ఆయన రాజీనామాకైనా సిద్ధపడే వారు తప్ప రాజీకి ఇష్టపడేవారు కాదని చెబుతారు. జేబులో రాజీనామా పత్రం సిద్ధంగా ఉండేది. ఆత్మగౌరవం గల చాలా మంది పాత్రికేయుల లక్షణం అదే అయినా ఖాసా సుబ్బారావు గారిది మరింత ప్రత్యేకమైనదిగా చెబుతారు. అవసరమైతే యజమాని మాటలను కూడా పట్టించుకోని సందర్బాలు ఉన్నాయి. అయినా ఆయన నిబద్ధతను మెచ్చి, అభిప్రాయాలను మన్నించిన `అంధ్రకేసరి` లాంటి వారూ ఉన్నారు. కాబట్టే పత్రిక ఆరంభం నుంచి నిలిచిపోయేంతవరకు దాదాపు దశాబ్దంన్నర పాటు ఆయన పత్రిక ‘స్వరాజ్య’లో పనిచేయగలిగారు. ఇంగ్లీష్ పత్రికా రంగంలో ఉన్నత స్థానాలు అధిష్ఠించిన వారిలో ఖాసా సుబ్బారావు ఒకరు. గాజుల లక్ష్మీనర్సు సెట్టి, కోటంరాజు సోదరులు (పున్నయ్య,రామారావు), ఎం.చలపతి రావు, కోలవెన్ను రామకోట కోటేశ్వరరావు, సీవై చింతామణి తదితరులు ఇంగ్లీష్ పాత్రికేయంలో తమ ప్రత్యేకతను చూపారు. ఉత్తరాది వెళ్ళి దివిటీల మాదిరి వెలిగారు.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలిలో 1896 జనవరి 23న జన్మించిన ఖాసా సుబ్బారావు పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వారు. ఆయన పాఠశాల విద్యను నెల్లూరులో పూర్తి చేసి, మద్రాసు రాజధాని (ప్రెసిడెన్సీ) కళాశాలలో ఫిలసఫీ ప్రధానాంశంగా పట్టభద్రులయ్యారు. అనంతర కాలంలో దేశాధ్యక్షుడిగా సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనకు గురువు. ఖాసా సుబ్బారావుపై గురువు సర్వేపల్లి బోధన ప్రభావం ఉంది. ఖాసా డిగ్రీ తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నప్పటికీ న్యాయవాద వృత్తి చేపట్టలేదు. రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు.
ఉపాధ్యాయుడిగా
న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నప్పటికీ న్యాయవాద వృత్తి చేపట్టలేదు. రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. నేటి ప్రకాశం జిల్లా కందుకూరు . ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా చేరారు. రాత్రి వేళల్లో వయోజనులకు చదువు చెప్పారు. కొన్నాళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగానికి స్వస్తి పలికారు.
పాత్రికేయుడిగా
ఉపాధ్యాయ వృత్తి నుంచి పాత్రికేయం వైపు మళ్లారు ఖాసా. టంగుటూరు ప్రకాశపంతులు మద్రాసులో స్థాపించిన (1921) `స్వరాజ్య` ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరారు. ఆయనతో పాటు ఎం. చలపతిరావు, కోలవెన్ను కోటేశ్వరరావు, కోటంరాజు రామారావు,ఎన్.ఎస్. వరదాచారి, నార్ల వేంకటేశ్వరరావు, కంభంపాటి సత్యనారాయణ తదితరులు ఉప సంపాదకులుగా వ్యవహరించారు. వృత్తిపరంగా రాణించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడిందని చెప్పేవారు. ఆర్థిక సంక్షోభం కారణంగా పత్రిక పదిహేనేళ్లకు మూతపడింది. దాంతో `ఇండియన్ ఎక్స్ ప్రెస్`లో చేరి జాయింట్ ఎడిటర్ వ్యవహరించారు.
నిబంధనలు అందరికీ ఒక్కటే అని, ఇంట గెలిచి రచ్చగెలవానలన్నది ఖాసా వారి భావన. ఆయన వాటిని పాటించేవారు అనేందుకు ఒక ఉదాహరణ.`స్వరాజ్య` పత్రికలో సాయంత్రం ఐదు గంటల వరకే వార్తలు తీసుకునేవారు. పత్రిక గౌరవ సంపాదకుడు కూడా అయిన ప్రకాశం పంతులు గారు ఒకసారి గడువు దాటిన తరువాత పంపిన వార్త(తపాలా శాఖ ఉద్యోగలు జీతాలు సరిగా లేవని)ను ఖాసా వారు తిరస్కరించారు. సమయం దాటి పోయిన తరువాత వార్త అందడం ఒక కారణమైతే, పత్రికా సిబ్బంది జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతుంటే ఎవరికో జీతాలు తక్కువగా ఉన్నాయని వార్త ప్రచురించాలనడం సరికాదన్నది ఖాసా వారి అభిప్రాయం. పత్రికా సంపాదకుడి హోదాలో తన విచక్షణను ఉపయోగించాలన్నదే తప్ప ప్రకాశం గారిని తప్పు పట్టాలని కాదు. ఆ పత్రిక సంపాదకవర్గానికి ప్రకాశం నైజం తెలియనిది కాదు. న్యాయవాద వృత్తిలో ఆర్జినదంతా పత్రికా నిర్వహణకు, ప్రజాశ్రేయస్సుకు ఖర్చు పెట్టడం పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, ఇతరుల పట్ల అనవసర జాలి ఎందుకన్నదే ఖాసా లాంటి వారి ప్రశ్న. స్వరాజ్య ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాలన్న లక్ష్యమే తప్ప వ్యాపార మర్మం తెలియనందునే ఆర్థిక సంక్షోభంతో పత్రిక నిలిచిపోయింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సహ ఉద్యోగికి అన్యాయం జరిగిందని రాజీనామా చేశారు.
