Sunday, December 22, 2024

నెహ్రూ ఆత్మకథ చదివి పొంగిపోయిన రవీంద్రుడు

జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 1934-35 మధ్య కాలంలో ఆయన తన ఆత్మకథ (TOWARDS FREEDOM) రాసుకున్నారు. బానిస సంకెళ్ళు తెంచుకోవాలని దేశం స్వేచ్ఛకోసం తపిస్తున్న దశలో ఆయన అందులో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూజీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారు. కూతురు ఇందిర అప్పటికి చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల ఆమెను తరచూ రవీద్రుడి శాంతినికేతన్ కు పంపుతుండేవారు. రవీంద్రుడి పర్యవేక్షణలో ఆమె అక్కడ గడుపుతూ ఉండేది. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చేసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్ టాగూర్ ఆమెను ‘ప్రియదర్శిని’ అని అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిరప్రియదర్శిని అయ్యింది.

Also read: ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒంటరి వీరుడు సోల్జినిత్సిన్

పండిట్ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమ జగద్విదితం! ఆయన ఆత్మకథను చదివి విశ్వకవి ఆశ్చర్యచకితులై పొయ్యారు. ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. అప్పటికి నెహ్రూ భారత దేశానికి తొలి ప్రధాని కాలేదు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న దేశభక్తుడు,యోధుడు మాత్రమే. భార్య అనారోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి పూర్తి సమయం దేశం కోసం వెచ్చించడం, మానవీయ విలువల కోసం తపించడం – విశ్వకవి రవీంద్రుడికి బాగా నచ్చింది. 31 మే 1936న తన నివాసం శాంతినికేతన్ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది.

ఇందిరాప్రియిదర్శిని, రవీంద్రనాథ్ టాగూర్

‘‘ప్రియమైన జవహర్ లాల్,

మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం! చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటికీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకు సాధించిన విజయాలకు మించిన మహోన్నతమైన వ్యక్తిత్వం మీది – అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయితీ అయిన ఒక నిఖార్సయిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది-’’ అని కితాబిచ్చారు రవీంద్రనాథ్ టాగూర్!

Also read: జాతి భక్షకులు నరభక్షకులకన్నా ప్రమాదం!

సాహిత్య ప్రేమికుడు, సాహిత్యకారుడు అయిన భారత తొలిప్రధాని జవహార్ లాల్ నెహ్రూకి విశ్వకవి రవీంద్రుడు, అమృతాషేర్ గిల్, కవయిత్రి సరోజనీ నాయుడు, ఫ్రెంచ్ సాహిత్యకారుడు, నోబెల్ గ్రహీత రొమైన్ రొల్లాండ్ వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. సమయం చూసుకుని వారికి నెహ్రూజీ సమాధానాలు రాస్తుండేవారు. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణింపబడుతూ ఉండేది. జైలు నుండి నెహ్రూజీ తన కూతురు ఇందిరా ప్రియదర్శినికి రాసిన ఉత్తరాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారిత్రక, స్వాంతంత్ర్యోద్య అంశాలు, అలాగే దేశ, కాల పరిస్థితుల గురించిన ఇతర అంశాలు ఎన్నో చర్చించబడుతూ ఉండేవి. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తకరూపంలో వెలువడ్డాయి.

Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

  1. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప రాజనీతి నాయకుడు. భారత దేశ స్వాతంత్య్రం కోసం నిరంతరం పోరాటం కొనసాగించాడు. స్వాతంత్య్రానంతరం భారత దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు నెహ్రూ గారు ఎనలేని కృషి చేశారు .నెహ్రూ గారి గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంత గొప్పగా చెప్పడం చాలా సంతోషకరం.
    ఇటువంటి అనేక అంశాలను” సకలం “తీసుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles