- రిషభ్ పంత్ జోరు, విహారీ, అశ్విన్ హోరు
- విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచిన భారత్
- భారత్ 5వికెట్లకు 334 పరుగులు
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ రికార్డుల్లోకి మరో ఉత్కంఠభరితమైన డ్రా మ్యాచ్ వచ్చి చేరింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా గత ఐదురోజులుగా నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల మూడోటెస్ట్ చివరకు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసే సమయానికి రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1 తో సమఉజ్జీగా నిలిచాయి. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జనవరి 15న ప్రారంభమవుతుంది.
ఇది చదవండి: ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార జాడ్యం
రిషభ్ పంత్ రివర్స్ ఎటాక్
టెస్ట్ మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరిరోజు ఆటలో 309 పరుగులు చేయాల్సిన భారత్ ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లకు 98 పరుగులతో ఐదోరోజు పోరాటం కొనసాగించింది. అయితే, ప్రారంభ ఓవర్లలోనే భారత కెప్టెన్ అజింక్యా రహానేను ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ పడగొట్టడంతో కంగారూజట్టు గెలుపు ఆశలు చిగురించాయి.
మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ తో క్రీజులోకి రిషభ్ పంత్ వచ్చి నయావాల్ పూజారాతో కలిశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు భారీభాగస్వామ్యంతో ఆస్ట్ర్రేలియా బౌలర్లను నిలువరించడమే కాదు, భారత్ కు గెలుపు అవకాశాలు కల్పించారు. ఓ వైపు రిషభ్ పంత్ లాఫ్టెడ్ షాట్లతో సిక్సర్ల మోత మోగిస్తుంటే మరోవైపు పూజారా పటిష్టమైన డిఫెన్స్ తో బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ ను మలుపు తిప్పారు.
ఇది చదవండి: ఆసీస్ తో ఆఖరిటెస్టుకు బీసీసీఐ షరతులు
రిషభ్ పంత్ కేవలం 118 నిముషాలపాటు క్రీజులో నిలిచి 118 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 12 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 97 పరుగుల స్కోరుతో సెంచరీకి చేరువై 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకొన్నాడు. చివరకు స్పిన్నర్ లయన్ బౌలింగ్ లోనే పంత్ అవుటయ్యాడు. పంత్ కెరియర్ లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ గా మిగిలిపోతుంది.
విహారీ- అశ్విన్ పోరాటం
ఆట ఆఖరి సెషన్ లో మిడిలార్డర్ ఆటగాళ్లు హనుమ విహారీ- రవిచంద్రన్ అశ్విన్ 5వ వికెట్ కు అజేయ భాగస్వామ్యంతో కంగారూ బౌలర్లను అడ్డుకొన్నారు. తొడకండరాలు పట్టేయడంతో భరించలేని నొప్పితోనే విహారీ తన పోరాటం కొనసాగించాడు. మొత్తం 161 బాల్స్ ఎదుర్కొని 4 బౌండ్రీలతో 23 పరుగులు సాధిస్తే ఆల్ రౌండర్ అశ్విన్ 128 బాల్స్ లో 7 బౌండ్రీలతో 39 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ మ్యాచ్ ను ఫైటింగ్ డ్రాగా ముగించగలిగింది. విదేశీగడ్డపై భారత్ సాధించిన అత్యుత్తమ డ్రాలలో ఈ సిడ్నీ టెస్ట్ డ్రా సైతం చేరింది.
నాలుగో ఇన్నింగ్స్ లో ఆఖరిరోజు వికెట్ పై బారత్ మొత్తం 131 ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగించి 5 వికెట్లకు 334 పరుగులు చేయటం ఓ గొప్ప రికార్డుగా మిగిలిపోతుంది. రెండుఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా రాణించిన కంగారూ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరిటెస్ట్ బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జనవరి 15న ప్రారంభమవుతుంది.
ఇది చదవండి: సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్