‘ప్రభ’ వ్యవస్థాపక సంపాదకుడిగా
మొదటే ప్రస్తావించినట్లు `ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో జాయింట్ ఎడిటర్ హోదాలో ఉన్న ఖాసా వారిని పత్రికాధిపతి రామ్ నాథ్ గోయెంకా `ఆంధ్రప్రభ` ( 1938) దిన పత్రిక వ్యవస్థాపక సంపాదకునిగా నియమించారు. దివవంగత సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు ఒక సందర్భంలో అన్నట్లు, `సచ్చరిత్రులను, దేశభక్తులను తమ సంపాదకవర్గంలోకి తీసుకున్నారు. ఖాసా వారినే తీసుకుంటే ఆయన స్వరాజ్య సమరంలో పాల్గొని రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు.` అయితే కొద్ది నెలలకే ఆ బాధ్యత నుంచి తప్పుకోవలసి వచ్చింది. అటు తర్వాత `లిబర్టీ`(కోల్ కత్తా),` ఇండియన్ ఫైనాన్స్, ఫ్రీప్రెస్ జర్నల్ ( బొంబాయి) పత్రికలలో పనిచేశారు.
సొంత పత్రిక
స్వతంత్ర భావాలు కలిగిన ఖాసా ఇతర పత్రికలలో ఇమడలేక మిత్రుడు ఉప్పులూరి కాళిదాసు సహకారంతో 1946లో `స్వతంత్ర` ఆంగ్ల వారపత్రికనూ, రెండేళ్ల తర్వాత (1948)`తెలుగు స్వతంత్ర`నూ ప్రారంభించారు. ఈ రెండు రాజకీయ వారపత్రికలను పదేళ్ల పాటు నడిపారు.
సత్యాగ్రాహి
గాంధీమహాత్ముడు సహాయనిరాకరణ ఉద్యమం పిలుపునందుకుని స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం లక్ష్యాన్ని వివరించేందుకు గ్రామగ్రామం తిరిగారు. తల్లి రామాబాయమ్మ ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా కుమారుడి లక్ష్య సాధన కోసం వెన్నంటే తిరుగుతూ ఆయన బాగోగులు చూసుకోవడం అపురూప సంఘటనగా చెబుతారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఖాసాకు ఆరు నెలలు కఠిన జైలు శిక్ష పడింది. ఆ మరుసటి సంవత్సరం (1931) మద్రాసు చైనాబజారులో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో తీవ్ర రక్తస్రావమై మూర్చిల్లిన సంఘటన బ్రిటీష్ పార్లమెంటులో ప్రకంపనలను సృష్టించింది. ఆ సంఘటనపై విచారణ జరిఫిన ఏక సభ్య కమిషన్ లార్డ్ లూథియన్ సంఘటనను ఖండించి, చికిత్స పొందుతున్న ఖాసాను పరామర్శించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని సుమారు 20 నెలలు జైలు జీవితం అనుభవించారు.
నెల్లూరుజిల్లా పల్లిపాడులో గాంధీజీ ప్రాంరంభించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమంలో తల్లి రమాబాయమ్మ, భార్య భవానీబాయ్ తో కొంతకాలం ఉన్నారు. తోటి ఆశ్రమవాసులతో కలసి సత్యం, అహింస, బ్రహ్మచర్యం లాంటి 11 సూత్రాలను ఆచరిస్తూ, వాటి ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. 1932 ప్రాంతంలో ఖాసా వారికి భార్యా వియోగం కలిగింది. సంసారం కంటే సమాజం ముఖ్యమన్న భావనతో ప్రజాహిత కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ 65వ ఏట కన్నుమూశారు.
మానవతావాది
ఖాసా సుబ్బారావు గొప్ప సంపాదకుడే కాకుండా అంతకు మించిన మానవతావాది. విద్యార్థి దశనుంచి సానుభూతి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించేవారు. విద్యార్థి దశలో ఒక బీద విద్యార్థికి తన రెండు జతల దుస్తులు దానం చేసి ఒక జత దుస్తులతో సర్దుకున్నారు. ఉద్యోగ జీవితంలో సహచరుల జీతభత్యాల విషయంలో యాజమాన్యం తీరుకు నిరసన తెలుపుతూ సహోద్యోగులకు మద్దతుగా ఉండేవారు. సంపాదకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన తరువాత తన దుస్తులు శుభ్రపరచే వరదన్ అనే వ్యక్తి గురించి `స్వతంత్ర` పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాశారు. పత్రికలలో ప్రచురితమైన రచనలకు పారితోషికం చెల్లించే సంప్రదాయం అంతగా లేని కాలంలో కొందరు ఔత్సాహిక రచయితలు రాసిన లేఖలకు స్పందించి పారితోషికం ఇచ్చే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
(ఈ నెల 23న ప్రఖ్యాత పాత్రికేయుడు ఖాసా సుబ్బారావు జయంతి)