ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపే! ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాల వేడి రాజకీయులకు చలిని దూరం చేసింది. మరోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. నువ్వానేనా అంటున్నట్లయినా సాగుతుందనుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొద్దిసేపు ఉత్కంఠ కలిగించి, మళ్ళీ ఎన్డీయేకే పట్టం కట్టాయి. హంగ్ ఏర్పడుతుందనే సంకేతాలు ఓట్ల లెక్కింపు మొదలైన రెండు గంటల్లో వచ్చింది. తుది ఫలితం స్పష్టంగానే విజేతను నిర్ణయించింది. గవర్నర్ జోక్యం అవసరం లేకుండానే సుఖాంతమైంది. అటు మద్య ప్రదేశ్‌లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కావాల్సిన ఎనిమిదిమంది కాగా, 20మంది ఎమ్మెల్యేలుగా ఎంపికై బీజేపీకి ఢోకాలేకుండా చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే, తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఒక ఎత్తు.
పనిచేయని సానుభూతి
దుబ్బాక రాజకీయులకు ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది. సాధారణంగా ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో వారి వారసుల్ని నిలబెడతారు. పరిస్థితుల్ని బట్టీ మిగిలిన పార్టీలు కూడా పోటీ పెట్టకుండా ఏకగ్రీవం అయ్యేలా చూసిన సందర్భాలు కొల్లలు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాదు. దేశవ్యాప్తంగా ఇదే తీరు. రాజకీయ వైరుధ్యాలు విపరీతంగా ఉన్న కొద్దిపాటి సందర్భాలలో ఇందుకు భిన్నంగానూ జరిగింది. సాధారణంగా వారసులు నెగ్గకపోవడం అనేది లేదు. ఇప్పుడు దుబ్బాకలో 2018 అసెంబ్లీ ఎన్నికలలో 62వేల మెజార్టీతో నెగ్గిన సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీలో ఆయన భార్య సుజాతను బరిలో దింపింది టీఆర్ఎస్. సానుభూతిని సొమ్ముచేసుకుని తేలిగ్గా గట్టెక్కుదామనేదే ఈ నిర్ణయం వెనుక ఆలోచన అనడం సమంజసంగానే ఉంటుంది. పరిస్థితులు అంతగా సజావుగా లేవు కనుకనే సానుభూతిపై గట్టెక్కాలని అనుకుని ఉండవచ్చు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రధానంగ మల్లన్నసాగర్ బాధితుల ఆగ్రహం తమను దెబ్బకొడుతుందని భావించి ఉండవచ్చు తెరాస.
Also Read: దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం
బండి సంజయ్ అరెస్టు కీలక మలుపు
ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగానే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. అక్కడి వరకూ ఒక ఎత్తయితే, ఆయనను అరెస్టు చేసిన తీరుకు కలత చెందానంటూ గంగుల శ్రీనివాస్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ నాలుగు రోజుల అనంతరం అతను కన్నుమూశాడు. అలాగే, అర్ధరాత్రి పూట బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు బంధువు ఇంటిపై పోలీసుల దాడి కూడా ఎన్నికలపై ప్రభావం చూపిందనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు పక్కా సమాచారంతోనే జరిగినా ఎన్నికల సమయం కాబట్టి, ప్రభుత్వంపైకే అనుమానాలు కలిగేలా చేస్తాయనడంలో సందేహం లేదు. మరో సందర్భంలో వాహనం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కోటి రూపాయల నగదు బీజేపీకి చెందినవేనని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఈ రెండు ఘటనలూ బీజేపీనీ, అభ్యర్థినీ అప్రతిష్ఠపాలుచేసేవిగానే ఓటర్లు తీసుకున్నారని భావించాల్సి వస్తుంది. ఫలితం బీజేపీవైపే నిలిచింది కాబట్టి ఇలా అనుకోవడానికి ఆస్కారం ఇచ్చింది.
మరో అంశం హరీశ్-కేటీఆర్ వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్దేశించి, మంత్రులిద్దరూ చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా పార్టీకి ఎన్నికలలో నష్టం కలుగచేశాయని భావించవచ్చు. ఒక టిఆర్ఎస్ నేత అయితే ఏకంగా బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టి, అక్కడితో ఆగకుండా కార్పొరేటర్‌గా పనిచేసిన వ్యక్తిని అందలం ఎక్కిస్తే, వ్యవహారాలు ఇలాగే ఉంటాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గెలుపు అవకాశాలను దెబ్బతీసేవి పార్టీలు చేసే చిన్నచిన్న తప్పులే. అవి వారికి చిన్నవే కావచ్చు. కానీ ఓటర్లపై పెను ప్రభావాన్నే చూపుతాయి. దాని ఫలితమే దుబ్బాకలో పరాభవం. భారీ మెజార్టీ నుంచి ఓడిపోయేలా చేశాయి. పార్టీలో అంతర్గత లుకలుకలు, రాజకీయ సమీకరణాలూ కూడా దీనికి దోహదం చేశాయి. దుబ్బాకకు ఇన్చార్జిగా వ్యవహరించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఓటమికి బాధ్యత స్వీకరించారు. అది ఏ రూపంలో ఉంటుందో తేలడానికి కొద్ది కాలం ఆగాల్సిందే. టీఆర్ఎస్‌కు ట్రబుల్ షూటర్ అయిన హరీశ్ ఉప ఎన్నికల పోరులో అత్యంత సమర్థుడు. ఇంత వరకూ ఆయనకు ఓడిన లేదా పార్టీని గట్టెక్కించకుండా ఉన్న సందర్భం లేదు. ఇదే ప్రథమం.
ఆది నుంచి మెజార్టీ దారిలోనే
లెక్కింపు మొదలైన దగ్గర్నుంచి బీజేపీ మెల్లిగా ఆధిక్యం పెంచుకుంటూ వెళ్ళింది. రెండు రౌండ్లలో కాంగ్రెస్, నాలుగు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాలను నమోదు చేశాయి. చేగుంటలో చివరి రౌండ్లలో వచ్చిన ఓట్లు, తగ్గిన మెజార్జీని నిలబెట్టి వెయ్యి 79 ఓట్ల ఆధిక్యతతో రఘునందన్‌రావుకు విజయాన్ని ఖాయం చేశాయి. ఇలాంటి ఉత్కంఠభరిత ఓట్ల లెక్కింపు చాలా ఏళ్ళ తరవాత చూసిన సందర్భం ఇదే. 2009 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ఉండవల్లి అరుణ్‌కుమార్ పోటీ పడినప్పుడు సైతం ఆద్యంతం ఆయన ప్రత్యర్థి కంటే వెనకబడే ఉన్నారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లలో ఆయనకు పూర్తి ఆధిక్యం చేకూరి రెండోసారి ఎంపీ అయ్యారు. అప్పుడు కూడా ఇంతే. ఉండవల్లి ఫలితం గురించి, అప్పటిక సీఎం డాక్టర్ వైయస్ఆర్ సైతం పదేపదే ఆరా తీశారని అంటారు. ఇప్పుడు దుబ్బాకలో సైతం ఓట్ల లెక్కింపు జరుగుతున్నంతసేపు ముళ్ళపై కూర్చున్నట్లు కూర్చున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా మెజార్టీలు మారుతూ వచ్చాయి. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు అధికార పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి సర్వే సర్వత్రా రాజ్యమేలుతోంది.