తిరుమల: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలు ఆదివారంనాడు తిరుమలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీ వారి సేవలో విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఆయనకు తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కొవిడ్ నుంచి లోకమంతా త్వరగా బయటపడాలని స్వామి వారిని వేడుకున్నట్లు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఆయన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి తో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. భక్తులకు మేలు చేకూరేలా తితిదే నిర్వహిస్తోన్న గీతాపారాయణం, భగవద్గీత ప్రవచానాలు అద్భుతమని ఆయన కొనియాడారు. స్వరూపానందస్వామిని తిరుమల తిరుపతి దేవస్థానాల అదికారులు వెలుపలకు వచ్చి సాదరంగా స్వాగతం చెప్పి ఆలయంలోకి తీసుకొని వెళ్ళారు.
శ్రీవారిని సందర్శంచిన ఇతర ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ఇతర ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్ రామ్ శంకర్ ఖథేరియా, ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి విజయానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. కర్ణాటక అదనపు సీఎస్ ఐఎన్ఎస్ ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తెదేపా నేత శ్రీనివాసులురెడ్డి తదితరులు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ప్రముఖులకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందచేశారు.
భక్తుల సందేహాలకు ఈవో జవహర్ రెడ్డి సమాధానాలు
అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల ప్రశ్నలకు తితిదే ఈవో జవహర్ రెడ్డి సమాధానాలిచ్చారు. కొవిడ్ వల్ల ఆర్జితసేవల టికెట్లు రద్దైన వారికి డిసెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఈవో అన్నారు. కొవిడ్ మార్గదర్శకాలు వచ్చాకే వృద్ధులు, పిల్లలకు దర్శన అవకాశం ఇస్తామన్నారు. శివ కేశవుల అబేధం వివరించేందుకే శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నాద నీరాజన వేదికపై గీతా పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలను కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనం టికెట్లు… ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లలో జారీకి సమయం పడుతుందన్నారు. తిరుమలలో 200 మందిలోపు ఆహ్వానితులతో వివాహాలకు అనుమతినిస్తున్నట్లు తితిదే ఈవో పేర్కొన్నారు.