Thursday, November 21, 2024

స్వాతిముత్యం ఒక ఆణిముత్యం

  • అమాయకుడిగా కమలహాసన్ చిరంజీవి
  • రాదిక, నిర్మలమ్మ పోటీపడి నటించిన చిత్రం

 ఇటీవలే ‘కళాతపస్వి’ కె విశ్వనాథ్ శివైక్యం చెందారు. ఆయన భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా ఆయన సృజియించిన సినిమాలు ఆయనను చిరంజీవిగా నిలిపాయి. వాటిల్లో ‘స్వాతిముత్యం’ ఒక ఆణిముత్యంగా ఎన్నదగినది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి మూడున్నర దశాబ్దాలు దాటిపోయింది. పోయిన సంవత్సరం ‘శుభోదయం మీడియా’ అనే సంస్థ హైదరాబాద్ లో  విశ్వనాథ్ నివాసంలో ఆత్మీయ వేడుక నిర్వహించి ఆయనను ఘనంగా సత్కరించింది. ఆ వేడుకలో కళాతపస్వి పసిబాలుడులా మురిసిపోయారు. ఆ సినిమాలో భాగస్యామ్యులైన నటులు, కళాకారులు తమ అనుభవాలు, అనుభూతులు, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దృశ్యరూపంలో సందేశాలు పంపారు. ఆత్మీయంగా జరిగిన ఆ వేడుక ఆద్యంతం హృద్యంగా సాగింది. దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న గొప్ప కుటుంబ కథాచిత్రంగా ‘స్వాతిముత్యం’ అవార్డుల పంటలు పండించింది.

Also read: స్త్రీపురుషుల సమానత్వాన్నిస్వాగతిద్దాం

దేశమంతటా సంచలనం సృష్టించిన చిత్రం

1986,మార్చి 13 వ తేదీ విడుదలైన ఈ సినిమా భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీని పొందింది. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆనాడే ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు బంగారు నందిని కూడా అందుకుంది. దర్శకత్వ విభాగంలో ఫిల్మ్ ఫేర్ విజేతగా నిలిచింది. కమల్ హసన్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. సంప్రదాయం, సంచలనం, సంగీతం, సాహిత్యం రంగరించుకున్నఈ సినిమాకు తోటపల్లి సాయినాథ్ అందించిన అద్భుతమైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళ,కన్నడ, హిందీ భాషల్లోనూ నిర్మాణమై దేశవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకుంది.

Also read: గోదావరి – కావేరి అనుసంధానం అయ్యేనా?

ముగ్గురు కవుల అక్షర విన్యాసం

ఆత్రేయ ,సినారె, సిరివెన్నెల గీతాలు ప్రేక్షకులను రసవృష్టిలో  ముంచి ముద్దచేశాయి. పసిడికి తావి అబ్బినట్లు ఆ కవుల కలం నుంచి జాలువారిన స్వర్ణాక్షరాలకు ఇళయరాజా రసరమ్యమైన సుస్వరాలను జతచేశారు. అమాయకుడిగా కమల హాసన్ పాత్ర భారతీయ సినిమాల్లో చిరంజీవిగా నిలిచిపోయింది. రాధిక, నిర్మలమ్మ పోటీపడి నటించారు. గొల్లపూడి, శరత్ బాబు, జెవి సోమయాజుల మొదలైన నటులు పాత్రలకు పోశారు. ఎమ్ వి రఘు ఛాయాగ్రహణం సహజత్వానికి అద్దం పట్టింది.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక లోని అనేక ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. స్వాతిముత్యం విడుదలై ఇన్నేళ్లయినా వన్నె తగ్గని మేలిముత్యంలా మెరిసిపోతోంది.

Also read: విశాఖ వైశిష్ట్యం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles