Thursday, December 26, 2024

ఆత్మగౌరవ జెండా వెలిచాల జగపతిరావు

అవి ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న రోజులు. కరీంనగర్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా జె. చొక్కారావు పోటీలో ఉన్నారు. నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెట్టి దాని తరఫున డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగుదేశం పార్టీతో అవగాహన ఉంది. చొక్కారావు సభ జరుగుతోంది. సభలో ముగ్గురు జర్నలిస్టు మిత్రులు ఒక చోట కూర్చున్నారు. చొక్కారావు వాక్ప్రవాహం సాగుతోంది.

‘‘చొక్కారావుకు కారు ఉన్నదా?  చొక్కారావుకు హైదరాబాద్ లో ఇల్లు ఉన్నదా? చొక్కారావుకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదా? చొక్కారావుకు వందల ఎకరాల భూమి ఉన్నదా? చొక్కారావుకు ఆస్తులున్నాయా? చొక్కారావు ఎప్పుడైనా మంత్రిగా పని చేశాడా? చొక్కారావు ఎన్నడైనా పైరవీలు చేశాడా? చొక్కారావు ఎన్నడైనా అవినీతి పని చేశాడా? చొక్కరావు….’’

ఈ ప్రసంగం వింటున్న ఒక జర్నలిస్టుకు ఏమీ అర్థం కావడం లేదు. అతను కరీంనగర్ కు కొత్తగా వచ్చాడు. అక్కడి మనుషులూ, రాజకీయాలూ ఇంకా పరిచయం కాలేదు. వక్త చొక్కారావు అనే వ్యక్తి గురించి అంతగా ఎందుకు మాట్లాడుతున్నాడో అంతుబట్టలేదు. పక్కన ఉన్న ‘ఉదయం’ రిపోర్టర్  సాయిబాబాను అడిగాడు ‘ఆ చొక్కారావు ఎవరు సార్?’’ అని. ‘మాట్లాడే వ్యక్తే చొక్కారావు’ అని సమాధానం విని విస్తుపోయాడు కొత్త విలేఖరి. అందరూ నవ్వుకున్నారు. సభ ముగిసిన తర్వాత చొక్కారావు వారి దగ్గరికి వెళ్ళి ‘మీరు ముగ్గురూ ఎందుకు నవ్వారో చెప్పాలి. నేనేమైన పొరపాటు మాట్లాడానా?’ అని అడిగారు. సమాధానం చెప్పడానికి వాళ్ళు సంకోచించి మౌనంగా ఉన్నారు. జవాబు చెప్పమని చొక్కారావు బలవంతం చేశారు. సాయిబాబా జరిగింది చెప్పారు. అప్పుడు చొక్కారావు కూడా పగలపబడి నవ్వారు. పక్కనే ఉన్న జగపతిరావు కూడా నవ్వుతూ ‘మీ  గురించి మేము చెపుతాం గదా? మమ్మల్ని చెప్పనిస్తేనా. మాకు అవకాశమే ఇవ్వరాయె’ అన్నారు. జగపతిరావు సూటిగా మాట్లాడతారని ప్రతీతి. చొక్కారావు, జలగం వెంగళరావు కూడా ఆయనతో జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. ఏమైనా తేడా వస్తే నిర్మొహమాటంగా మొహంమీద అనేస్తారని జంకేవారు. ఆ ఎన్నికలలో చొక్కారావు గెలుపొందారు. డాక్టర్ చెన్నారెడ్డి ఓడిపోయారు.

