సినిమా రంగంలో పెద్దప్రసాద్ పేరు తెలియనివారు ఉండరు.తమిళనాడులో
‘పెరియ ప్రసాద్’ గా చాలాపేరు గడించారు.అనారోగ్యంతో శుక్రవారం ఉదయం చెన్నైలో ఆయన మరణించారు.
పెద్దప్రసాద్ పూర్తిపేరు వురివి లలిత ప్రసాద్.పదహారణాల తెలుగువాడు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నందిగాంవారి స్వగ్రామం.వారిది కళాకారుల కుటుంబం.
తండ్రి జగన్నాథరావు అప్పట్లో ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు.యక్షగాన సంప్రదాయంలో దిట్ట.
‘వీధి భాగవతం’ ప్రదర్శనల ద్వారా చాలా పేరు తెచ్చుకున్నారు. జగన్నాథరావులోని ప్రతిభను గమనించిన సుప్రసిధ్ధ గాయకుడు ఘంటసాల, వారి కుటుంబాన్ని మద్రాస్ ఆహ్వానించారు.
వారిని ఘంటసాల ఎంతగానో ప్రోత్సహించారు.సంగీత దర్శకులందరికీ పరిచయం చేశారు.
భానుమతి మొదలు ఆనాటి లబ్ధప్రతిష్ఠులైన సంగీత దర్శకులందరూ జగన్నాథరావు మృదంగ ప్రజ్ఞను సద్వినియోగం చేస్తున్నారు.
‘విప్రనారాయణ’ మొదలైన అనేక సినిమాలకు ఆయన పనిచేశారు.
జగన్నాథరావు కుమారుడే లలితా ప్రసాద్. తండ్రి వలె ప్రసాద్ కూడా సహజ కళాకారుడు.7 ఏళ్ళ వయస్సులోనే రికార్డింగ్ లో తబలా వాయించి అందరినీ ఆశ్చర్యపరచాడు.అది మొదలు సుమారు ఏడు దశాబ్దాలకు పైగా దక్షిణాది, ఉత్తరాది సినిమా రంగంలో ‘పెరియ ప్రసాద్’గా పెద్దపేరు తెచ్చుకున్నారు.
అనేక భాషల్లో దాదాపు 65వేల పాటలకు తబలా,డోలక్ వాయించారు.ఎస్ డి బర్మన్ నుంచి ఏ ఆర్ రెహమాన్ వరకూ ప్రతి సంగీత దర్శకుడికి అభిమాన కళాకారుడిగా మారిపోయారు.
ఎందరినో శిష్యులను తయారు చేశారు.ఎందరికో ప్రోత్సాహాన్ని అందించారు.
‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమాలోని రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక,
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఇలా ఎన్నెన్నో అద్భుతమైన గీతాలకు వాద్య సహకారం అందించారు. సోలో ప్రదర్శనలు కూడా చేశారు. తబలాపై ఎన్నో ప్రయోగాలు చేశారు. దరువులు,జతులు, ధ్వనులే గాక,సరిగమలు,మాటలు కూడా వినిపించేవారు.
“ఆ వేళ్లల్లో ఏవో మాయలు,మంత్రాలు ఉన్నాయి,ఆ నడకలు ఎవ్వరూ అనుకరించలేరు!” అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదలైన ఎందరో పెద్దల ప్రశంసలు,ఆశీస్సులు పొందిన విశిష్ట కళాకారుడు పెద్దప్రసాద్.
ప్రభుత్వాల నుంచి ‘పద్మ’పురస్కారం మొదలు ఎన్నో ఘన గౌరవలు అందుకో గలిగిన గొప్ప కళాకారుడు. ప్రభుత్వ పురస్కారాలు ఎలా ఉన్నా,కళాలోకంలో గొప్ప సమ్మాన,సత్కారాలు పొందారు.
చెన్నైలో మృతి చెందిన పెద్దప్రసాద్ (79)కు భార్య,ఇద్దరు కుమారులు,కుమార్తె ఉన్నారు.