హైదరాబాద్,మార్చి12: దర్శకదిగ్గజం ‘కళాతపస్వి’కె విశ్వనాథ్ సృష్టించిన ఆణిముత్యాలలో ‘స్వాతిముత్యం’ సినిమా ఎన్నదగినది. ఈ సినిమా విడుదలై నేటి (శనివారం)తో 36 ఏళ్ళు పూర్తయింది.ఈ సందర్భంగా ‘శుభోదయం మీడియా’ హైదరాబాద్ లోని కె విశ్వనాథ్ నివాసంలో ఆత్మీయ వేడుక నిర్వహించింది. కె విశ్వనాథ్ ను ఘనంగా సత్కరించింది.
ఈ సినిమాలో భాగస్యామ్యులైన నటులు, కళాకారులు తమ అనుభవాలు, అనుభూతులు, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దృశ్యరూపంలో సందేశాలు పంపారు. దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న గొప్ప కుటుంబ కథాచిత్రంగా ‘స్వాతిముత్యం’ అవార్డుల పంటలు పండించింది. 1986, మార్చి 13 వ తేదీ విడుదలైన ఈ సినిమా భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీని పొందింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు బంగారు నందిని అందుకుంది.దర్శకత్వ విభాగంలో ఫిల్మ్ ఫేర్ విజేతగా నిలిచింది.కమల్ హసన్ ఉత్తమనటుడుగా ఎంపికయ్యాడు.ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. సంప్రదాయం, సంచలనం, సంగీతం,సాహిత్యం రంగరించుకున్న ఈ సినిమాకు తోటపల్లి సాయినాథ్ అందించిన అద్భుతమైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.తమిళ, కన్నడ,హిందీ భాషల్లోనూ నిర్మాణమై దేశవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకుంది. ఆత్రేయ, సినారె, సిరివెన్నెల గీతాలు రసవృష్టిలో ప్రేక్షకులను ముంచిముద్దచేశాయి. పసిడికి తావి అబ్బినట్లు ఆ కవుల కలం నుంచి జాలువారిన స్వర్ణాక్షరాలకు ఇళయరాజా రసరమ్యమైన సుస్వరాలను జతచేశారు. అమాయకుడిగా కమల్ హాసన్ పాత్ర భారతీయ సినిమాల్లో చిరంజీవిగా నిలిచిపోయింది. రాధిక, నిర్మలమ్మ పోటీపడి నటించారు. గొల్లపూడి, శరత్ బాబు, జెవి సోమయాజుల మొదలైన నటులు పాత్రలకు జీవం పోశారు. ఎమ్ వి రఘు ఛాయాగ్రహణం సహజత్వానికి అద్దం పట్టింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక లోని అనేక ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. కె విశ్వనాథ్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ సంభాషణా రచయిత తోటపల్లి సాయినాథ్, శుభోదయం గ్రూప్ అధినేత కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్, సీఈఓ ఎ.సూర్యప్రకాశరావు,
డైరెక్టర్ గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ,
కె విశ్వనాథ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ కళాకారిణి కొప్పోలు స్వర్ణశ్రీ చేసిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతిముత్యం విడుదలై మూడున్నర దశాబ్దాలు దాటినా, వన్నె తగ్గని ముత్యంగా మెరిసిపోతోంది.