వెలిచాల జగపతిరావు ఆత్మగౌరవంతో, దర్జాగా, నిర్భయంగా బతికిన రాజకీయవాది. కవిత్వం రాసిన సాహితీప్రియుడు. సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన నైజం. మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడేరకం కాదు. భోళామనిషి.  కాంగ్రెస్ నాయకుడిగానే రాజకీయ జీవితం యావత్తూ గడిచిపోయింది. కాంగ్రెస్ లో ముఠాతగాదాల వల్ల టిక్కెట్టు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు కానీ మరో పార్టీలో చేరలేదు. ఎన్ టి రామారావు రెండు విడతల కబురుపెట్టినా తెలుగుదేశంపార్టీలో చేరలేదు. 1882లో ఒకసారి, 1985లో మరోసారి. తాను కావాలంటే ఎన్ టి ఆర్ తన నివాసానికి రావాలి కానీ తాను వెళ్ళడం ఏమిటన్నది ఆయన ప్రశ్న. ముక్కుసూటిగా మాట్లాడతారు కనుక కాంగ్రెస్ పార్టీలోనూ మిత్రులకంటే శత్రువులే ఎక్కువ. ప్రజాసేవ, రాజకీయాలూ అంటే ఇష్టం. బ్రిడ్జ్ (పేకాట) అంటే అమితమైన ఇష్టం. ఒక సారి వెంగళరావు కరీంనగర్ లో మాట్లాడుతూ జగపతిరావును బాగా ప్రశంసించారు. చాలా ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా పని చేస్తారనీ, గొప్ప క్రమశిక్షణ కల వ్యక్తి అనీ, కార్యసాధకుడనీ చెబుతూ ‘బ్రిడ్జ్ ఆడదామని ఎవరైనా పిలిస్తే మాత్రం చేతిలో పని వదిలేసి వెడతారు’ అంటూ వ్యాఖ్యానించారు. సమావేశం కాగానే జలగం దగ్గరికి జగపతిరావు వెళ్ళి, ‘‘నాకు బ్రిడ్జ్ ఆటంటే అభిమానమే. ఒప్పుకుంటాను. కానీ అది బహిరంగ సభలో చెప్పవలసిన విషయమా?’’ అంటూ నిలదీశారు.

సహకారబ్యాంకు అధ్యక్షుడుగా, గంగాధర సమితి అధ్యక్షుడుగా, మార్క్ ఫెడ్ అధ్యక్షుడుగా రెండు టరమ్ లు, ఎంఎల్ ఏగా రెండు సార్లు, ఎంఎల్ సీగా ఒకసారి పదవులు నిర్వహించారు. తెలంగాణ శాసనసభ్యుల ఫోరం కన్వీనర్ గా కూడా పని చేశారు. మంత్రికావాలనే కోర్కె బలంగా ఉండేది. తన నిబద్ధత, అంకితభావం, ప్రజాదరణ చూసి తనను పిలిచి ముఖ్యమంత్రులు మంత్రిపదవి ఇవ్వాలని ఆశించేవారు. మంత్రిపదవి కోసం పైరవీలు చేయడం, ఎవరితోనైనా చెప్పించుకోవడం వంటి పనులు చేసే రకం కాదు ఆయన. ఆరు సార్లు ఎంఎల్ఏ గా పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. రెండు సార్లు ఎంఎల్ సీ పదవికి పోటీ చేసి ఒక సారి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పీవీ నరసింహారావు హాయంలో 1972లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు మీద ఎంఎల్ఏగా గెలుపొందారు.  1989లో కాంగ్రెస్ టిక్కెట్టు దక్కకుండా కొందరు నాయకులు ప్రయత్నించి సఫలీకృతులైనారు. కాసు బ్రహ్మానందరెడ్డికి జగపతిరావు అంటే చాలా ఇష్టం.  కానీ కాంగ్రెస్ టిక్కెట్టు సంపాదించడం కోసం పెద్దవాళ్ళతో చెప్పించుకోవడం ఆయన ఇంటావంటా లేదు. ఆ ఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నిలిచి ఢంగా బజాయించి గెలిచి జనబాహుళ్యంలో తనకు ఎంత మంచి పేరు ఉన్నదో నిరూపించుకున్నారు. కరీంనగర్ పట్టణానికి తాగు నీరు, నాణ్యమైన విద్యుచ్ఛక్తి సరఫరాకు శాశ్వతంగా ఏర్పాటు చేసిన ప్రజానాయకుడు ఆయన. పేద ప్రజలు ఆయన ఇంటి ముందు ఉండేవారు.  అధికారం, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో ఆయన సంబంధాలు కొనసాగేవి. ఎవరైనా కష్టం వచ్చింది సాయం చేయమంటే వెంటనే అందుకు సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి చెప్పేవారు. అధికారులు ఆయన మాట గౌరవించేవారు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసి తనను ఓడించిన వ్యక్తులకు కూడా సాయం చేసిన దొడ్డమనసు ఆయనది. కక్షలూ, కార్పణ్యాలూ తెలియని మనిషి.

నక్సలైట్లను అభిమానించేవారు. కానీ నక్సలిజాన్ని ఆమోదించేవారు కాదు. నక్సలైట్లు ప్రాణాలకు తెగించి అడవులలో పోరాడుతూ చనిపోవడం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేయవచ్చును కదా అని వాదించేవారు. ఒక సారి కరీంనగర్ శివార్లలో తన తోటకి నక్సలైట్ నాయకులను ఆహ్వానించారు. తనతో ముగ్గురు జర్నలిస్టులను తీసుకొని వెళ్ళారు. రీజియనల్ కమిటీకి చెందిన ముగ్గురు నక్సలైట్ నాయకులు వచ్చారు. మూడు గంటల చర్చ జరిగింది. నక్సలైట్లు పోరాట పంథాని మార్చుకోవాలని వాదించారు నక్సలైట్ల కారణంగా రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని వాపోయారు. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.  భోజనం ఏర్పాటు చేసినా నక్సలైట్ నాయకులు తినలేదు. తినే వచ్చామని మర్యాదగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సంగతి స్థానిక పోలీసు సర్కిల్ ఇన్ స్పెక్టర్  (సీఐ)కి తెలిసింది.  ఆయన జర్నలిస్టును పట్టుకొని ‘మా అనుమతి లేకుండా నక్సలైట్లతో చర్చలు ఎట్లా జరుపుతారు?’ అంటూ ప్రశ్నించారు. ‘మాకేమీ తెలియదు. జగపతిరావుగారు పిలిస్తే వచ్చాం. నక్సలైట్లు కూడా ఆయన పిలిస్తేనే వచ్చారు’ అని చెప్పి జర్నలిస్టులు తప్పుకున్నారు. జగపతిరావును సీఐ అడిగితే ‘‘అవునూ, వాళ్ళు వచ్చారు. నేను మాట్లాడాను. అది వాస్తవమే. అయితే ఏంటంట?’’ అని అడ్డంగా మాట్లాడారు. జగపతిరావుతో పెట్టుకోవడం ఎందుకని సీఐ మిన్నకున్నారు. 

జగపతిరావుకు భావావేశం ఉండేది. అన్నగారు వెలిచాల కొండలరావులాగానే ఆయనకూ సాహిత్య సంస్కారం ఉంది. కవితలు చాలా రాశారు. సున్నాపైన కవిత్వం రాశారు. తెలంగాణ సమస్యల గురించీ, వనరుల గురించీ, ద్రోహాల గురించీ సకల విషయాలూ సాకల్యంగా తెలుసు. అనేక పుస్తకాలు రాశారు. ‘‘తెలంగాణ యాతన’’ పేరుతో ఒక పుస్తకం వాటిలో ఒకటి. నీటిపారుదల మీద, విద్యుచ్ఛక్తిమీదా, నిధులూ, నియామకాలపైనా, విద్యపైనా, సంక్షేమం పైనా పుంఖానుపుంఖంగా వ్యాసాలూ, పుస్తకాలూ రాశారు. నేను ‘వార్త’ సంపాదకుడుగా ఉండగా చాలాసార్లు సాయిబాబానూ, నన్నూ కలుసుకోవడానికి కార్యాలయానికి వచ్చేవారు. మాతో చాలాసేపు కూర్చొని మనసు విప్పి రాజకీయాలపైన తన విశ్లేషణ వినిపించేవారు. ఆయన రాసిన అనేక వ్యాసాలు ‘వార్త’లో ప్రచురించాం. ఆయన గొప్ప అధ్యయనశీలి. విపరీతంగా చదివేవారు. హైదరాబాద్ నగరం కశ్మీర్ అంతటి సుందరమైనదని అనేవారు. ‘‘కశ్మీర్ తలపించు మా రాజధాని, దిల్లీని మరపించు మా రాజధాని….’’ అంటూ కవిత అల్లారు. తన కులం అన్నా, తన కులానికి చెందినవారన్నా విపరీతమైన అభిమానం. వెలమలను పొడుడుతూ, ఆంధ్ర నాయకులను  తెగుడుతూ రాసేవారు, మాట్లాడేవారు. నిమ్న కులాలవారంటే ప్రేమ. వారికోసం అసాధారణ రీతిలో పనులు చేసి పెట్టేవారు. నాయకుల గురించి దులపరింపుగా మాట్లాడేవారు కానీ సాధారణ ప్రజలంటే మక్కువ చూపించేవారు. 87 ఏళ్ళ వయస్సులో 19 అక్టోబర్ 2022న  ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన నిండుమనిషి జగపతిరావు అక్షరాంజలి.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles