హైదరాబాద్: ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజని సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికలో ప్రచురించిన వార్త ద్వారా వెళ్లడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెకు జీహెచ్‌ఎంసీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గా ఉద్యోగం ఇచ్చారు. ఈ విషయాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేటీఆర్ ఆ ట్వీట్‌ను కోట్ చేస్తూ, ‘విరామం లేకుండా గడుపుతున్న నాకు ఇదొక ఉత్తమమైన సందర్భం. మీరు పోషించబోయే కొత్త పాత్రకు ఇవే నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్‌ను కలిసిన సందర్భంగా రజని భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.
వరంగల్ జిల్లా పరకాల ప్రాంతానికి చెందిన రజనిది పేద కుటుంబం. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలే అయినా కష్టపడి చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐచ్ఛికాంశంగా రజనీ ఎమ్మెస్సీ పాసైంది. 2013లో పీజీ పూర్తయ్యాక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి అర్హత సాధించారు. అదే సమయంలో తల్లితండ్రులు ఆమెకు వివాహం చేయడంతో న్యాయవాది అయిన భర్తతో హైదరాబాద్ వచ్చారు.కొంతకాలం సాఫీగానే గడిచింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబాన్ని చూసుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తూ రజని ఉద్యోగం కోసం ప్రయత్నించారు. అంతలోనే మరో కుదుపు. నిండా 30 ఏళ్లు కూడా లేని భర్తకు గుండె జబ్బు బయటపడింది. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించారు. ఏకంగా మూడుసార్లు స్టెంట్లు వేయాల్సి వచ్చింది. ఈ కారణంగా ఆయనకు ఉపాధి దూరమైంది. కుటుంబపోషణ భారం రజనిపైనే పడింది. ఇద్దరు ఆడపిల్లలు, అత్త, భర్త బాగోగులు చూసుకుంటూనే… ఆమె ఉద్యోగాన్వేషణ చేశారు.
భుక్తి కోసం సంతల్లో కూరగాయల వ్యాపారం చేశారు. అది కూడా కలిసి రాక… గత్యంతరం లేక… జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరారు. రూ. 10 వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ విషయం తెలిసి ‘ఈనాడు’ ప్రతినిధులు ‘ఎమ్మెస్సీ చదివి .. ఉద్యోగం.. స్వీపర్’ అంటూ కథనాన్ని ప్రచురించడంతో పలువురు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. ‘ నా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తే చాలనుకుంటున్నా. జీవితంలో చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా’ అంటూ రజనీ అన్న మాటలకు స్పందించిన ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం ఇచ్చింది.