రామాయణమ్ – 117
ఎక్కడని వెదకాలి ? ఎలావెదకాలి? సీతమ్మ తల్లి జాడ తెలియక ఒక తరుమూలమునందు కూర్చొని తల్లడిల్లుతున్నారు హనుమదాదులు.. పుట్టా, గట్టూ, చెట్టూ, చేమా, నదీనదాలు, భూమి, ఆకాశం అంతా వెదికారు. ఎక్కడా ఆ తల్లి కానరాలేదు.
నిరాశ ప్రవేశించింది. నిస్పృహ ఆవరించింది. నిశ్శబ్దముగా ఒక చోట కూర్చొని ఎవరికి వారు ఆలోచిస్తున్నారు అందరూ. ఆ నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ అంగదుడు ఇలా అన్నాడు:
సుగ్రీవుడు చండశాసనుడు! మనము బయలుదేరి చాలాకాలమైనది. ఉత్సాహముగా వెదుకుటయే మన కర్తవ్యము. మీరందరూ అలసటను దూరంగా తరిమి కొట్టండి. శోకమును దిగ మింగండి. కంటిమీదకు కునుకును రానీయకండి. మన లక్ష్యం, మన గమ్యం మన పయనం అంతా సీతాదేవి ఎక్కడ ఉన్నదో ఆ చోటు వైపే!
Also read: హనుమపైనే అన్ని ఆశలు
ఏ మనిషికయినా కార్యసిద్ధికి కావలసినది దిగులు చెందని, నేర్పుగల, ఉత్సాహముగా ఉండే మనస్సు. దుఃఖాన్ని విడిచి ఉత్సాహముగా కార్యము చేయువానికి దాని ఫలము తప్పక సిద్ధించును. దిగులు చెందేవాడు కనురెప్పలు కూడా మూయలేడు. మీ అందరి హితమును కోరి మాత్రమె నేను ఇట్లా చెప్పుచున్నాను, ఎందుకనగా సుగ్రీవుడు చండశాసనుడు!
అంగదుని ఈ మాటలు విని గంధమాధనుడను వానరుడు అలసట వల్ల బలహీనముగా నున్న గొంతుతో, ‘‘అవును అంగదుడు చెప్పినది నిజము. మరల మరల వెదుకుదాం. రామపత్నిని కనుగొందామ్. జనకసుత జాడ తెలుసుకొందాం’’ అనిపలికి ఉత్సాహము నింపినాడు.
Also read: వానర వీరులకు దిశానిర్దేశం చేసిన సుగ్రీవుడు, హనుమకు తన గుర్తుగా ఉంగరం ఇచ్చిన రాముడు
మరల బయలుదేరారు వానరులందరూ. వెతుకుతూ వెతుకుతూ వారంతా అలసి సొలసి దప్పిక గొన్నవారై గుక్కెడు నీటితో గొంతు తడుపుకోవటము కోసము నీటి జాడకై వెదుకసాగారు. అప్పుడు వారికి వింధ్య పర్వత శ్రేణులలో ఒక చోట ఒక బిలము కనపడ్డది. అందులో నుండి క్రౌంచ పక్షులు, సారస పక్షులు, నీటితో తడిసిన చక్రవాక పక్షులు బిలమునుండి బయటకు వస్తూ కనపడ్డాయి.
ఆ బిలమును చూడగానే వారికి ఆశ్చర్యము కలిగింది. అప్పుడు హనుమంతుడు వారందరితో ఇలా అన్నాడు, ” మనము సీతాన్వేషణ చేస్తూ అలసిపోయి దప్పిగొనియున్నాము. ఇందులోనుండి బయటకు వచ్చే పక్షులను చూస్తే తప్పకుండా లోపల నుయ్యిగానీ, చెరువుగానీ ఉండిఉంటుంది’’ అని చెప్పగా అందరూ లోనికి ప్రవేశించారు.
చిమ్మచీకటి ఆవరించినది. రోమాలు నిక్కబొడుస్తున్నాయి. అంధకారము ఆవరించి కన్నుపొడుచుకున్నా కానరానటువంటి బిలమది. ఒకరినొకరు పట్టుకొని ఆ బిలములో ప్రవేశించారు వానరులందరూ. అచట కొంత దూరము పోయిన పిమ్మట ఒక కాంతివంతమైన ప్రదేశమును వారు చూశారు.
Also read: ఆకాశం నుంచి రాముడి ఎదుట దిగిన వానర సైన్యం
ఆ ప్రదేశములో వారికి బంగారుగృహములు, వెండి గృహములు పెద్దపెద్ద, పద్మసరస్సులు కనబడ్డాయి. ఆ ప్రాంతమంతా గొప్ప కాంతివంతముగా ఉండి ఫలపుష్పములతో నిండిన చెట్లు బంగారు తుమ్మెదలు, మధువులు కనబడ్డాయి. అది ఒక మరోలోకము! ఇంద్ర లోకములాగా భాసిల్లుతూ వింతవింత కాంతులు వెదజల్లుతూ స్వర్ణశోభతో మెరిసిపోతున్నది.
అక్కడ వారు దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న ఒక వృద్ధతాపసిని చూశారు. ఆమెను హనుమంతుడు సమీపించి చేతులు జోడించి నమస్కరించి, ‘‘అమ్మా నీవు ఎవ్వరవు? ఈ బిలము ఎవ్వరిది?’’ అని ప్రశ్నించాడు.
ఆ తాపసి హనుమ మాటలు విని, ‘‘నాయనా, ఇది దానవ శిల్పి మయునిచే నిర్మింపబడ్డ బంగారు వనము. ఆ మయుడు హేమ అను ఒక దేవతా స్త్రీ యందు మక్కువతో ఉండుట గమనించిన ఇంద్రుడు ఆతనిని వజ్రాయుధముతో సంహరించాడు. అప్పుడు బ్రహ్మ ఈ వనమును హేమకు ఇచ్చి వేసెను. ఆ హేమ నా సఖురాలు. నా పేరు స్వయంప్రభ. హేమ కోరిక మీద ఈ వనమును రక్షించుచున్నాను.
‘‘మరి మీరు ఎవరు? ఈ బిలములో ఎందుకు ప్రవేశించారు?’’ అని ఆవిడ ప్రశ్నించగా రామ వృత్తాంతము ఆసాంతము హనుమంతుడు ఆవిడకు తెలిపి, తాము వచ్చిన పని ఎరిగించాడు.
‘‘నాయనలారా, ధర్మమార్గావలంబులై మీరు ఉన్నందుకు సంతోషము. నేను మీకు ఏ ఉపకారము ఒనరించగలను?’’ అని అడిగింది స్వయంప్రభ. అందుకు వారు ఆ బిలము దాటించమని కోరగా ఆవిడ సమ్మతించి వారినందరినీ కన్నులు మూసుకొమ్మని పలికినది. వారంతా తము కన్నులు మూసి తెరుచులోపల దక్షిణ సముద్ర తీరమునకు చేర్చబడ్డారు.
Also read:రామునికి సుగ్రీవుని పాదాభివందనం
వూటుకూరు జానకిరామారావు