ఎస్ వి రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకళాకారుడనీ, ఆయన జీవితయానంపైన పుస్తకం తేవాలంటే చాలా అధ్యయనం చేయవలసి ఉంటుందని ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు, చిత్రకళాకారుడు, కవి బి. నర్సింగ్ రావు అన్నారు. ‘ఆర్ట ఎట్ తెలంగాణ’ వంటి పుస్తకం ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిత్రకళాకారులపైన తీసుకురావాలంటే వ్యయభారంతో పాటు ఎంతో శ్రద్ధగా విషయసేకరణ జరగాలనీ, రామారావుపైన భారతిలో ప్రచురించిన వ్యాసాలు మొదలు అన్ని పత్రికలలో వచ్చిన వ్యాసాలనూ, ప్రముఖుల అభిప్రాయాలనూ తెలుసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.
ఎస్ వి రామారావు రచించిన కవితా సంకలనం ‘ఆలోలాంతరాళాలలో’ను నర్సింగ్ రావు శుక్రవారంనాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. 2014 నుంచి 150 మంది కళాకారుల మోనోగ్రాఫ్ లు సేకరించామనీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేకమంది చిత్రకళాకారుల జీవితాలను అధ్యయనం చేయవలసి ఉన్నదనీ నర్సింగ్ రావు అన్నారు. తెలుగువారు సంస్కృతి, కళలు, సాహిత్యానికి సంబంధించి సమైక్యతాభావం ఆచరించాలనీ, తెలుగువారందరికీ తెలుగు చిత్రకళాకారుల జీవితాలను చదివి, వారి నుంచి ప్రేరణ పొందవలసిన అవసరం ఉన్నదని నర్సింగ్ రావు చెప్పారు. తెలుగు చిత్రకళాకారుల జీవిత విశేషాలను భావి తరాలకు అందించవలసిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.
ప్రముఖ చిత్రకళాకారుడూ, హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో కళల చరిత్ర అధ్యాపకుడు గడపా ఆనంద్ మచిలీపట్టణంలోని ఆంధ్రజాతీయ కళాశాల గురించి మాట్లాడారు. ఆ కళాశాలపైన ప్రమోద్ కుమార్ ఛటర్జీ ప్రభావం ఉండేదని గుర్తు చేశారు. ప్రముఖ చిత్రకళాకారుల జీవిత చరిత్రలు సేకరించి, ప్రచురించడంలో నర్సింగ్ రావుతో కలసి పని చేస్తున్నాననీ, రామారావు గురించి కూడా పూర్తిగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్రకళాకారుల జీవిత విశేషాలను సేకరించి ప్రచురించి భావి తరాలకు అందించాలని ఆనంద్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు ఎస్ వి రామారావు కవితా సంకలనాన్ని పరిచయం చేశారు. ఆలోలాంతరాళాలలో అంటే అర్థం విడమరచి చెబుతూ, ఆలోల అంటే స్వేచ్ఛగా అటూ ఇటూ ఊగుతూ ఉండటమనీ, అంతరాళాలలో అంటే ఒకటి కంటే మించిన అంతరాళాలనీ, అంటే పెక్కు అంతరాళాలు కలిసిన విశ్వాంతరాళమనీ వివరించారు. విశ్వాంతరాళాలలో స్వేచ్ఛగా విహరించడమని స్థూలంగా అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రపంచంలో కొంతమంది విశేషమైన ప్రతిభావంతులు మాత్రమే ఇటు చిత్రకళలో రాణిస్తూ అటు కవిత్వం కూడా రాశారని చెబుతూ మైఖేల్ ఎంజిలో, విలియం బ్లేక్ నుంచి రవీంద్రనాథ్ టాగోర్, అడవి బాపిరాజు వరకూ ఉదాహరణలు ఇచ్చారు. టాగోర్ ని కవిగా కంటే చిత్రకారుడిగా చెప్పుకొనేందుకు బెంగాళీలు గర్విస్తారని అన్నారు. రామారావు ప్రఖ్యాత చిత్రకారుడనీ, కవి ఆయనేననే వాస్తవాన్ని కాసేపు మరచిపోయి ఈ పుస్తకంలోని కవితలు చదివినా అవి ప్రభావవంతంగా ఉంటాయని చినవీరభద్రుడు చెప్పారు. రామారావు రంగుల మేళవింపులో నిష్ణాతులనీ, ఆ రంగుల ప్రభావం తన కవితలపైన పడకుండా చూసుకున్నారనీ అభినందించారు. ఎస్ వి రామారావు రాశారనే సంగతి పక్కన పెట్టి కవితలను చదివితే అవి అర్థవంతంగా, మనోహరంగానూ ఉన్నాయని ఆయన అన్నారు.
