేది. ఈ విధానం చైనాతో వివాదాలను పెంచిపోషించింది. ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ కలిగిన సైనిక పరికరాలను సరఫరా చేయబోతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనితో పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనా ఆర్ధిక పరమైన హెచ్చరికలను జారీ చేసింది. ఇలా ఈ రెండు దేశాల మధ్య అమెరికా ప్రవేశించడం వల్ల విభేదాలు పెరుగుతూ వచ్చాయి. నేడు నాన్సీ పెలోసీ పర్యటనతో ముదిరి పాకాన పడింది. అగ్రరాజ్యంతో ఉన్న ఆధిపత్య పోరుకు ఇలాంటి చిన్న దేశాలన్నీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. తైవాన్ కు రాజకీయ, చట్టపరమైన హోదా నిరంతరం వివాదాస్పద అంశాలుగానే రగులుతున్నాయి.

Also read: ఉదయశ్రీ కరుణశ్రీ ఉదయించిన సుదినం

తైవాన్ పై ఆధిపత్యం చైనా అభీష్టం

తైవాన్ పై ఆధిపత్యం ఉండడమే చైనా నిరంతరం కోరుకొనే అంశం. తైవాన్ లోని రాజకీయ పార్టీలు, పౌరుల మధ్య కూడా ఐక్యత సక్రమంగా లేదు. కొందరు స్వతంత్రతను కోరుకుంటున్నారు. మరికొందరు తైవాన్ -చైనీయులుగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నిష్పత్తి 50-50 కి అటుఇటుగా ఉంటోంది. ఈ శాతం తరచూ మారుతూ వస్తున్నా, మెజారిటీ స్వతంత్ర దేశంగా గుర్తింపు వైపే ఉందని చెప్పవచ్చు. కొత్త తరాల వారిలో ఎక్కువమంది స్వతంత్రత వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో, తైవాన్ దైత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జలసంధిలో పరిస్థితులు చక్కబడితే తైవాన్ కొంత కుదుటపడుతుంది. చూస్తూ చూస్తూ చైనా అటువంటి స్వేచ్చా వాతావరణాన్ని ఎందుకు కలిపిస్తుంది? నయా సామ్రాజ్య కాంక్షతో రగిలిపోతూ, అగ్రరాజ్య సింహాసనంలో కూర్చోవాలని తహతహలాడుతున్న చైనా ఆకలికి, కోపానికి బడుగుదేశాలు బలికాక తప్పడం లేదు. వద్దని వారించినా తమ మాట లెక్కచేయకుండా తైవాన్ ను సందర్శించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనను బూచిగా చూపించి తైవాన్ తో చైనా ఆడుకుంటోంది. ఈ నెపంతో బైడెన్ ప్రభుత్వంతో వాతావరణం మార్పులు, రక్షణ విభాగం, మాదక ద్రవ్య నిరోధక ప్రయత్నాల వంటి అంశాలపై చర్చలు నిలిపివేస్తున్నట్లు చైనా మొన్న శుక్రవారం ప్రకటించింది. సముద్ర భద్రత, అక్రమ వలసదారుల అప్పగింతలో సహకారం, నేర పరిశోధనలు, అంతర్జాతీయ నేరాలు మొదలైన అనేక అంశాలపై ద్వైపాక్షిక  చర్చలను కూడా రద్దు చేసుకుంటున్నట్లుగా చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకోవడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. సరిహద్దు వివాదాలు సృష్టించడం, ఆక్రమణలకు తీవ్రంగా ప్రయత్నం చేయడం ఆ దేశానికి దైనందిన చర్యలుగా మారిపోయాయి. తైవాన్ ను కేంద్రంగా చూపిస్తూ మిగిలిన దేశాలకు కూడా చైనా పరోక్షంగా హెచ్చరికలు జారీచేస్తోంది. నియంతృత్వం – ప్రజాస్వామ్యం మధ్య పోరాటాలకు తెరపడనంతకాలం ఈ కాష్టం కాలుతూనే ఉంటుంది. కాకపోతే, వేదికలు మారుతూ ఉంటాయి.

Also read: అల్ ఖైదా అధినేత అల్ – జవహరీ అంతం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles