విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారంనాడు కలుసుకున్నారు. దేవాలయాలపైన జరుగుతున్న దాడులపైన దర్యాప్తు వేగవంతం చేయాలని కోరినట్టు స్వామి స్వాత్మానందేంద్ర అన్నారు.
స్వరూపానంద స్వామివారు ఇచ్చిన సూచనలను కూడా ముఖ్యమంత్రికి వివరించానని చెప్పారు. ఆలయాల కమిటీలను సైతం దేవాదాయశాఖ, పోలీసులు సమన్వయం చేసుకోవాలని స్వామి చెప్పారు. పోలీస్ స్టేషన్‌ల వారీగా ఆలయాలపై దృష్టిపెట్టాలని సూచించానని ఆయన అన్నారు.
దుశ్చర్యలను తీవ్రంగా పరిగణించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పాననీ, తాను సూచించిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారనీ స్వామి స్వాత్మానందేంద్ర తెలిజయేశారు. ప్రతి సూచననూ ముఖ్యమంత్రి నోట్ చేసుకున్నారని అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో విజయవాడలో పడగొట్టిన దేవాలయాల పునర్ నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా సీఎం తెలిపారని స్వామి అన్నారు. ఇప్పటికే 30వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా వివరించారని చెబుతూ, దేవుడు మనుషులను రక్షించాలి, అలాంటిది దేవుడి ఆలయాలను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్వామి స్వాత్మానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.