మన దేశంలో తెలుగు చిత్రకారులతో సహా మొత్తం భారతీయ చిత్రకారులకు స్వాతంత్ర్య పోరాటం నాటి నుంచి విదేశీ చిత్ర, శిల్పకళాశైలిని వదిలించుకునే ప్రయత్నాలు జరిగాయని ప్రముఖ జర్నలిస్టు, కళావిమర్శకుడు తల్లావఝల శివాజీ అన్నారు. ఈ దశలో మొత్తం దేశంలో ఆధునికతకు ప్రాధాన్యతనిస్తూ సరికొత్తదనం కోసం తిప్పలు పడ్డది ఇద్దేననీ, ఒకరు షేర్గిల్ కాగా రెండవ వ్యక్తి ఎస్ వి రామారావనీ అన్నారు. బెంగాల్ స్కూలూ, బందరు స్కూలూ, మద్రాసు స్కూలూ, మరో వైపు నుంచి రాజమండ్రి లో కూల్డ్రే దొర సారథ్యంలో దామెర్ల, తదితరుల మహనీయ కృషి పూర్తి స్థాయి జాతీయ శైలి అనడానికి లేని కలోనియల్ లేదా మన అజంత శైలికి అనుకరణ దశలో కాస్త అటూఇటూగా ఉన్నవేనని శివాజీ వ్యాఖ్యానించారు.
చిత్రకళలో స్వీయ ఆధునికత మార్గం ఎంచుకున్న దామెర్ల వంటివారు తొందరగా వెళ్ళిపోయారనీ, రామారావు మాత్రం 195060 ప్రాంతంలో తాను నేర్చింది విడిచిపెట్టి నైరూప్య చిత్రాలను గీయడంలో సొంత శైలిని ఆవిష్కరించుకున్నారని శివాజీ అన్నారు. అందులో భారతీయ, ప్రాంతీయ ప్రాభవం సత్తా ఏమిటో ప్రపంచానికి చూపెట్టారనీ, పికాసో, బ్రేక్వె, దాలి సరసన నిలిచారనీ శివాజీ అన్నారు.
ప్రఖ్యాత చిత్రకళాకారుడు గిరిధర్ గౌడ్ రామారావు నుంచి తాను పొందిన ప్రేరణ గురించి మాట్లాడారు. షికాగో నుంచి వచ్చిన మాదిరెడ్డి పద్మలత రామారావు షికాగోలో ఎంత నిరాడంబరంగా, అర్థవంతంగా జీవిస్తన్నారో, సమాజానికి ఏ విధంగా సేవలందిస్తున్నారో వివరించారు. సీనియర్ జర్నలిస్టు, కళావిమర్శకుడు పున్నా కృష్ణమూర్తి వందన సమర్పణ చేశారు. పాత్రికేయుడు డాక్టర్ రామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. హైదరాబాద్ లో ఉన్న కళాభిమానులూ, ఎస్ వి రామారావు అభిమానులూ ఈ సభకు హాజరైనారు. ఆలోలాంతరాళాలలో నగేష్, ఆయన భార్య డాక్టర్ సరస్వతి సహకారంతో పుస్తకరూపంలో వెలువడింది. గిరిధర్ గౌడ్, సురేష్, సోమయ్యలు తెనాలి నుంచి శివాజీరాజు భీమవరం నుంచి ఈ పుస్తకావిష్కరణ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఈ పుస్తకాన్ని ‘తెనాలి ప్రచురణలు’ ప్రచురించింది.